ఈ ఏడాది భారత్‌లోనే అధిక వేతన పెంపు!

by Anukaran |
ఈ ఏడాది భారత్‌లోనే అధిక వేతన పెంపు!
X

దిశ, వెబ్‌డెస్క్: 2021లో భారత్‌లో వేతనాల సగటు 7.7 శాతం పెరుగుతాయని ప్రముఖ వృత్తి నిపుణుల సేవల సంస్థ ఎయాన్ తెలిపింది. 2020లో భారత్‌లో వేతనాల సగటు 6.1 శాతం పెరిగినట్టు సంస్థ తన నివేదికలో పేర్కొంది. బ్రిక్ దేశాలన్నిటిలో భారత్‌లోనే వేతనాల పెంపు అధికంగా ఉన్నట్టు సంస్థ అభిప్రాయపడింది. దేశీయంగా మొత్తం 20 పారిశ్రామిక రంగాల్లో ఉన్నటువంటి 1,200 కంపెనీల నుంచి సేకరించిన వివరాలతో ఎయాన్ సంస్థ నివేదికను రూపొందించింది. అయితే, ‘ఈ ఏడాదిలో కరోనా ప్రభావం కంపెనీల వ్యాపార కార్యకలాపాలపై ఎంతవరకు ఉందనే దాన్ని బట్టి ఈ వేతన పెంపు ఉండొచ్చు. అంతేకాకుండా, పెంచే వేతనాన్ని నేరుగా ఉద్యోగికి ఇవ్వకుండా ఎక్కువమొత్తాన్ని భవిష్య నిధికి కేటాయించే అవకాశాలున్నాయని’ ఎయాన్ ఇండియా సీఈవో నితిన్ సేథి వెల్లడించారు.

బ్రిక్ దేశాలన్నిటిలో భారత్‌లోనే ఎక్కువ…

ఎయాన్ రూపొందించిన నివేదికలో.. 88 శాతం కంపెనీలు ఈ ఏడాదిలో వేతనాలను పెంచాలని భావిస్తున్నట్టు చెప్పాయి. గతేడాది జీతాల పెంపును 75 శాతం కంపెనీలే అమలు చేశాయి. అలాగే, కరోనా ప్రభావం నుంచి ఆర్థికవ్యవస్థ వేగంగా పుంజుకునే అవకశాలున్నాయని, ఈ క్రమంలోనే చాలా కంపెనీలు జీతాలను పెంచేందుకు ఆసక్తిగా ఉన్నట్టు నివేదిక తెలిపింది. గతేడాది బ్రిక్ దేశాలన్నిటిలో ఎక్కువ కాలం లాక్‌డౌన్ విధించినప్పటికీ ఈ ఏడాది భారతే ఎక్కువ వేతన పెంపును నమోదు చేసే అవకాశముంది.

ఈ-కామర్స్, ఐటీ బెస్ట్..

రంగాల వారీగా చూస్తే.. ఈ-కామర్స్, ఐటీ, లైఫ్ సైన్సెస్ రంగాల్లో వేతనాల పెంపు అధికంగా ఉండొచ్చు. గేమింగ్, ఎంటర్‌టైన్‌మెంట్ రంగాలు, రసాయన కంపెనీలు కూడా తక్కువ వేతన పంపునకు మొగ్గు చూపించవచ్చని తెలుస్తోంది. ఇక, కరోనా ప్రభావం నుంచి ఇంకా కోలుకోని ఆతిథ్య, హోటల్, మౌలిక రంగాలు, స్థిరాస్తి, ఇంజనీరింగ్ సేవల కంపెనీల్లో జీతాల పెంపు తక్కువగా ఉండొచ్చని నివేదిక అభిప్రాయపడింది. ఉద్యోగులు ఎక్కువ శాతం నిలకడగా ఉండేందుకు ప్రాధాన్యత ఇస్తుండటంతో, ఉన్న ఉద్యోగం నుంచి వేరే ఉద్యోగానికి మారే వారు తక్కువగా ఉన్నారని నివేదిక స్పష్టం చేసింది. అంతేకాకుండా, ఇదివరకటి కంటే ప్రస్తుతం వలసల రేటు 12.8 తక్కువగానే ఉందని నివేదిక పేర్కొంది. 2019లో ఇది 16.1 శాతంగా నమోదైంది.

Advertisement

Next Story