- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గోదావరి వలయం మీదుగా స్మగ్లింగ్
దిశ ప్రతినిధి, కరీంనగర్: ప్రతి నెల 15వ తేదీ వరకు గోదావరి తీరమంతా బిజీ బిజీగా ఉంటుంది. చీకటి పడిందంటే చాలు గోదావరి వలయం మీదుగా వాహనాల రాకపోకలు సాగుతూనే ఉంటాయి. ఏ ఒక్క వాహనమూ ఆగదు.. ఆగినా ఐదు నిమిషాల్లో ఆ వంతెన దాటి వెళ్తుంది. ఇదేదో ఒక్క రోజు జరుగుతున్న వ్యవహారం కాదు.. ప్రతి నెల మొదటి రెండు వారాల్లో సాగుతున్న తంతు..
త్రిలింగ క్షేత్రమైన కాళేశ్వరం మీదుగా ప్రతి నెల సాగుతున్న అక్రమ దందా అంతా ఇంతా కాదు.. ప్రతి నెల మొదటి 15 రోజుల్లో రేషన్ బియ్యం అక్రమంగా తరలిపోతుంది. ఇక్కడి నుంచి మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరొంచకు తరలించే వరకు దళారుల బాధ్యత.. ఆ తరువాత అక్కడి సర్కారు ఇచ్చే వెసులుబాటే వారికి ఆసరా.. దొడ్డు బియ్యానికి మహారాష్ట్ర సర్కారు ఇస్తున్న మినహాయింపు అక్రమ దందాగాళ్లకు అలుసుగా మారింది.
ఆ రేషన్ షాపులే కీలకం..
గోదావరి పరీవాహక ప్రాంతంలోని రేషన్ షాపులే కేంద్రంగా దందా కొనసాగుతోందన్న విమర్శలు ఉన్నాయి. ప్రతి నెల మొదటి 15 రోజుల్లో సరఫరా చేసే ఒక రూపాయికి కిలో బియ్యం అక్రమ దందాగాళ్లకు వరంగా మారింది. ఎక్కువ శాతం రేషన్ షాపుల్లో బియ్యం స్మగర్ల ఏజెంట్లు కాపు కాస్తున్నారు. ‘మీరు దొడ్డు బియ్యం తినరు కదా.. రేషన్ షాపులోని బయో మెట్రిక్ మిషన్‌లో వేలిముద్ర వేయండి.. మిగతా సంగతి మేం చూసుకుంటాం’ అని చెప్తారు. వేలిముద్ర వేసిన తర్వాత ఫుడ్ సెక్యూరిటీ కార్డులో ఉన్న వారి జాబితా ప్రకారం ప్రతి ఒక్కరికీ ఇచ్చే బియ్యం లెక్కకట్టి కిలోకు రూ. 8 చొప్పున కార్డుదారుకు ఇస్తారు. రూ. 9 చొప్పున మహారాష్ట్రలోని దొడ్డు బియ్యం వ్యాపారులకు విక్రయిస్తారు.
రోజుకు 10 టన్నులు..
రోజుకు 10 టన్నుల బియ్యం ప్రతి నెల మొదటి 15 రోజుల్లో మహారాష్ట్రకు తరలిపోతోంది. చీకటి పడిందంటే చాలు ట్రాలీ ఆటోల్లోనో.. వ్యాన్లలోనో రేషన్ బియ్యం స్మగ్లింగ్ అవుతూనే ఉన్నాయి. ఇందుకు గడ్చిరోలి జిల్లా సిరొంచ తాలుకా కేంద్రంలో ఉత్తర తెలంగాణకు చెందిన ఓ వ్యాపారి స్థలం అద్దెకు తీసుకుని ఏకండా గోడౌన్ కట్టించారని ప్రచారం జరుగుతోంది. ఆ గోడౌన్‌కు బియ్యం చేరుకుంటే చాలు కిలోకు రూ. 11 నుంచి 12 చొప్పున చెల్లిస్తారని తెలుస్తోంది.
నిద్రపోతున్న నిఘా..!
ఇంటర్ స్టేట్ స్మగ్లింగ్ కేంద్రాలుగా మారిన గోదావరి నది తీరంలో నిఘా నిద్రపోతుందా అని పలువురు మండిపడుతున్నారు. గోదావరి పరివాహక ప్రాంతంలో పీడీఎస్ బియ్యం స్మగ్లింగ్ వ్యవహారం యథేచ్ఛగా సాగుతున్నా పట్టించుకునే వారే లేకుండా పోయారు. అధికారుల కళ్లుగప్పి ప్రతీ నెల అంతర్రాష్ట్ర వంతెన మీదుగా టన్నుల కొద్దీ రేషన్ బియ్యం దర్జాగా తరలిపోతున్నాయి. తనిఖీ కేంద్రాలు పెట్టినా ప్రయోజనం లేకుండా పోతోంది. రెవెన్యూ శాఖతో పాటు విజిలెన్స్ యంత్రాంగం పట్టించుకోకపోవడంతోనే రేషన్ బియ్యం పొరుగు రాష్ట్రానికి తరలిపోతున్నాయని స్పష్టం అవుతోంది.