రెవెన్యూలో అక్రమ వసూళ్లు.. ప్రతి పనికి ఓ రేటు ఫిక్స్​...

by Sumithra |
రెవెన్యూలో అక్రమ వసూళ్లు.. ప్రతి పనికి ఓ రేటు ఫిక్స్​...
X

దిశ, మల్హర్ : మండలంలోని రెవెన్యూ శాఖలో ఓ అధికారి అక్రమ వసూళ్లకు తెగబడుతున్నట్లు పలువురు బహిరంగంగా ఆరోపణలు చేస్తున్నారు. ప్రతి పనికి ఓ రేటు ఫిక్స్ చేసి పైసలు వసూలు చేస్తున్నారని, డబ్బులు ముడితే ఎంతటి మాయాజాలానికైనా తెగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రెవెన్యూ కార్యాలయంలో సీసీ కెమెరాల ఏర్పాట్లు, జెండా పండుగ లాంటి ఏ ఇతర కార్యక్రమాలైనా ఖర్చులకు సదరు రెవెన్యూ అధికారి అదనపు వసూళ్ల పై కన్నేయడం చర్చనీయాశమైంది. ఇది మల్హర్ మండలంలోని తాడిచర్ల తహశీల్దార్ కార్యాలయంలోని ఓ అధికారి తీరుతో ప్రజలు విస్మయానికి గురవుతున్నారు. సర్టిఫికెట్ల నుంచి మొదలుకుని ల్యాండ్ రిజిస్ట్రేషన్ తదితర పనులకు కోసం వచ్చిన రైతుల నుంచి రూ.5 వేల నుంచి రూ.10వేల వరకు ఓ కీలక అధికారి వసూళ్లు చేస్తున్నట్లు తెలిసింది.

కార్యాలయానికి వివిధ పనుల కోసం వచ్చే వారి వద్ద రూ.2 వేల రూ.5వేల వరకు సిబ్బందికి టార్గెట్ విధించి ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు బహిరంగ ఆరోపణలు ఉన్నాయి. ఎవరైనా ఎదురు ప్రశ్నిస్తే సిబ్బంకి సెక్షన్​కు సంబంధం లేని పనులు అప్పగించి వేధింపులకు గురి చేస్తున్నట్లు తెలిసింది. ఆ కీలక అధికారి కార్యాలయ కిందిస్థాయి ఉద్యోగులను తరచూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. మహాదేవపూర్ మండలంలో డీటీగా పనిచేసిన సందర్భాల్లోనూ పలు అవినీతి ఆరోపణలు రావడంతో శాఖ పరమైన చర్యలకు గురైనట్లు తెలిసింది. ఇటీవల కార్యాలయ సిబ్బంది పై దురుసుగా ప్రవర్తిస్తూ ఓ మహిళ ఉద్యోగిని వేధిస్తున్నాడని కలెక్టరేట్ ఏవో మొయినోద్దీన్ ఖాజాకు గత శనివారం ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ విషయం బయటకు పొక్కడంతో ఎవరా అధికారి అంటూ జిల్లాలోని తహశీల్దార్లు హైరానా పడ్డారు. చేసిన తప్పులకు తనపైనే ఫిర్యాదు చేసినట్టు తెలుసుకున్న సదరు అధికారి కాళ్ల బేరానికి దిగినట్లు తెలిసింది.

అంతా నా ఇష్టం..

రెవెన్యూ కార్యాలయంలో తన మాటే శాసనం అంటూ సదరు అధికారి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. పలుమార్లు జిల్లా కలెక్టర్ కూడా గట్టిగా మందలించినా వక్రబుద్ధి మారలేదని, సదరు అధికారి తీరు మండలంలో వివాదాస్పదంగా మారిందనే విమర్శలు వస్తున్నాయి. తన వద్ద పనిచేసే సిబ్బంది, మాట వినని ఉద్యోగులను సరెండర్ పేరిట ఇబ్బందుల పాలు చేసేవాడని తెలిసింది. ఇన్నాళ్లు తోటి ఉద్యోగులను ఇబ్బంది పెడుతూ వస్తున్న ఆ అధికారి ఇప్పుడు మహిళా ఉద్యోగిని వేధిస్తున్నాడనే ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. ఈ విషయాన్ని కలెక్టర్ రాహుల్ శర్మ సీరియస్ గా తీసుకున్నట్లు తెలిసింది. బాధిత మహిళా ఉద్యోగి ఫిర్యాదు నేపథ్యంలో సమగ్ర విచారణకు ఆదేశించినట్లు సమాచారం. సదరు అధికారిని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ బుధవారం విచారించి శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలిసింది.

Next Story

Most Viewed