అర్ధరాత్రి అక్రమ గ్రావెల్ దందా.. TRS నేత అండతో రెచ్చిపోతున్న కాంట్రాక్టర్

by Sridhar Babu |   ( Updated:2021-09-22 23:58:48.0  )
అర్ధరాత్రి అక్రమ గ్రావెల్ దందా.. TRS నేత అండతో రెచ్చిపోతున్న కాంట్రాక్టర్
X

దిశ, మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం మణుగూరు మండలంలోని మున్సిపాలిటీ పరిధిలో అర్ధరాత్రులు అక్రమంగా గ్రావెల్ దందా జోరుగా జరుగుతోంది. ఇంత జరుగుతున్నా పట్టించుకొనే అధికారులే కరువయ్యారని స్థానికులు చర్చించుకుంటున్నారు. మా ఇష్టం.. నువ్వు ఏం చేస్తావో చేసుకో.. అనే చందంగా కాంట్రాక్టర్ వ్యవహరిస్తున్నాడని చర్చ జరుగుతోంది. మున్సిపాలిటీ పరిధిలో అక్రమంగా అర్ధరాత్రులు వందల సంఖ్యలో ట్రాక్టర్లు ఎటువంటి పర్మిషన్స్ లేకుండా గ్రావెల్ రవాణా చేస్తున్నా అధికారులు చోద్యం చూస్తున్నారు.

సదరు కాంట్రాక్టర్‌కి టీఆర్ఎస్ పార్టీ కీలక నేత పూర్తి మద్దతు తెలుపుతున్న కారణంగానే అక్రమాలకు, దందాలు జరుగుతున్నాయని టాక్ వినిపిస్తోంది. మండలంలో ఎలాంటి పనులకు సంబంధించిన కాంట్రాక్టులు అయినా.. ఆ కాంట్రాక్టర్‌కే అప్పగిస్తారని తెలుస్తోంది. అయితే ఆ కాంట్రాక్టర్ చేసిన ఏ వర్క్‌లో చూసినా నాణ్యతా ప్రమాణాలు ఉండవని స్థానికులు ఆరోపిస్తున్నారు. టీఆర్ఎస్ నేత, సదరు కాంట్రాక్టర్ కలిసి పూర్తి చేసిన పనుల్లో(కాంట్రాక్టుల్లో) 80 శాతం డబ్బులు మిగుల్చుకుని కోట్లు సంపాదించినట్టు ప్రజలు చర్చించుకుంటున్నారు.

ఆ కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించేలా సదరు టీఆర్ఎస్ నేత స్థానిక ఎమ్మెల్యేతో సంప్రదింపులు జరుపుతారనే ఆరోపలున్నాయి. స్థానిక ఎమ్మెల్యే ప్రజల కోసం, నియోజకవర్గంలో అభివృద్ధి కోసం కష్టపడుతుంటే సదరు కాంట్రాక్టర్, ఆ నేత మాత్రం ఎమ్మెల్యే పరువు తీస్తున్నారనే టాక్ ప్రజల్లో వినిపిస్తోంది.

అయితే గ్రావెల్ అక్రమ రవాణాపై సదరు ఆ కాంట్రాక్టర్‌ను విలేకరులు ప్రశ్నించగా.. వారితో అసభ్యకరంగా మాట్లాడినట్టు స్థానిక విలేకరులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ కాంట్రాక్టర్ ఒక విలేకరిని టీఆర్ఎస్ మీద వార్తలు రాస్తున్నావ్.. నేను అన్ని చూస్తున్నా అని బెదిరింపులకు పాల్పడినట్టు తెలిసింది.
స్థానిక రెవిన్యూ అధికారుల కనుసన్నల్లోనే ఈ అక్రమ గ్రావెల్ దందా జరుగుతోందని ప్రజలు ముక్తకంఠంతో తెలుపుతున్నారు. రెవెన్యూ అధికారులకు ముడుపులు ఇస్తే డీల్ ఒకే.. లేదంటే వాహనాలు సీజ్ చేస్తారని పలువురు చర్చించుకుంటున్నారు.

రాత్రి సమయంలో గ్రావెల్ అక్రమ దందా జరుగుతుంటే రెవెన్యూ అధికారులకు విలేకరులు, పలువురు ఫోన్లు చేస్తే అధికారులు ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తున్నారని తెలుపుతున్నారు. మండలంలో రెవెన్యూ అధికారుల తీరు ఇలా ఉందని ఈ అక్రమ గ్రావెల్ దందాతో తేటతెల్లమౌవుతోంది. ఈ కాంట్రాక్టర్ సరైన నాణ్యతలేని పనులు చేపడుతుంటే.. బిల్లులు ఎలా మంజూరు చేస్తున్నారని ప్రజలు, పలు నాయకులు అధికారులపై మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు చోద్యం చూడకుండా సదరు కాంట్రాక్టర్ చేపట్టిన పనులపై దర్యాప్తు చేపట్టి చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed