- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రభుత్వ స్థలాలను చెరబడుతున్న అక్రమార్కులు
దిశ, శేరిలింగంపల్లి : ఒకప్పుడు శేరిలింగంపల్లి నియోజకవర్గంలో వందలాది ఎకరాల ప్రభుత్వ భూములు, ఈనాం జాగాలు, చెరువుకుంటలు ఉండేవి. కానీ ఇప్పుడు అవన్నీ కేవలం కాగితాలకే పరిమితం అయ్యాయి. ప్రస్తుతం ఉన్న చెరువులు కుంటల్లో సింహ భాగం ఎవరో ఒకరి చేతుల్లో ఉన్నవే.. వాటిని క్రమంగా కబ్జాలకు గురిచేస్తూ అందులో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు కొందరు అక్రమార్కులు. ఇప్పుడు నియోజకవర్గ పరిధిలోని కోట్లాది రూపాయల ప్రభుత్వ స్థలాలు కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి. అందులో చాలావరకు అధికార పార్టీ నేతల చేతుల్లో.. వారి అనునాయుల కబంధ హస్తాల్లోనే ఉన్నాయన్నది ప్రధాన ఆరోపణ.
ముఖ్యంగా మియాపూర్, హైదర్ నగర్, ఆల్విన్ కాలనీ, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి డివిజన్ల పరిధిలో వందల కోట్ల విలువైన భూములను చెరబట్టారు. ఇందులో శిఖం భూముల నుండి మొదలు అసైన్డ్ స్థలాల వరకు కన్నుపడ్డ ప్రతీ స్థలాన్ని కబ్జా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అలా కబ్జాచేసిన వాటికి రెవెన్యూ అధికారుల అండ, జీహెచ్ఎంసీ అధికారుల మద్దతు లభిస్తుండడంతో అడ్డగోలుగా నిర్మాణాలు చేపడుతున్నారు అని పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై బీజేపీ గతంలో పోరుబాట పట్టింది. అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాలని, చెరువుకుంటలను కాపాడాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలకు దిగింది.
కబ్జాల్లో చెరువు శిఖాలు
శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో గతంలో పదుల సంఖ్యలో చెరువు కుంటలు ఉండేవి. కానీ ఇప్పుడు వాటి విస్తీర్ణం క్రమంగా కుంచించుకు పోతోంది. ప్రస్తుతం ఒక్కో డివిజన్ లో రెండు మూడు చెరువులకు మించి కానరావడం లేదు. నాయకుల కన్ను పడడంతో ఇప్పుడు అవన్నీ కనుమరుగయ్యాయి. ఓవైపు మహానగరంలోని చెరువు కుంటలను పరిరక్షించడంతో పాటు వాటిని సుందరీకరించి ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తామని రాష్ట్ర మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ చెబుతుంటే.. ఆయన దత్తత డివిజన్ లోనే చెరువు కుంటలు రాత్రికి రాత్రే మాయం అవుతున్నాయి. హైదర్ నగర్ డివిజన్ 119 సర్వే నెంబర్ లో 8 ఎకరాల 17 గుంటల కింది కుంట చెరువు కబ్జాకోరల్లో చిక్కి శల్యమైంది. గత కొన్నాళ్లుగా ఈ చెరువు శిఖంలో విచ్చలవిడిగా అక్రమ కట్టడాలు వెలుస్తున్నాయి. దీంతో ఇప్పుడు కిందికుంట చెరువు విస్తీర్ణం 3 ఎకరాలకు కుంచించుకు పోయిందని ఆపరిసర ప్రాంతాల ప్రజలు ఆరోపిస్తున్నారు. చెరువు ఎఫ్టీఎల్ లో నుండే రోడ్డును వేసిన అధికారులు ఆపక్కనే హద్దులు ఏర్పాటు చేయలేక పోయారు. దీంతో రోడ్డుకు చెరువుకు మధ్యలో ఉన్న స్థలాన్ని చెరబట్టారు కొందరు పెద్దలు. కొన్నాళ్లు స్తబ్దుగా ఉన్న వారు ఈమధ్య అందులో కట్టడాలు మొదలు పెట్టారు. నియోజకవర్గంలో ఈ ఒక్క చెరువు అనేకాదు దాదాపు అన్ని చెరువుల పరిస్థితి ఇదే.
చెరువులో మట్టికొట్టారు..
ఓవైపు రాష్ట్ర వ్యాప్తంగా మిషన్ కాకతీయ పేరున చెరువుల్లో పూడికలు తీస్తుంటే.. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మాత్రం చెరువుల సుందరీకరణ పేరుతో వాటిలో మట్టిని పోశారు అధికారులు. నిబంధనల ప్రకారం చెరువు కుంటల్లో మట్టిని పోయరాదు. కానీ రాజు తలుచుకుంటే ఏదయినా సాధ్యమే అనేలా.. ఇక్కడ మాత్రం వాకింగ్ ట్రాక్ ల ఏర్పాటు పేరుతో వాటిలో వేలాది ట్రిపుల మట్టిని తోలారు.. సుందరీకరణ పేరు బాగున్నా కార్యాచరణలోనే అసలు లోపాలు ఉన్నాయని సీనియర్ సిటీజన్స్ వాపోతున్నారు. ఇప్పటికే కబ్జాలకు గురైన చెరువు కుంటల్లో వెలసిన అక్రమ నిర్మాణాలను కూల్చి, అందులోకి మురుగు నీరు రాకుండా చేశాక చెరువుల సుందరీకరణ చేపడితే బాగుండేది. కానీ అవేమీ పట్టించుకోని అధికారులు, కేవలం ఆపేరు చెప్పి ఇప్పటికే కబ్జాలకు గురైన భూములకు క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇచ్చేశారని ఇదెక్కడి సుందరీకరణ, ఇదేమీ చెరువు కుంటల పరిరక్షణ అని ప్రశ్నిస్తున్నారు సామాన్యులు. పైగా ఈ కార్యక్రమానికి ఇబ్బడిముబ్బడిగా ప్రభుత్వ నిధులు వెచ్చించడం శోషనీయమని, ప్రభుత్వానికి, అధికారులకు చిత్తశుద్ధి ఉంటే ముందు శిఖం భూముల్లో కబ్జాలను ఖాళీ చేయించి చిత్తశుద్ధి చాటుకోవాలని సూచిస్తున్నారు.
కిందికుంట పరిరక్షణ ఎక్కడ..?
కిందికుంట చెరువు శిఖంలో వెలుస్తున్న అక్రమ నిర్మాణాలపై స్థానికులు, బీజేపీ నాయకులు చాలాకాలంగా పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని, చెరువు శిఖం పరిరక్షణ కోసం బీజేపీ నాయకుడు వెలగ శ్రీనివాస్ ఇది వరకు హోకోర్టు లో పిల్ వేశారు. దానిపై స్టేటస్ కో ఉంది. ఈచెరువు పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్ట వద్దని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం స్పష్టంగా ఉత్తర్వులు జారీ చేసింది. అయినా అవేమీ పట్టని అక్రమార్కులు యథేచ్ఛగా అందులో నిర్మాణాలు చేపడుతున్నారు. అయినా అధికారులకు ఇవేమీ పట్టడం లేదు. హైకోర్టు ఉత్తర్వులను కూడా బేఖాతర్ చేస్తున్నారు. అయితే ఈ వ్యవహారంలో అధికార పార్టీ పెద్దలు ఉన్నట్లు బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అందుకే రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు లేకపోలేదు. కిందికుంట చెరువు శిఖం, ఎఫ్టీఎల్ లో వెలుస్తున్న అక్రమ నిర్మాణాలను అడ్డుకోవలంటూ బీజేపీ నేతలు రవికుమార్ యాదవ్, జ్ఞ్యానేంద్ర ప్రసాద్, వెలగ శ్రీనివాస్ తదితర నేతలు గతంలో ఆందోళనకు దిగారు. అలాగే తహసీల్దార్ కు వినతిపత్రం సైతం సమర్పించారు. అయినా శాఖల మధ్య సమన్వయ లోపం అక్రమార్కులకు వరంగా మారింది. తప్పు మాదికాదంటే మాది కాదని ఎవరికి వారు తప్పించుకోడానికి చూస్తుండడంతో కబ్జాదారులకు మరింతగా కలిసి వస్తుందనే చెప్పాలి.
అధికారులు చోద్యం చూస్తున్నారు..
శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో చాలా చెరువులు అన్యాక్రాంతం అయ్యాయి. చెరువుల సుందరీకరణ పేరుతో వాటిని నిర్వీర్యం చేస్తున్నారు. అధికార పార్టీ నేతలు, వారి అనుచరులు కబ్జాలకు పాల్పడుతున్నారు. కిందికుంట చెరువు ఎఫ్టీఎల్ ను కబ్జాచేసి అందులో నిర్మాణాలు చేపట్టారు. హైకోర్టులో పిల్ వేసినా ఇరిగేషన్ అధికారులు ఎన్ఓసీ ఇచ్చారు. రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారు. కబ్జా కోరల్లో నుండి చెరువు కుంటలను కాపాడాలి.
-రవికుమార్ యాదవ్.. బీజేపీ నాయకుడు.