- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైన్స్, బార్లకు లాక్ డౌన్ వర్తించదా?
దిశ, వరంగల్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని అరికట్టడంలో లాక్‌డౌన్‌ను విజయవంతంగా అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం మద్యం వ్యాపారులను కట్టడి చేయడంలో విఫలమైందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లాక్‌డౌన్ నుంచి వైన్‌షాపులకు మినహాయింపు ఇవ్వాలని వ్యాపారుల నుంచి కొద్దిరోజులుగా వినతులు వస్తున్నప్పటికీ సీఎం కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లో అనుమతులు ఇచ్చేది లేదని ఖరాఖండిగా చెబుతూ వస్తున్నారు. కానీ, కొంతమంది ఎక్సైజ్ అధికారుల ఉదాసీన వైఖరి మద్యం వ్యాపారులకు కలిసొచ్చింది. షాపులకు వేసిన తాళాలు వేసినట్లే ఉన్నప్పటికీ లోపల ఉన్న మద్యం మాత్రం మాయమవుతోంది. మందుబాబుల బలహీనతను ఆసరాగా చేసుకుని డబుల్, త్రిబుల్ ధరలతో బ్లాక్‌లో మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు. అక్కడక్కడ పెద్ద మొత్తంలో మద్యం పట్టుబడుతున్నప్పటికీ అధికారులు సీరియస్‌గా స్పందించిన దాఖలాలు లేవు. ఇప్పటికే వైన్‌షాపుల్లో ఉన్న స్టాక్ దాదాపుగా ఖాళీ అయిందనే ప్రచారం జరుగుతోంది. పట్టుబడుతున్న మద్యం సీజ్ చేస్తున్న అధికారులు లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మద్యం వ్యాపారులకు మినహాయింపా…?
లాక్ డౌన్ నుంచి వైన్స్, బార్లకు మినహాయింపు ఇచ్చారా..? అనే మాటలకు ఎక్సైజ్ అధికారులు వ్యవహరిస్తున్న తీరు బలాన్ని చేకూరుస్తున్నాయి. కరోనా వైరస్ నివారణలో భాగంగా గత నెల 22న కేంద్ర ప్రభుత్వం జనతా కర్ఫ్యూ విధించింది. ఆ మరుసటి రోజు నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించింది. కేవలం నిత్యావసర వస్తువులకు మాత్రమే మినహాయింపు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా ఉన్న 261 మద్యం దుకాణాలు, 121 బార్లకు ఎక్సైజ్ అధికారులు సీల్ వేశారు. మొదటి విడతగా షాపులకు తాళాలు వేసి తెల్ల కాగితాలతో సీల్ వేశారు. ఇదే అదునుగా భావించిన వ్యాపారులు తెల్ల కాగితాలు ఉండగానే తాళాలు తీసి మద్యం డంప్ చేసుకున్నారు. దీనిపై ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో రెండో విడతగా తాళాలకు తెల్లబట్ట చుట్టి రాజముద్ర వేసి లక్కతో సీల్ వేశారు. అయినప్పటికీ కొందరు వ్యాపారులు బట్టను తీసేసి తాళాలు తీసి మద్యం ఇతర ప్రాంతాలకు తరలించి అమ్మకాలు సాగించారు.
ఇక తప్పని పరిస్థితుల్లో మూడో విడత ఎక్సైజ్ అధికారులు షాపులకు తాళాలు వేసి సంబంధించిన కీస్ వారి వద్దనే ఉంచుకున్నారు. కానీ, అప్పటికే 90 శాతం మద్యం తరలించినట్లు సమాచారం. షాపులకు వేసిన తాళాలు వేసినట్లు ఉండగానే మద్యం మాయమై బ్లాక్ మార్కెట్లో ప్రత్యక్షమవడం ఆందోళన కలిగిస్తోంది. ఎంతో చాకచక్యంగా తాళాలు తీసి మద్యం మాయం చేసిన వ్యాపారులు ఏం తెలియనట్లుగా ఎప్పటిలాగే తాళాలు అమర్చడం విస్మయానికి గురిచేస్తోంది. షాపుల్లో ఉన్న స్టాక్ దాదాపు ఖాళీ అయిన తర్వాత అధికారులు స్పందించిన తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. అధికారుల సహకారంతోనే మద్యం వ్యాపారులు షాపులను తెరిచి స్టాక్ తరలించుకుపోయారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అధికారుల నిర్లక్ష్యం వ్యాపారులకు వరం..
లాక్ డౌన్ అమల్లో భాగంగా ఎక్సైజ్ అధికారుల నిర్లక్ష్యం మద్యం వ్యాపారులకు వరంగా మారింది. వైన్ షాపులు, బార్లకు సీల్ వేసినప్పటికీ మద్యం వ్యాపారులు నిబంధనలు పట్టించుకోకుండా షాపులు తాళాలు తీసి లిక్కర్ తరలించి బ్లాక్ లో అమ్మకాలు సాగించారు. రూ. 650 ఎమ్మార్పీ ధర ఉన్న ఫుల్ బాటిల్ ను రూ. 2 వేలకు విక్రయించారు. రూ. 1000 ఉన్న ఫుల్ బాటిల్ ను రూ. 3, 500 నుంచి రూ. 4 వేల వరకు ధరలు నిర్ణయించి అమ్మకాలు సాగించారు. ఈ నేపథ్యంలో విడతల వారీగా వ్యాపారులు షాపులు తెరిచి మద్యం బాటిళ్లను రహస్య ప్రదేశాలకు తరలించి విక్రయిస్తున్నట్లు సమాచారం. ఇటీవల వరంగల్ అర్భన్ జిల్లాలోని మడికొండ, కమలాపూర్, వరంగల్ రూరల్ జిల్లాలోని నర్సంపేట పట్టణాల్లో భారీగా మద్యం పట్టుబడింది. స్థానిక పోలీసులు మద్యం నిల్వలను స్వాధీనం చేసుకుని ఎక్సైజ్ అధికారులకు అప్పగించారు. వాస్తవానికి ఎక్సైజ్ అధికారులు దాడులు చేసి కేసులు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు ఒక్క ఘటన చోటు చేసుకోలేదు.
ఇదిలా ఉండగా మద్యం వ్యాపారులు వైన్స్, బార్లు నడుస్తున్న క్రమంలో రోజువారీగా స్టాక్ రిజిస్ట్రేషన్ మెయింటేన్ చేస్తారు. షాపులు సీల్ వేయడానికి ముందు ఖచ్చితంగా అప్పటి వరకు అందుబాటులో ఉన్న స్టాక్ వివరాలు కూడా నమోదు చేస్తారు. తిరిగి షాపులు తెరిచిన తర్వాత ఎక్సైజ్ అధికారులు అనుమానించి తనిఖీ చేసిన క్రమంలో స్టాక్ వివరాలు చూపాల్సి ఉంటుంది. ఒకవేళ ఒక్క బాటిల్ తేడా వచ్చిన సంబంధిత షాప్ ను సీజ్ చేసి వ్యాపారి కేసు నమోదు చేస్తారు. ప్రస్తుతం లాక్ డౌన్ అమల్లో ఉండగా మద్యం వ్యాపారులు దాదాపుగా స్టాక్ ను ఖాళీ చేసినట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత నిబంధనల మేరకు ఎక్సైజ్ అధికారులు సదరు వ్యాపారులపై ఏ విధమైన చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.
Tags: Warangal, liquor, illicit sales, wine shops, high prices