బూస్టర్ డోస్‌పై గందరగోళం.. ఆర్డర్స్ కోసం తెలంగాణ ప్రభుత్వం నిరీక్షణ

by Shyam |   ( Updated:2021-11-26 23:32:22.0  )
బూస్టర్ డోస్‌పై గందరగోళం.. ఆర్డర్స్ కోసం తెలంగాణ ప్రభుత్వం నిరీక్షణ
X

దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా వైరస్‌ను తప్పించుకోడానికి బూస్టర్ డోస్ తప్పనిసరా? రెండు డోసులు వేసుకున్నా బూస్టర్ తీసుకోవాల్సిందేనా? ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుంది? ఇందుకు విధివిధానాలేంటి? ఎప్పుడు వేసుకోవాలి? దాని రేటెంత? ఇలాంటి అనేక సందేహాలకు ఇప్పటివరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సమాధానాల్లేవు. వైరస్ బారి నుంచి తప్పించుకోడానికి రెండు డోసులు తీసుకున్నందున ఆరు నెలలు దాటడంతో బూస్టర్ డోస్ తీసుకోవాలనే ఆలోచనలో చాలా మంది ఉన్నారు. దీంతో ఎప్పుడు నిర్ణయం వెలువడుతుందా? అని ఎదురుచూస్తున్నారు. విదేశాల్లో ఇప్పటికే బూస్టర్ డోస్‌లు అమలులోకి వచ్చినందున కాస్త ఆలస్యంగానైనా మన దేశంలోనూ అందుబాటులోకి వస్తుందనేది అభిప్రాయం చాలా మందికి ఉన్నది. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం దీనిపై స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. ఐసీఎంఆర్ నుంచి ఎలాంటి సిఫారసులూ ప్రభుత్వానికి వెళ్లలేదు. వైద్య నిపుణులు సైతం బూస్టర్ డోస్ ఆవశ్యకతపై ఆలోచన చేయలేదు. త్వరలో జరగనున్న నేషనల్ టెక్నికల్ అడ్వయిజరీ గ్రూపు సమావేశంలో దీనిపై చర్చించనున్నది.

బూస్టర్ డోస్ ఆవశ్యకతపై కేంద్ర ప్రభుత్వానికి తగిన సిఫారసు చేయనున్నది. దేశంలో కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి, పంపిణీకి కొరత లేకపోయినప్పటికీ అర్హులందరికీ రెండు డోసులను ఇచ్చే ప్రక్రియ పూర్తయ్యాకే బూస్టర్ డోస్ పై ఆలోచించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఇప్పటివరకు దేశంలో సుమారు 120 కోట్ల మందికి వ్యాక్సిన్ పంపిణీ అయింది. ఇందులో 77 కోట్ల మందికి ఫస్ట్ డోస్, 42 కోట్ల మందికి సెకండ్ డోస్ ఇచ్చిన కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వశాఖ డిసెంబరు చివరికల్లా సెకండ్ డోస్ కూడా అందరికీ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ప్రస్తుతం బూస్టర్ డోస్‌ను కూడా ప్రారంభిస్తే పంపిణీ ప్రక్రియలో సిబ్బంది కొరత ఉంటుందనే అభిప్రాయాన్నీ కేంద్ర వైద్యారోగ్య శాఖ వర్గాలు ఉదహరించాయి. సరిగ్గా ఇదే పరిస్థితిని అంచనా వేసిన తెలంగాణ ప్రభుత్వం కూడా కేంద్రం నుంచి మార్గదర్శకాలు ఎప్పుడు వచ్చినా అమలు చేయడానికి సిద్ధంగా ఉండేలా డిసెంబరు చివరికల్లా రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేస్తున్నది. ఈ మేరకు అధికారులకు మంత్రి హరీశ్​రావు ఆదేశాలు జారీ చేశారు.

థర్డ్ డోసే బూస్టర్ డోస్

కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 16న వ్యాక్సినేషన్ ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించింది. హెల్త్ కేర్ స్టాఫ్, ఫ్రంట్‌లైన్ వర్కర్లు, 45 ఏళ్ల వయసు పైబడినవారు.. ఇలా వివిధ ప్రాధాన్యాలతో టీకాల పంపిణీ కొనసాగిస్తున్నది. మొదటి డోస్ తీసుకున్న 4 వారాల తర్వాత రెండో డోస్ అంటూ తొలి వారాల్లో అమలుచేసినా ఆ తర్వాత రెండు డోసుల మధ్య గ్యాప్‌ను 12 వారాలకు పెంచింది. అయితే బూస్టర్ డోస్ అంటూ ప్రత్యేకంగా లేకపోయినా రెండు డోసులు పూర్తి చేసుకుని ఆరు నెలల వ్యవధి దాటినవారికి ఇది అవసరం అంటూ మౌఖికంగా కేంద్ర, రాష్ట్ర వైద్యారోగ్య శాఖల అధికారులు పేర్కొన్నారు. రెండు డోసులు పూర్తి చేసుకున్నవారికి ఇచ్చే థర్డ్ డోస్‌నే బూస్టర్ డోస్ అని పేర్కొన్నారు. ఒక డోస్ వ్యాక్సిన్ తీసుకున్నవారికి ఆరు నెలల పాటు రోగ నిరోధక శక్తి ఉంటుందని, రెండో డోస్ తీసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో సమకూరుతుందని మొదట్లో వైద్యులు తెలిపారు. క్రమేపీ వైరస్ వ్యాప్తి తగ్గడం, కొత్త కేసులు నమోదు కావడం గణనీయంగా పడిపోవటం, మృతుల సంఖ్య కూడా బాగి తగ్గిపోవటం, ప్రజల్లో వైరస్‌ను తట్టుకునే శక్తి ఏర్పడడం.. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని బూస్టర్ డోస్‌పైన వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడింది. నేషనల్ టెక్నికల్ అడ్వయిజరీ గ్రూపు సమావేశం తర్వాత దీనిపై మరింత క్లారిటీ రానున్నది.

బూస్టర్ డోస్‌పై శాస్త్రీయ ఆధారాల్లేవ్ : డాక్టర్ బలరాం భార్గవ
“కరోనా బారి నుంచి తప్పించుకోడానికి వ్యాక్సిన్ అవసరమే. కానీ బూస్టర్ డోస్ కూడా అవసరమనడానికి శాస్త్రీయపరమైన ఆధారాలేవీ లేవు. ఇంకా పూర్తిగా రెండు డోసులు తీసుకోనివారు కూడా చాలా మంది ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం తొలుత ఆ ప్రక్రియపై దృష్టి పెట్టింది. దేశంలో వైరస్ వ్యాప్తి, దాని బారిన పడుతున్నవారు, వైరస్ కలిగిస్తున్న తీవ్రత, మృతుల సంఖ్య.. ఇలా అన్నంటినీ పరిగణనలోకి తీసుకుని టెక్నికల్ అడ్వయిజరీ గ్రూపు బూస్టర్ డోస్‌ ఆవశ్యకతపై అధ్యయనం చేస్తుంది. అది తీసుకునే నిర్ణయం, ప్రభుత్వానికి చేసే సిఫారసులకు అనుగుణంగా మార్గదర్శకాలు రూపొందుతాయి”.

ఇప్పట్లో బూస్టర్ అవసరం లేదు : డాక్టర్ గులేరియా, ఎయిమ్స్ డైరెక్టర్

“ప్రస్తుతం దేశంలో థర్డ్ వేవ్ విషయంలో పెద్దగా ఆందోళన లేదు. ఒకవేళ వచ్చినా మొదటి రెండు వేవ్‌ల తరహాలో తీవ్రంగా ఉండదు. దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతూ ఉన్నది. కొత్త కేసులూ తగ్గుతున్నాయి. ఇప్పటికే తీసుకున్న వ్యాక్సిన్‌ ప్రభావం సంతృప్తికరంగా ఉన్నట్లు అర్థమవుతున్నది. అందువల్లనే వైరస్ వ్యాప్తి కంట్రోల్‌లో ఉంది. ఆస్పత్రుల్లో అడ్మిషన్లూ తగ్గుతున్నాయి. సీరియస్ అనారోగ్యం కూడా తగ్గింది. పాండమిక్ నుంచి ఎండెమిక్ దిశగా వెళ్తున్నాం. కొత్త కేసులు వచ్చినా తీవ్రత, సీరియస్‌నెస్ తగ్గింది. అందువల్ల థర్డ్ డోస్ లేదా బూస్టర్ డోస్ ఇప్పుడు అవసరంలేదు”.

నిపుణుల సిఫారసులకు అనుగుణంగా నిర్ణయం : మన్‌సుఖ్ మాండవీయ, కేంద్ర వైద్య మంత్రి

“దేశంలో టార్గెట్‌గా పెట్టుకున్న మొత్తం జనాభాకు వ్యాక్సిన్ ఇవ్వడంపైనే ప్రస్తుతం ఫోకస్ పెట్టాం. అవసరమైనంత స్టాకు కూడా సిద్ధంగా ఉన్నది. ఎలాంటి కొరత లేదు. బూస్టర్ డోస్‌ ఇవ్వాల్సి వచ్చినా తగినంత స్టాకు ఉన్నది. కానీ దాని అవసరమెంతో తేల్చాల్సింది వైద్య నిపుణులే. వారు చేసే సిఫారసులు, సూచనలకు అనుగుణంగా నిర్ణయం జరుగుతుంది. ఐసీఎంఆర్ సిఫారసు చేస్తే దానికి తగినట్లుగా ఆలోచిస్తాం.’’

కేంద్ర మార్గదర్శకాలు ఇస్తే అమలు చేస్తాం : వైద్యాధికారి, తెలంగాణ

“కరోనా కంట్రోల్ మొదలు వ్యాక్సినేషన్ వరకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగానే రాష్ట్రంలోనూ నిర్ణయాలుంటాయి. ఇప్పుడు బూస్టర్ డోస్ విషయంలోనూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయమే కీలకం. మార్గదర్శకాలు వస్తే దానికి అనుగుణంగా యాక్షన్ ప్లాన్ రూపొందిస్తాం. సెకండ్ డోస్ ప్రాసెస్ పూర్తి చేయడంమీద ఫోకస్ పెట్టాం. డిసెంబరు చివరికల్లా ముగించాలని టార్గెట్‌గా పెట్టుకున్నాం.బూస్టర్ డోస్ ఎప్పుడు మొదలు పెట్టాల్సి వచ్చినా రెడీగానే ఉంటాం”.

Advertisement

Next Story

Most Viewed