ఆర్థిక వ్యవస్థకు ఆ నాటి సంస్కరణలు

by Harish |
ఆర్థిక వ్యవస్థకు ఆ నాటి సంస్కరణలు
X

దిశ, వెబ్‌డెస్క్: నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లయిడ్ ఎకనామిక్ రీసెర్చ్ (NCAER) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థ 12.6 శాతం కుదించుకుపోవచ్చని అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంతా వృద్ధి ప్రతికూలంగా ఉంటుందని శుక్రవారం విడుదల చేసిన జూలై-సెప్టెంబర్ త్రైమాసిక నివేదిక వెల్లడించింది. రెండో త్రైమాసికంలో 12.7 శాతం సంకోచం ఉండనుందని, తర్వాత మూడో త్రైమాసికంలో 8.6 శాతం, నాలుగో త్రైమాసికంలో 6.2 శాతం ప్రతికూలంగా ఉండనున్నట్టు నివేదిక పేర్కొంది.

వచ్చే ఆర్థిక సంవత్సరంలో కొవిడ్-19 వ్యాప్తి నుంచి ఆర్థిక వ్యవస్థ రికవరీని బట్టి పరిస్థితులు ఉండొచ్చని, ప్రస్తుతానికి అస్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయని నివేదిక తెలిపింది. అలాగే, రెండో త్రైమాసికంలో ద్రవ్యోల్బణం 6.6 శాతానికి చేరుకోవచ్చని, ఆర్థిక సంవత్సరం మొత్తానికి ద్రవ్యోల్బణం 6.5 శాతానికి మాత్రమే తగ్గే సూచనలున్నాయని నివేదిక వెల్లడించింది. ప్రస్తుత సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ద్రవ్యత, ఆర్థిక విధానాలకు సాంప్రదాయిక విధానం సరిపోదని నివేదిక అభిప్రాయపడింది.

అదేవిధంగా దేశ స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ)లో మొత్తం ఆర్థిక లోటు 13 శాతంగా నివేదిక అంచనా వేసింది. ప్రస్తుత సమస్యలను అధిగమించడానికి 1991 నాటి సంస్కరణలు అవసరమని నివేదిక తెలిపింది. బ్యాంకులు, ఆర్థిక సంస్థల బలమైన పర్యవేక్షణ ద్వారా ఆర్థిక రంగం స్థిరత్వాన్ని కాపాడుకునేందుకు ప్రభుత్వం దృష్టి పెట్టాలని నివేదిక వెల్లడించింది. బ్యాడ్ బ్యాంకు ఏర్పాటు, ప్రభుత్వ బ్యాంకుల్లో పాక్షిక పెట్టుబడులు పెట్టడం, పాలన సంస్కరణలు, ఎంఎస్ఎంఈ సంస్థకలు రుణాలు ఇచ్చేందుకు మరింత ప్రభావవంతమైన ప్రోత్సాహకలా ద్వారా నిరర్ధక ఆస్తుల పరిష్కారం అవసరమని నివేదిక తెలిపింది.

Advertisement

Next Story