డాక్టర్లందరికీ మెడికల్, లైఫ్ ఇన్సూరెన్స్ కల్పించండి

by  |
డాక్టర్లందరికీ మెడికల్, లైఫ్ ఇన్సూరెన్స్ కల్పించండి
X

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా వైరస్‌కు ప్రభుత్వ, ప్రైవేటు డాక్టర్లనే తేడా ఉండదని, నిత్యం ప్రజల వైద్య అవసరాలను చూస్తున్న డాక్టర్లు ఇన్‌ఫెక్షన్‌కు గురై చనిపోతున్నారని, ఇప్పటికి దేశం మొత్తం మీద 196మంది చనిపోయారని ప్రధానికి రాసిన లేఖలో ఐఎంఏ (Indian Medical Association) వివరించింది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పనిచేస్తున్న డాక్టర్లందరికీ ప్రభుత్వం తరఫున మెడికల్( Medical), లైఫ్ ఇన్సూరెన్స్(Life Insurance) సౌకర్యం కల్పించాలని ఐఎంఏ అధ్యక్ష, కార్యదర్శులు ప్రధానికి శుక్రవారం రాసిన లేఖలో పేర్కొన్నారు. ప్రైవేటు ప్రాక్టీసు చేస్తున్న డాక్టర్లు సైతం ప్రజలను పరీక్షించేటప్పుడు తెలియకుండానే కరోనా వైరస్ ఇన్‌ఫెక్షన్‌కు గురవుతున్నారని, తమిళనాడులో అత్యధికంగా 43మంది డాక్టర్లు, మహారాష్ట్రలో 23మంది, గుజరాత్‌లో 20మంది, బీహార్‌లో 15మంది, కర్నాటకలో 12మంది, ఆంధ్రప్రదేశ్‌లో 11మంది, ఉత్తరప్రదేశ్‌లో 11 మంది చొప్పున చనిపోయారని పేర్కొన్నారు. తెలంగాణలో ఐదుగురు చనిపోయినట్లుగా ఐఎంఏ ఆ లేఖలో వివరించింది.

రోజురోజుకూ కరోనా బారిన పడి పాజిటివ్‌ అవుతున్నవారు, చికిత్సకు ఫలితం లేక చనిపోతున్నవారి సంఖ్య పెరుగుతూ ఉన్నదని, ఎక్కువగా జనరల్ ప్రాక్టీషనర్లే చనిపోతున్నారని వారు పేర్కొన్నారు. కరోనా బారిన పడిన డాక్టర్లకే ఆసుపత్రుల్లో బెడ్‌లు, మందులు దొరకడంలేదని, వారి కుటుంబ సభ్యులకు కూడా ఇదే పరిస్థితి ఉందని పేర్కొన్నారు. డాక్టర్లకు, వారి కుటుంబాలకు తగిన రక్షణ కల్పించారని, రిస్కు గ్రూపుగా పరిగణించి ప్రభుత్వం తరఫున మెడికల్, లైఫ్ ఇన్సూరెన్సు సౌకర్యం కల్పించాలని ఆ లేఖలో ప్రధానికి విజ్ఞప్తి చేశారు.


Next Story

Most Viewed