నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు పెట్టండి

by Shyam |
నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు పెట్టండి
X

దిశ, మహబూబ్ నగర్: లాక్‌డౌన్ సమయంలో నిబంధనలు ఉల్లంఘిస్తూ దిచక్ర వాహనంపై ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులు కనిపిస్తే CRPC 107, 110 వాహన చట్టం కింద కేసులు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటరావు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ ఛాంబర్లో తహశీల్దార్లు, ఎంపీడీవోలు, పోలీసు అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీలో జరుగుతున్న పల్లె ప్రగతిలో భాగంగా వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై ఎంపీడీవోలు, తహశీల్దారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామపంచాయతీల్లో స్మశానవాటికలను నిర్మించాలని, అందుకు అవసరమయ్యే ఇసుక, సిమెంట్, ఇతర సామగ్రిని సమకూర్చుకోవాలని చెప్పారు. లాక్‌డౌన్ సమయంలో పని దొరకని వారికి ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పించాలని, మండలాల్లో లాక్‌డౌన్ ఉన్నప్పటికీ కరోనా కేసులు నమోదు కాలేదని వివరించారు. ముందస్తు చర్యల్లో భాగంగా ప్రజలకు, సిబ్బందికి అవసరమైన శానిటైజర్, మాస్కులను అందించాలని, సోషల్ డిస్టెన్స్ పాటించాలన్నారు.గ్రామ పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసిన నర్సరీల్లో మొక్కలను సంరక్షించాలని, వచ్చే హరితహారం కార్యక్రమానికి సరిపడా మొక్కలను పెంచాలని సంబంధిత అధికారులకు సూచించారు. మండలం, గ్రామాల్లో సోడియం హైపోక్లోరైడ్ మందును పిచికారి చేయాలన్నారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని కలెక్టర్ చెప్పారు. రైతు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మండలంలో రైతు బజార్లను ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు తెరిచి ఉంచేలా చూడాలన్నారు. జిల్లాలో 3 టెలి మెడిసిన్ వాహనాలను ఏర్పాటు చేశామన్నారు. ఎవరికైనా ఆరోగ్య సమస్యలుంటే వారు 08542-226670కు కాల్ చేస్తే, వారికి మందులు అందిస్తారని లేదా ఎమర్జెన్సీ అయితే హాస్పిటల్ డాక్టర్‌కు రిఫర్ చేస్తారని కలెక్టర్ వివరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అడిషనల్ కలెక్టర్ సీతారామారావు, డీఆర్ఓ స్వర్ణలత, ఆర్డీఓ శ్రీనివాసులు, తహశీల్దార్లు, ఎంపీడీవోలు, పోలీసు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

tags: corona, lockdown, if anybody breaks the rules, file a case, collector s. venkat rao

Advertisement

Next Story

Most Viewed