లిక్కర్ రవాణాలో నయా ట్రెండ్!

by Sridhar Babu |   ( Updated:2020-04-30 06:10:33.0  )
లిక్కర్ రవాణాలో నయా ట్రెండ్!
X

దిశ‌, ఖ‌మ్మం: లాక్‌డౌన్ కొన‌సాగుతున్నా ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో మ‌ద్యం అక్ర‌మ ర‌వాణా జోరుగానే సాగుతోంది. ప్ర‌తి రోజూ ఏదో ఒక‌చోట మ‌ద్యం పట్టుబ‌డుతునే ఉన్నా..రవాణాకు మాత్రం బ్రేకులు ప‌డ‌టం లేదు. ఈ అక్ర‌మ ర‌వాణాకు అధికార పార్టీకి చెందిన కొంత‌మంది ప్ర‌జాప్ర‌తినిధుల అండ‌దండ‌లు పుష్క‌లంగా ఉండ‌టంతో అధికారులు కూడా ఏం చేయ‌లేక‌పోతున్నారు. లాక్‌డౌన్ అమ‌ల్లోకి వ‌చ్చిన నాడే మ‌ద్యం దుకాణాల‌కు సీల్ ప‌డిన విష‌యం తెలిసిందే. అయితే ఆ సీల్‌ను తొల‌గించి మ‌రీ ఇటీవ‌లి కాలంలో మ‌ద్యం దుకాణాదారులు స‌రుకునంతా ర‌హ‌స్య‌ప్రాంతాల‌కు చేర్చి విక్ర‌యాలు జ‌రుపుతున్నారు. బుధ‌వారం ఖ‌మ్మం ప‌ట్ట‌ణంలో జ‌రిగిన సంఘ‌ట‌న ఇందుకు నిద‌ర్శ‌నంగా నిలుస్తోన్నది.

బుధ‌వారం ఖ‌మ్మం జిల్లాలో వేర్వేరు ఘ‌ట‌న‌ల్లో మూడు చోట్ల అక్ర‌మంగా ర‌వాణా చేస్తున్న మ‌ద్యాన్ని ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఖ‌మ్మం ప‌ట్ట‌ణంలోని షాపు నెంబరు 13 నుంచి అక్రమంగా మద్యం తరలిస్తుండగా ఎక్సైజ్‌ అధికారులు పట్టుకున్నారు. ఓ రెస్టారెంట్‌ యజమానికి సంబంధించిన కారులో ఈ మ‌ద్యం స్వాధీనం కావ‌డం గ‌మ‌నార్హం. మద్యాన్ని తరలిస్తున్న వాహనాన్ని, డ్రైవర్‌ నాగరాజును అదుపులోకి తీసుకున్నారు. 13వ నెంబరు షాపు సీల్‌ తీసి మాద్యాన్ని తరలిస్తున్న‌ట్లుగా అంగీక‌రించిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. తాత్కాలికంగా షాపు లైసెన్స్‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు అధికారులు ప్ర‌క‌టించారు.

ఊరిస్తున్న అధిక ధ‌ర‌లు..

మాములుగా రూ.వెయ్యి ప‌లికే ఫుల్ బాటిల్ మద్యాన్ని ప్ర‌స్తుతం నాలుగు నుంచి ఐదు రెట్లు పెరిగి రూ.5వేల వ‌ర‌కు విక్ర‌యిస్తున్నారు. దీంతో మ‌ద్యం వ్యాపారులు సొంత దుకాణాల‌కే క‌న్నం వేస్తూ లోప‌లున్న స‌రుకును ఖాళీ చేస్తున్నారు. ఈ అంశమే చాలా మంది మ‌ద్యం వ్యాపారుల‌ను సీల్ తొల‌గింపున‌కు పురిగొలుపుతోన్నది. సరుకును ర‌హ‌స్య ప్రాంతాల‌కు చేర్చ‌డ‌మే కాకుండా ఫోన్ ద్వారా ఆర్డ‌ర్ తీసుకుని డోర్ డెలివ‌రీ చేస్తుండ‌టం విశేషం. ఖ‌మ్మంలో మ‌ద్యం వ్యాపారంలో ఇదో న‌యా ట్రెండ్ అని కూడా చెప్పాలి. సాయంత్రమైతే పెగ్గు ప‌డ‌ని ఎంతోమంది మ‌ద్యం ప్రియులు ఎంత ధ‌ర‌యినా మ‌ద్యం కొనుగోలు చేసేందుకు వెనుకాడ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

అధికారుల ఉదాసీన‌త‌…

అధికార పార్టీ ప్ర‌జాప్ర‌తినిధుల అండ‌తో ఎక్సైజ్ అండ్ పోలీస్ అధికారుల‌కు మ‌ద్యం వ్యాపారులు చెక్‌పెడుతున్న‌ట్లుగా తెలుస్తోన్నది. పోలీసుల‌కు, ఎక్సైజ్ అధికారుల‌కు ఈ వ్య‌వ‌హారం అంతా తెలిసినా ఉదాసీన‌త‌తో వ్య‌వ‌హ‌రిస్తుండ‌టం గ‌మ‌నార్హం. మ‌నకెందుకు వ‌చ్చిన త‌ల‌నొప్పి అన్న‌ట్లుగా ఈ అక్ర‌మ దందాకు దూరంగా ఉంటున్నారు. దాడులకు చాలా దూరంగా ఉంటున్న పోలీసులు, ఎక్సైజ్ అధికారులు చెక్‌పోస్టు త‌నిఖీల్లో ప‌ట్టుబ‌డిన సంఘ‌ట‌న‌ల్లోనూ స‌రుకును స్వాధీనం చేసుకోవ‌డం వ‌ర‌కే ఆగిపోతున్నార‌నే ఆరోప‌ణ‌లున్నాయి. మ‌రీ బ‌య‌ట‌కు పొక్కిన సంఘ‌ట‌న‌ల్లో కేసుల న‌మోదు ఉంటోంద‌ని స‌మాచారం.

Tags: Khammam, illicit sales, liquor, police, officers, excise police

Advertisement

Next Story

Most Viewed