వచ్చే ఐదేళ్లలో పెరగనున్న అత్యధిక సంపన్నుల సంఖ్య

by Harish |
వచ్చే ఐదేళ్లలో పెరగనున్న అత్యధిక సంపన్నుల సంఖ్య
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో అల్ట్రా-హై-నెట్‌వర్త్ వ్యక్తులు(యూహెచ్ఎన్‌డబ్ల్యూఐ) అంటే సుమారు రూ. 200 కోట్లకు పైగా ఆస్తులను కలిగి ఉన్నవారు వచ్చే ఐదేళ్లలో 63 శాతానికి పెరగనున్నారని నైట్‌ఫ్రాంక్ అభిప్రాయపడింది. వెల్త్ రిపోర్ట్-2021 నివేదికలో ఈ మేరకు వీరి సంఖ్య మరో ఐదేళ్లకు 11,198కి చేరుకుంటుందని తెలిపింది. ప్రస్తుతం దేశీయంగా వీరి సంఖ్య 6,884గా ఉంది. అలాగే, దేశంలో 113 మంది బిలియనీర్లు ఉన్నారని నైట్‌ఫ్రాంక్ పేర్కొంది.

బిలీయనీర్ల సంఖ్య సైతం రాబోయే ఐదేళ్లలో 43 శాతం పెరిగి 162కు చేరుకుంటుందని అంచనా. ఈ వృద్ధి ప్రపంచ సగటు 24 శాతం, ఆసియా సగటు 38 శాతం కంటే అత్యధికం. అదేవిధంగా, సంపన్నుల జాబితాలోకి చేరే పరిమితి ప్రస్తుతం సుమారు రూ. 45 లక్షల కాగా, ఇది ఐదేళ్లలో రెట్టింపు అవుతుందని నివేదిక తెలిపింది. ప్రపంచ మార్కెట్లో అనిశ్చితి ఉన్నప్పటికీ, 2020లో భారత్‌లో అధిక సంపన్నులు వారి సంపదలో 59 శాతం పెరుగుదలను సాధించారు. అలాగే, ఈ ఏడాది వీరిలో 91 శాతం మంది తమ సంపద మరింత పెరుగుతుందని ఆశిస్తున్నారు. ప్రధానంగా కొత్త ఆర్థిక విధానాలే దీనికి కారణమని వారు అంచనా వేస్తున్నారు.

Advertisement

Next Story