గ్రానైట్ ‘గంగుల’.. నిలదీస్తే అక్రమ కేసులా..?

by Sridhar Babu |   ( Updated:2021-08-09 07:15:18.0  )
minister gangula
X

దిశ, కరీంనగర్ సిటీ : కరీంనగర్ జిల్లాలో కొనసాగుతున్న గ్రానైట్ దందా అవకతవకలపై, గ్రానైట్ వ్యాపారంలో మంత్రి గంగుల కమలాకర్ పై వస్తున్న ఆరోపణలపై, సీబీఐ విచారణ జరపాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. మంత్రివర్గ సహచరునిపై వెల్లువెత్తుతున్న నిరసనల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. మంత్రి గంగుల కమలాకర్ తో 30 ఏళ్లుగా ముడిపడిన గ్రానైట్ దందా పై, మంత్రి కుటుంబం చైనా దేశానికి ఎగుమతి చేసిన గ్రానైట్ వ్యాపార లావాదేవీలు బహిర్గత పరచాలన్నారు. తమ గ్రానైట్ ను అధికంగా చైనాకే సరఫరా చేస్తున్నామని చెప్పిన మాటలను మంత్రి మరిచిపోయారని, నేడు గ్రానైట్ వ్యాపారానికి తనకు సంబంధం లేదని ఆయన ప్రకటనలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.

జిల్లాలో అక్రమ గ్రానైట్ వ్యాపార వ్యవహారాన్ని ప్రశ్నిస్తే మంత్రి గంగుల కమలాకర్ జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకే న్యాయవాది, బీజేపీ నాయకుడు బేతి మహేందర్ పై అక్రమ కేసు పెట్టారని మండిపడ్డారు. వాస్తవాలను బయటపెట్టి మంత్రి గంగులను ప్రశ్నిస్తే కక్షపూరిత చర్యలు చేపడుతున్నట్టు స్పష్టంగా కనబడుతుందన్నారు. కరీంనగర్ జిల్లా గ్రానైట్ దందా వ్యవహారాలపై, పీఎంవో ఆఫీస్ నుండి, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నుండి విచారణకు ఆదేశించినా, రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంలో అంతర్యం ఏమిటన్నారు. మంత్రి కమలాకర్ వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని, ఏయే వ్యాపారాలతో మంత్రి కమలాకర్ కోట్ల రూపాయలు సంపాదించారో జిల్లా ప్రజానీకానికి స్పష్టం చేయాలన్నారు.

మాజీ మంత్రి ఈటల రాజేందర్ తనపై వచ్చిన ఆరోపణలను సవాల్ చేస్తూ, తన చిత్తశుద్ధిని నిరూపించుకోవడానికి ఎమ్మెల్యే పదవికి, టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి వచ్చారని అన్నారు. ఈటల లాగే మంత్రి గంగులకు దమ్ముంటే ఇటీవల కాలంలో తనపై వచ్చిన ఆరోపణలకు నైతిక బాధ్యత వహించి, తక్షణం తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రశ్నించే నాయకులపై అక్రమ కేసులు పెట్టడం మానుకోవాలని, లేకపోతే రాబోయే కాలంలో మంత్రి గంగులకు ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదని ఆయన హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed