- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేతల మాటలు నమ్మొద్దంట.. ఎందుకంటే ?
దిశ, న్యూస్ బ్యూరో: సర్కారు దవాఖానాలపై ప్రజలకు ఇప్పటికీ నమ్మకం కుదరడం లేదు. కరోనా బారిన పడిన మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులను ఎంచుకున్నప్పుడు ప్రజలకు ఆ అభిప్రాయం కలగడంలో తప్పేమీ లేదు. కేంద్ర మంత్రి అమిత్ షా, ధర్మేంద్ర ప్రదాన్ మొదలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రుల వరకు కరోనా పాజిటివ్ అని తెలియగానే ప్రైవేటు ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. తెలంగాణలో సైతం హోంమంత్రి మహమూద్ ఆలీ మొదలు ఎమ్మెల్యే వరకు ఎవ్వరూ సర్కారు ఆసుపత్రి ముఖం చూడలేదు. అంతా ప్రైవేటు ఆసుపత్రుల్లోనే చికిత్స తీసుకున్నారు. కర్నాటక ఆరోగ్య శాఖ మంత్రి శ్రీరాములు మాత్రం ఆ రాష్ట్ర ప్రజలకు ఆదర్శంగా ఉండేలా ప్రభుత్వ ఆసుపత్రిలోనే చేరి చికిత్స తీసుకుంటున్నారు. ప్రభుత్వమే నిర్వహిస్తున్న ఆసుపత్రుల్లో చేరడానికి ముఖ్యమంత్రులు, మంత్రులే సుముఖంగా లేకపోతే ఈ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం కలగకపోవడంలో ఆశ్చర్యమేమీ లేదు.
తెలంగాణ గవర్నర్‌గా నరసింహన్ ఉన్న సమయంలో పలుమార్లు ఆరోగ్య పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి వెళ్లి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి తరహాలో మంచి సేవలందిస్తోందని కితాబునిచ్చారు. పలు సందర్భాల్లో ప్రభుత్వ చొరవను ప్రశంసించారు. ప్రజల్లో నమ్మకం కలిగించేందుకు తన వంతు ప్రయత్నాలు చేశారు. కానీ ఇప్పుడు ఏ ప్రజాప్రతినిధి కూడా గాంధీ ఆసుపత్రి వైపే చూడలేదు. మంత్రులు, అధికార పార్టీ నేతలు మాత్రమే కాకుండా కాంగ్రెస్‌కు చెందిన వి.హనుమంతరావు లాంటివారు సైతం గాంధీ ఆసుపత్రిని ఎంచుకోలేదు. కార్పొరేట్ ఆసుపత్రుల్లోనే చికిత్స పొందారు. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఒక కార్పొరేషన్ చైర్మన్ తొలుత గాంధీ ఆసుపత్రిలో చేరినా ఆరోగ్యం పట్ల ఆందోళనతో రెండు రోజులకే మెరుగైన చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లక తప్పలేదు. జిల్లాల్లోని ఎమ్మెల్యేలు సైతం హైదరాబాద్ వచ్చి మరీ ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుని వెళ్లారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ప్రతినిధులు సైతం ప్రైవేటు ఆసుపత్రులనే ఆశ్రయించారు.ప్రజలకు నమ్మకం కలిగించేందుకే టెస్టుల సంఖ్యను పెంచామని వైద్య మంత్రి ఈటల రాజేందర్, ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు.. ఇలా అనేకమంది పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. కానీ సర్కారు ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు ఆ విధానాన్ని ఎంచుకోలేదు. రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో ప్రజలకు సర్కారు ఆసుపత్రులపై నమ్మకం లేకపోవడంతో అప్పు చేసి మరీ ప్రాణాన్ని కాపాడుకోడానికి ప్రైవేటు ఆసుపత్రికి వెళ్తున్నారు. మంత్రులు ఈటల రాజేందర్, హరీశ్‌రావు సైతం అప్పుచేసి ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరాల్సిన అవసరం లేదని భరోసా కలిగిస్తున్నారే తప్ప అలాంటి సేవలు ప్రభుత్వంలోనూ లభ్యమవుతున్నాయని ఒక్క ఎమ్మెల్యే అయినా అక్కడ చికిత్స పొందిన సంఘటనను ఉదహరించలేకపోతున్నారు.
చివరకు మంత్రులు, ఎమ్మెల్యేల గన్‌మెన్‌లకు కరోనా పాజిటివ్ అని తేలిన తర్వాత వారిని కూడా గాంధీకి పంపకుండా నేచర్ క్యూర్ ఆసుపత్రి లేదా ఆయుర్వేద ఆసుపత్రికి పంపేలా సిఫారసులు చేశారు. పాత్రికేయులు సైతం తొలుత ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరి అక్కడి చికిత్సతో బతికి బయటపడతామనే ధైర్యం లేకపోవడంతో మంత్రుల దృష్టికి తీసుకెళ్లక తప్పలేదు. చివరకు వారికి సిఫారసుతో ప్రైవేటు ఆసుపత్రులకు చేరాల్సి వచ్చింది. ఇక ప్రభుత్వ అధికారులు, సిబ్బంది కూడా గాంధీ ఆసుపత్రి, కింగ్ కోఠి ఆసుపత్రికి బదులుగా ‘నిమ్స్’కు వెళ్లి చికిత్స తీసుకున్నారు. వైద్యులు, వైద్య సిబ్బంది సైతం కరోనా బారిన పడుతుండడంతో వారిని కరోనా కోసమే ఏర్పడిన గాంధీ ఆసుపత్రికి బదులుగా ‘నిమ్స్’ ఆసుపత్రిలో ఉచితంగా చికిత్స కల్పించనున్నట్లు ప్రభుత్వం సర్క్యులర్ ఇచ్చింది. కేవలం తెలంగాణలో మాత్రమే కాక కర్నాటక ముఖ్యమంత్రి, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, వివిధ రాష్ట్రాల మంత్రులు అక్కడి ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లోనే చేరారు. అటు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులెవ్వరూ గాంధీ ఆసుపత్రిలో చికిత్స తీసుకోకుండా ప్రైవేటు ఆసుపత్రుల బాట పడుతూ ఉంటే ప్రజలకు వాటిపై విశ్వాసం ఎలా కలుగుతుందని ప్రతిపక్షాల సభ్యులు సైతం వ్యాఖ్యానించారు. సర్కారు ఆసుపత్రులు కేవలం సామాన్య ప్రజలకు మాత్రమే తప్ప పాలకులకూ, అధికారులకు, ప్రజా ప్రతినిధులకు కాదని ఈ సంఘటనలన్నింటినీ పేదలు గుర్తు చేసుకుంటున్నారు.