- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గాల్వాన్ లోయ మాదే
న్యూఢిల్లీ: గతకొద్ది రోజులుగా నెలకొన్న సరిహద్దు సమస్య సమసిపోవడం లేదు. చైనా శాంతికి ప్రయత్నిస్తున్నట్టుగానే కవ్వింపులనూ మానుకోవడంలేదు. ఇటీవలే గాల్వాన్ లోయ తమదేనని చైనా మిలిటరీ వాదించగా, భారత్ ఖండించిన సంగతి తెలిసిందే. గాల్వాన్ లోయ భారత సార్వభౌమత్వం కిందకే వస్తుందని, చైనా తన కార్యకలాపాలను ఎల్ఏసీ లోపటే కేంద్రీకరించుకోవాలని సూచించింది. శుక్రవారం మరోసారి చైనా ఆ లోయ తమదేనని వ్యాఖ్యానించింది. గాల్వాన్ లోయ ఎల్ఏసీ సరిహద్దుకు చైనా వైపునే ఉన్నదని, అది చైనా సార్వభౌమత్వం కిందకే వస్తుందని ఆ దేశ విదేశాంగ శాఖ ప్రకటించింది. దీనిపై భారత విదేశాంగ శాఖ సీరియస్ అయింది. తీవ్రంగా స్పందించింది. చైనా వాదనలు అసంగతమని, వాటిని ఆమోదించబోమని తిరస్కరించింది. గాల్వాన్ లోయ భారత భూభాగమేనని, చరిత్రను చూసినా ఈ విషయం అర్థమవుతుందని పేర్కొంది.
భారతే రెచ్చగొట్టింది: చైనా విదేశాంగ ప్రతినిధి
గాల్వాన్ ఘటనపై చైనా విదేశాంగశాఖ ప్రతినిధి జావో లిజియన్ స్పందిస్తూ, సరిహద్దులోని పశ్చిమ భాగంలోని గాల్వాన్ లోయ ఎల్ఏసీకి చైనా వైపున ఉన్నదని తెలిపారు. ఏండ్లకేండ్లు చైనా సైన్యం ఆ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నదని, విధులు చేపడుతున్నదని పేర్కొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి గాల్వాన్ లోయలో భారత్ సైన్యం ఏకపక్షంగా అక్కడ రోడ్లు, బ్రిడ్జీల్లాంటి నిర్మాణాలు చేపడుతున్నదని వివరించారు. ఈ విషయమై చైనా ఎన్నోసార్లు నిరసించిందని, భారత్ అంతటితో ఆగకుండా చైనావైపునా చొరబడి రెచ్చగొట్టేలా వ్యవహరించిందని ఆరోపించారు. కాగా, ఈ ప్రకటనపై కేంద్రప్రభుత్వం గట్టిగా స్పందించింది. బీజింగ్ ఇప్పుడు ఒకదానికి పదింతలు చెబుతున్నదని, ఆమోదయోగ్యం కాని వాదనలు చేస్తున్నదని భారత విదేశాంగశాఖ ప్రతినిధి శ్రీవాస్తవ చైనా వాదనలను తిరస్కరించారు. చైనా వాదనలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని తెలిపారు. గాల్వాన్ లోయపై భారత్ వైఖరి ఎన్నడూ మారలేదని, చారిత్రంగా అది భారత భూభాగమేనన్నది స్పష్టమని వివరించారు. ఇప్పుడు గాల్వాన్ లోయ తమదని చెబుతున్న చైనా చరిత్రలోనూ ఈ లోయకు స్థానం లేదని తెలిపారు. గతంలో ఈ లోయను చైనా గుర్తించలేదని పేర్కొన్నారు. చైనా దుష్టయత్నాలను అంగీకరించబోమని స్పష్టం చేశారు.
లడాఖ్ చేరుతున్న బలగాలు
గాల్వాన్ లోయలో చైనా సరిహద్దులో హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకున్న తర్వాత దేశంలోని పలురాష్ట్రాల నుంచి పెద్దమొత్తంలో సైన్యాన్ని లడాఖ్ తరలించేలా భారత ఆర్మీ ఆదేశాలు జారీ చేసింది. ఎల్ఏసీకి చైనా వైపున పెద్దమొత్తంలో ఆర్మీ మోహరించింది. తాజాగా, భారత్ వైపునా ఆర్మీ మోహరింపులు భారీగా జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్ సహా పలు రాష్ట్రాల నుంచి ఆర్మీని లడాఖ్‌కు తరలించే ఆదేశాలు జారీ అయినట్టు కొన్ని వర్గాలు తెలిపాయి. వయా మనాలీ నుంచి లడాఖ్ చేరే మార్గంలో పెద్దమొత్తంలో ఆర్మీ వాహనాలు లడాఖ్ వైపు వెళ్తున్నట్టు కనిపించాయి. ఇటీవలే ఆర్మీలో చేర్చిన ఎం-777 లైట్ హొవిట్జర్ సహా పలు ఆయుధాలను లడాఖ్‌కు తరలించినట్టు తెలిసింది. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్‌ల నుంచి అనేక ఆర్మీ బ్రిగేడ్‌లు, ఇంజినీర్ రెజిమెంట్‌లను ఆర్మీ ఇప్పటికే లడాఖ్‌కు తరలించింది. ఒక అంచనా ప్రకారం, ఇప్పటికి దాదాపు రెండు డివిజన్ల మొత్తంలో ట్రూపులు లడాఖ్ చేరినట్టు తెలుస్తున్నది. మరిన్ని ట్రూపులు ఆ దారిలో ఉండటం గమనార్హం. వైమానిక దళం ఇప్పటికే ఏ క్షణంలో ఏం జరిగిన వెంటనే అప్రమత్తమై ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నది.
ప్రధాని వ్యాఖ్యలపై దుమారం
భారత భూభాగంలో ఒక్క అంగుళం కూడా పరుల స్వాధీనం కాలేదని, భారత పోస్టులన్నీ క్షేమంగా ఉన్నాయని, ఎవ్వరూ సరిహద్దు దాటి మనదేశంలో అడుగుపెట్టలేదని అఖిలపక్ష సమావేశంలో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై శనివారం దుమారం రేగింది. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సహా పలువురు విమర్శకులు ప్రశ్నలు లేవనెత్తారు. ‘ప్రస్తుతం చైనా ట్రూపులున్న ప్రాంతం ఆ దేశానిదేనా? మన జవాన్లు ఏ దేశ భూభాగంలో చనిపోయారు? మన దేశ భూభాగంలో చైనా నిర్మాణాలు చేపట్టేందుకు యత్నిస్తున్నదని విదేశాంగ శాఖ ఎలా వ్యాఖ్యానిస్తుంది మరి? విదేశాంగశాఖ చేసిన ప్రకటనను ప్రధాని అబద్ధంగా భావిస్తున్నారా’.. వంటి ప్రశ్నలు గుప్పుమన్నాయి. వీటిపై ప్రధాని కార్యాలయం వివరణ ఇస్తూ కొందరు ప్రధాని వ్యాఖ్యలతో కొత్త వివాదాన్ని సృష్టించాలనుకుంటున్నారని అభిప్రాయపడింది. చైనా ఆ దేశ భూభాగంలోనే ఎల్ఏసీకి అతిసమీపంలో నిర్మాణాలు చేపడుతున్నదని, వాటిని అడ్డుకునే క్రమంలోనే భారత జవాన్లు అమరులయ్యారని వివరణ ఇచ్చింది.