వృద్ధి రేటును సవరించిన ఇండియా రేటింగ్ అండ్ రీసెర్చ్!

by Shamantha N |
వృద్ధి రేటును సవరించిన ఇండియా రేటింగ్ అండ్ రీసెర్చ్!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ అంచనాను 11.8 శాతం నుంచి 7.8 శాతం ప్రతికూలానికి సవరిస్తున్నట్టు ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ గురువారం తెలిపింది. ముఖ్యంగా కొవిడ్-19 ఆంక్షలను సడలించడంతో సెప్టెంబర్ త్రైమాసికంలో ఊహించిన దానికంటే మెరుగైన వృద్ధి కారణంగా ఈ సవరణ చేసినట్టు వెల్లడించింది. ఏదేమైనప్పటికీ.. రెండో త్రైమాసికంలో రికవరీ ఎంతమేరకు స్థిరంగా ఉందనేది చూడాలని రేటింగ్ ఏజెన్సీ తెలిపింది.

దేశీయంగా కొవిడ్-19 వ్యాక్సిన్‌లు ప్రజలకు అందుబాటులో వచ్చేవరకు కరోనా సంబంధిత సవాళు పోయే అవకాశం లేదని ఇండియా రేటింగ్స్ అభిప్రాయపడింది. మూడో త్రైమాసికంలో 0.8 శాతం ప్రతికూల వృద్ధికి మెరుగుపడొచ్చని, చివరి త్రైమాసికంలో సాంకేతిక మాంద్యం నుంచి బయటపడి 0.3 శాతం సానుకూల వృద్ధికి చేరుకునే సూచనలు కనిపిస్తున్నాయని ఇండియా రేటింగ్స్ పేర్కొంది. ప్రస్తుత మెరుగుదల ఇలాగే కొనసాగితే 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి 9.6 శాతానికి పుంజుకోవచ్చని వెల్లడించింది.

Advertisement

Next Story