- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కార్డన్ ఆఫ్‌లో సమస్యలు
దిశ, నల్లగొండ: కరోనా వైరస్ (కొవిడ్-19) మహమ్మారి ఉమ్మడి నల్లగొండ జిల్లాను చుట్టిముట్టేస్తోన్నది. పలు ప్రాంతాల్లో పాజిటివ్ కేసులు నమోదు కావడంతో వైరస్ నియంత్రణ కోసం జిల్లా కలెక్టర్లు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. కరోనా పాజిటివ్ ప్రాంతాలను రెడ్ జోన్‌గా ప్రకటించి, కార్డన్ ఆఫ్ చేశారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో 25 ప్రాంతాలను రెడ్ జోన్లు ఉన్నాయి. ఈ జోన్ల నుంచి జనాలు బయటకు రాకుండా వాహనాల రాకపోకలను నిషేధించారు. ఈ ప్రాంతాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని రహదారులను ఫెన్సింగ్, బారీకెడ్లు, ముండ్ల కంచెలతో దిగ్బంధనం చేశారు. ఇండ్ల నుంచి జనాలు బయటకు రాకుండా నిరంతరం డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. ఈ రెడ్ జోన్ ప్రజలకు కావాల్సిన నిత్యవసర వస్తువులు డోర్‌డెలివరీ చేస్తామని ప్రకటించారు. అయితే, తొలుత రెండ్రోజులు సక్రమంగా డోర్‌డెలివరీ జరిగింది. కాని ఆ తర్వాత పట్టించుకునే వారు కరువయ్యారు. పోలీసుల ఆంక్షలతో ఇండ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్న జనాలకు పాలు, కూరగాయాలు, నిత్యావసర వస్తువులు, ప్రభుత్వం పంపిణీ చేస్తోన్న రేషన్ బియ్యం అందకపోవడంతో అవస్థలు పడుతున్నారు.
పెరిగిన కొవిడ్ 19 పాజిటివ్ కేసులు
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటం అందోళన కల్గిస్తోన్నది. ఈనెల 2న కేవలం ఆరుగురికి మాత్రమే కరోనా పాజిటివ్ రాగా, ఈ ఏడు రోజుల్లో 27 పాజిటివ్ కేసులకు ఎగబాకాయి. ప్రైమరి కాంటాక్ట్ అనుమానితులు, సెకండరి కాంటాక్ట్ అనుమానితుల సంఖ్య సైతం పెరిగిపోతున్నది. నల్లగొండ హోం క్వారంటైన్‌లో 9,216 మంది ఉండగా ప్రభుత్వ క్వారంటైన్ మహాత్మగాంధి యూనివర్సిటీలో 89 మంది ఉన్నారు. సూర్యపేటలో హోం క్వారంటైన్‌లో 7,596 మంది ఉండగా ప్రభుత్వ క్వారంటైన్‌లో 173 మంది ఉన్నారు.
ఇక యాదాద్రి భువనగిరి జిల్లాలో పాజిటివ్ కేసులు నమోదు కానప్పటికీ సూర్యపేట జిల్లా వర్ధమానుకోట గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురికి కొవిడ్ 19 వచ్చింది. వీరు యాదాద్రి జిల్లా అడ్డగూడూరు మండలంలోని లక్ష్మిదేవికాలువ, కోటమర్తి, సింగారం, జానకిపురం తదితర గ్రామాల ప్రజలతో మూవ్ కావడం వల్ల 115 కుటుంబాలను హోం క్వారంటైన్ చేశారు. పాజిటివ్ కేసులు, అనుమానితుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుండటంతో వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు అధికారులు ఆంక్షలు విధించారు.
రెడ్‌జోన్ ప్రాంతాలు ఇవే..
మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారిలో నల్లగొండ పట్టణానికి చెందిన మీర్‌బాగ్‌కాలనీ, బర్కత్‌పుర, రహమత్‌బాగ్ నగర్, మన్యం చెల్క ప్రాంతాలకు చెందిన ఐదుగురికి పాజిటివ్ వచ్చింది. వీరి ద్వారా వారి కుటుంబ సభ్యులు నలుగురికి సోకింది. బర్మా దేశానికి చెందిన 15 మంది నల్లగొండ మసీదుకు రాగా అందులో నలుగురికి కరోనా జబ్బు వచ్చింది. మిర్యాలగూడ పట్టణంలోని సీతారాంపురంలో మహిళకు, దామెరచర్లలో ఓ మహిళకు ఆమె ద్వారా మనుమరాలికి, సూర్యాపేటలో కుడకుడ రోడ్డుకు చెందిన వ్యక్తికి అతని ద్వారా బంధువులైన వర్ధమానుకోటలో ఆరుగురికి, భగత్‌నగర్‌లో మెడికల్ దుకాణంలో పని చేసే వ్యక్తికి, కొత్తగూడెంలోని కిరాణాదుకాణం వ్యాపారికి కరోనా సోకింది. ఈ రెడ్ జోన్లలో 144 సెక్షన్ అమలు పరుస్తున్నారు.
రెడ్ జోన్ ప్రాంతాలు అష్టదిగ్బంధం..
రెడ్ జోన్ ప్రాంతాలను పోలీసులు అష్టదిగ్బంధం చేశారు. ఈ నెల 3 నుంచి ఆ ప్రాంతాల నుంచి ప్రజలు బయటకు వెళ్లకుండా, బయటి వారు లోపలకు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి అందరూ ఇండ్లలోనే ఉండేలా చేస్తున్నారు. అయితే, కార్డన్‌ఆఫ్ చేసే సమయంలో నిత్యావసర వస్తువులు, అన్ని సేవలూ ఉచితంగా అందించబడతాయనీ, మీ ఇంటి వద్దకే సరుకులు అందజేస్తామని ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రకటించారు. కాని ఐదు రోజులుగా మిర్యాలగూడ పరిధిలోని సీతరాంపురం, నల్లగొండ పట్టణంలోని మీర్‌బాగ్‌కాలని, రహమత్‌బాగ్‌నగర్‌లో కూరగాయలు, నిత్యావసర వస్తువులు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ కాలనీల్లో అసంఘటిత రంగ కార్మికులు, కూరగాయల మార్కెట్‌లో పని చేసే వారు, పెయింటింగ్, సుతారీ కార్మికులు, ఆయా దుకాణాల గుమస్తాలు, పండ్ల వ్యాపారులుంటారు. వారందరినీ క్వారంటైన్ చేయడం ద్వారా ఆర్థికంగా ఇబ్బందులెదుర్కొంటున్నట్టు తెలుస్తోంది.
కార్డన్ ఆఫ్ ప్రాంతంలో పారిశుధ్య నిర్వహణపై అధికారులు దృష్టి సారించడం లేదని తెలుస్తోంది. రోజుకు రెండు, మూడుసార్లు బ్లీచింగ్ చల్లడం, మురుగు కాల్వలు ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం, చెత్తాచెదారం నిల్వ ఉండకుండా చూడటం, రెండ్రోజులకోసారి హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేస్తుండాలి. కాని కరోనా వైరస్ సోకిందనే ప్రకటన వెలువడిన రోజు మాత్రమే హైపోక్లోరైడ్ పిచికారి చేసి బ్లీచింగ్ చల్లారు. ఇప్పటికి ఐదు రోజులు కావస్తున్నా బ్లీచింగ్ చల్లకపోవడం, హైపోక్లోరైడ్ పిచికారి చేయకపోవడంతో మురుగు కాల్వలన్నీ దుర్గంధంగా మారాయి. ఇంటింటికీ చెత్త సేకరించే వాహనాలు రోజువారీగా రాకపోవడంతో ఇండ్లలోనే చెత్త పేరుకుపోతోంది. చెత్తా చెదారం పేరుకుపోవడం వల్ల కొత్త రోగాల బారిన పడతామని ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
Tags: carden off, red zone areas, problems, covid 19 effect