భారత్ హ్యాట్రిక్.. సూపర్-8 రౌండ్‌కు క్వాలిఫై

by Harish |   ( Updated:2024-06-13 00:22:18.0  )
భారత్ హ్యాట్రిక్.. సూపర్-8 రౌండ్‌కు క్వాలిఫై
X

దిశ, స్పోర్ట్స్ : టీ20 వరల్డ్ కప్‌లో టీమ్ ఇండియా హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. అంతేకాకుండా, సూపర్-8 రౌండ్‌కు దూసుకెళ్లింది. బుధవారం న్యూయార్క్ వేదికగా జరిగిన గ్రూపు ఏ మ్యాచ్‌లో అమెరికాపై 7 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన అమెరికా నిర్ణీత ఓవర్లలో 110/8 స్కోరు చేసింది. నితీశ్ కుమార్(27) టాప్ స్కోరర్. అర్ష్‌దీప్ సింగ్(4/9) విజృంభించడంతో యూఎస్‌ఏ కష్టంగా 100 పరుగులను దాటింది. అనంతరం 111 పరుగుల లక్ష్యాన్ని టీమ్ ఇండియా 3 వికెట్లు కోల్పోయి 18.2 ఓవర్లలోనే ఛేదించింది. సూర్యకుమార్(50 నాటౌట్) హాఫ్ సెంచరీ మెరిసి జట్టు విజయం కీలక పాత్ర పోషించాడు. శివమ్ దూబె(31 నాటౌట్) రాణించాడు.

మెరిసిన సూర్య

స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన టీమ్ ఇండియాకు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. మరోసారి విఫలమైన ఓపెనర్ విరాట్ కోహ్లీ(0) తొలి ఓవర్‌లో రెండో బంతికే వికెట్ పారేసుకున్నాడు. కాసేపటికే కెప్టెన్ రోహిత్(3) కూడా వెనుదిరిగాడు. వీరిద్దరూ నేత్రావల్కర్ బౌలింగ్‌లోనే అవుటయ్యారు. ఆ తర్వాత సూర్యకుమార్, రిషబ్ పంత్ కలిసి ఇన్నింగ్స్ నిర్మించారు. గత రెండు మ్యాచ్‌ల్లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడిన పంత్(18) ఈ సారి స్వల్ప స్కోరుకే అవుటయ్యాడు. అనంతరం శివమ్ దూబె‌తో కలిసి సూర్యకుమార్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. పిచ్ బౌలర్లకు అనుకూలిస్తుండటంతో వీరిద్దరూ దూకుడుకు పోకుండా ఆచితూచి ఆడారు. అయితే, సూర్య మాత్రం అడపాదడపా తన శైలిలో బౌండరీలు బాది అలరించారు. 17వ ఓవర్‌లో వరుసగా 6, 4 బాది భారత్ విజయాన్ని మరింత తేలిక చేశాడు. ఈ క్రమంలోనే టీ20ల్లో 50వ హాఫ్ సెంచరీని అందుకున్నాడు. అదే ఓవర్‌లో దూబె రెండు పరుగులు తీయడంతో భారత్ విజయం లాంఛనమైంది. అమెరికా బౌలర్లలో నేత్రావల్కర్ 2 వికెట్లతో రాణించాడు.

అర్ష్‌దీప్ అదరహో

అంతకుముందు అర్ష్‌దీప్ సింగ్ బంతితో రెచ్చిపోయాడు. అతని పేస్ ధాటికి అమెరికా బ్యాటర్లు బెంబేలెత్తిపోయారు. ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే యూఎస్‌ఏను దెబ్బకొట్టాడు అర్ష్‌దీప్. తొలి బంతికే ఓపెనర్ షాయన్ జహంగీర్(0)ను, అదే ఓవర్‌లో ఆండ్రీస్ గౌస్(2)ను పెవిలియన్ పంపాడు. కాసేపటికే పాండ్యా బౌలింగ్‌లో కెప్టెన్ ఆరోన్ జోన్స్(11) వెనుదిరగడంతో అమెరికా 25/3తో కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో మరో ఓపెనర్ స్టీవెన్ టేలర్(24), నితీశ్ కుమార్(27) కలిసి ఇన్నింగ్స్ నిర్మించేందుకు ప్రయత్నించారు. భారత బౌలర్లను ఆచితూచి ఎదుర్కొన్నారు. కానీ, వాళ్ల ప్రయత్నానికి అక్షర్ బ్రేక్ వేశాడు. టేలర్‌ను అవుట్ చేశాడు. అనంతరం మరోసారి చెలరేగిన అర్ష్‌దీప్.. నితీశ్ కుమార్‌‌తోపాటు హర్మీత్ సింగ్(10)ను అవుట్ చేశాడు. ఆ తర్వాత షాడ్లి వాన్‌(11 నాటౌట్) విలువైన పరుగులు జోడించడంతో స్కోరు 100 దాటింది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ 4 వికెట్లతో చెలరేగగా..పాండ్యాకు 2 వికెట్లు దక్కాయి. అక్షర్ ఒక్క వికెట్ తీశాడు.

స్కోరుబోర్డు

అమెరికా ఇన్నింగ్స్ : 110/8(20 ఓవర్లు)

షాయన్ జహంగీర్ ఎల్బీడబ్ల్యూ(బి)అర్ష్‌దీప్ 0, స్టేవెన్ టేలర్(బి)అక్షర్ 24, ఆండ్రీస్ గౌస్(సి)పాండ్యా(బి)అర్ష్‌దీప్ 2, ఆరోన్ జోన్స్(సి)సిరాజ్(బి)పాండ్యా 11, నితీశ్ కుమార్(సి)సిరాజ్(బి)అర్ష్‌దీప్ సింగ్ 27, అండర్సన్(సి)పంత్(బి)పాండ్యా 15, హర్మీత్ సింగ్(సి)పంత్(బి)అర్ష్‌దీప్ 10, షాడ్లి వాన్‌ 11 నాటౌట్, జస్‌దీప్ సింగ్ రనౌట్(పంత్/సిరాజ్) 2; ఎక్స్‌ట్రాలు 8.

వికెట్ల పతనం : 0-1, 3-2, 25-3, 56-4, 81-5, 96-6, 98-7, 110-8

బౌలింగ్ : అర్ష్‌దీప్ సింగ్(4-0-9-4), సిరాజ్(4-0-25-0), బుమ్రా(4-0-25-0), పాండ్యా(4-1-14-2), శివమ్ దూబె(1-0-11-0), అక్షర్(3-0-25-1)

భారత్ ఇన్నింగ్స్ : 111/3(18.2 ఓవర్లు)

రోహిత్(సి)హర్మీత్(బి)నేత్రావల్కర్ 3, కోహ్లీ(సి)ఆండ్రీస్ గౌస్(బి)నేత్రావల్కర్ 0, పంత్(బి)అలీ ఖాన్ 18, సూర్యకుమార్ 50 నాటౌట్, శివమ్ దూబె 31 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 9.

వికెట్ల పతనం : 1-1, 10-2, 39-3

బౌలింగ్ : సౌరభ్ నేత్రావల్కర్(4-0-18-2), అలీ ఖాన్(3.2-0-21-1), జస్‌దీప్ సింగ్(4-0-24-0), షాడ్లి వాన్‌(4-0-25-0), అండర్సన్(3-0-17-0)

Advertisement

Next Story

Most Viewed