T PCC: రాష్ట్రంలో టీపీసీసీ పూర్తి స్థాయిలో ప్రక్షాళన.. పరిశీలకులకు మూడు దశల్లో టాస్క్ లు

by Prasad Jukanti |
T PCC: రాష్ట్రంలో టీపీసీసీ పూర్తి స్థాయిలో ప్రక్షాళన.. పరిశీలకులకు మూడు దశల్లో టాస్క్ లు
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో టీపీసీసీ పూర్తి స్థాయిలో ప్రక్షాళన దిశగా ఆ పార్టీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అన్ని కార్యవర్గాల కూర్పు చేపట్టేందుకు రంగం సిద్ధం చేసింది. ఇవాళ గాంధీ భవన్ లో (Gandhi Bhavan) రాష్ట్ర పరిశీలకుల సమావేశం (State Observers Meeting) జరిగింది. ఈ సందర్భంగా పరిశీలకులకు మూడు దశలలో టీపీసీసీ టాస్క్ ను నిర్దేశించింది. ఏప్రిల్ 25 నుంచి 30 తేదీ వరకు జిల్లా స్థాయి సమావేశాలు నిర్వహించాలని టీపీసీసీ ఆదేశించింది. జిల్లా సమావేశాలకు బ్లాక్, మండల అధ్యక్షులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పోటీ చేసిన అభ్యర్థులు, ఏఐసీసీ, పీసీసీ ఆఫీస్ బేరర్లు, జిల్లా స్థాయి సీనియర్ నాయకులను ఆహ్వానించాలని సూచించింది. టాస్క్ 2 లో అసెంబ్లీ, బ్లాక్ లెవెల్ మీటింగ్స్ నిర్వహించడం, టాస్క్ 3 లో మండల మీటింగ్స్ ఏర్పాటు చేయాలని సూచించింది. ఈ సందర్భంగా పార్టీ ప్రక్షాళనకు ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) దిశా నిర్దేశం చేశారు.

బాధ్యతగా చేయండి: మహేశ్ కుమార్ గౌడ్

పార్టీ పటిష్టతకు సంస్థాగత నిర్మాణం చాలా కీలకం అని ఈ విషయంలో పరిశీలకులుగా మీరు చేపట్టే కార్యక్రమాలు చాలా బాధ్యతగా చేయాలని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ (Mahesh Kumar Goud) పరిశీలకులకు సూచించారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాలు తెలంగాణలో పెద్ద ఎత్తున విజయవంతం అవుతున్నాయని ఈ కార్యక్రమాల విషయంలో ఏఐసీసీ అగ్రనేతలు హర్షం వ్యక్తం చేశారని చెప్పారు. కో ఆర్డినెటర్లు తమకు ఇచ్చిన బాధ్యతలను మంచిగా నిర్వహిస్తున్నారని, ఇకపై కూడా పరిశీలకులుగా మీకు అప్పగించిన పనులను మరింత చిత్తశుద్ధితో చేయాలన్నారు.

త్వరలో స్థానిక సంస్థలకు ఎన్నికలు: వేం నరేందర్ రెడ్డి

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ కార్యకర్తలు ఎంతో శ్రమించారని వారి కష్టంతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ప్రభుత్వ సలహాదారు, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు వేం నరేందర్ రెడ్డి (Vem Narendra Reddy) అన్నారు. రాష్ట్ర పరిశీలకుల సమావేశంలో మాట్లాడిన ఆయన దేశంలో ఒక రోల్ మాడల్ గా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. కుల గణన, బీసీ రిజర్వేషన్స్, ఎస్సీ వర్గీకరణ చేశాం. అనేక సంక్షేమ పథకాలు చేపట్టాము. ప్రజలకు ఇచ్చిన హామీలు అన్ని దశల వారీగా పూర్తి చేస్తున్నామన్నారు. త్వరలోనే స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించబోతున్నామని చెప్పారు. వార్డు సభ్యుల నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ వరకు, కౌన్సిలర్ నుంచి మేయర్ వరకు దాదాపు లక్షన్నర పదవులు భర్తీ చేసుకునే అవకాశం ఉందన్నారు. గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతానికి మనం కృషి చేయాలని క్షేత్ర స్థాయిలో పార్టీ మరింతగా బలపడాలన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని సూచించారు.



Next Story

Most Viewed