- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పౌరసత్వ పత్రాలు తెండి.. ‘ఆధార్’ ఇస్తాం..
ఇంటిల్లిపాదికీ ఆధార్ కార్డు ఉందని ఎగిరి గంతేయకండి. అన్నింటికీ ఆధార్ కార్డును లింక్ చేశామని కొండంత నమ్మకంతో ఉండకండి. అన్నీ సరిగ్గా ఉన్నాయని ధ్రువీకరించుకున్నాకే ఆధార్ కార్డు మంజూరు చేసారు కనుక నాకేం ఢోకా లేదని ధైర్యంగా ఉండకండి. మీకు తెలియకుండా ఎవరో మీపైన ఏదో ఫిర్యాదు చేస్తే మీరు కన్ను మూసి తెరిచేలోపు మీ ఆధార్ గల్లంతు కావడం ఖాయం. అప్పుడు మీ నిజాయితీని మీరే నిరూపించుకోవాల్సి ఉంటుంది. మీ టైమ్ బాగలేకపోతే ఇబ్బందుల్లో ఇరుక్కోవచ్చు. లామినేషన్ చేసి పెట్టుకున్న ఆధార్ కార్డును కవర్ విప్పి చెత్తబుట్టలో వేసే రోజు కూడా రావచ్చు. ఆ కార్డు ఎందుకూ పనికిరాని కార్డుముక్కగానే మిగిలిపోవచ్చు. అసలు కార్డే చెల్లకుండా పోవచ్చు. మీకు సంబంధం లేకుండానే మిమ్మల్ని మీరు నిరూపించుకోవాల్సి ఉంటుంది. సరిగ్గా ఓ వ్యక్తికి ఇదే జరిగింది. ఎక్కడో కాదు… మన హైదరాబాద్ నగరంలోనే జరిగింది.
సిఏఏ, ఎన్నార్సీ… లాంటివి తెరపైకి వచ్చిన తర్వాత ఆధార్ కార్డు పక్కా ఆధారం అనేదానికి గ్యారంటీ లేకుండా పోయింది. హైదరాబాద్ నగరంలో నివసిస్తున్న రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక వ్యక్తి కొన్నాళ్ళ కింద ఆధార్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. దానికి అవసరమైన రుజువు పత్రాలూ సమర్పించుకున్నాడు. అన్ని పత్రాలూ తనిఖీ చేసిన అధికారులు కార్డును జారీ చేసారు. కాని, వారం రోజుల కింద ఓ గుర్తు తెలియని వ్యక్తి చేసిన ఫిర్యాదుతో సదరు వ్యక్తికి ఓ నోటీసు జారీ అయింది. మీ ఆధార్ చెల్లకపోవచ్చన్నది దాని సారాంశం. మరోసారి సంబంధిత పత్రాలను ఒరిజినల్ రూపంలో తీసుకురావాల్సిందిగా సూచించారు. ఒకవేళ అలా వచ్చి నిరూపించుకోలేని పక్షంలో ఆధార్ కార్డును చట్టం ప్రకారం డీయాక్టివేట్ చేస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్ అమీర్‌పేట్‌లోని యుఐడిఏఐ (యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) ప్రాంతీయ కార్యాలయం ఈ నోటీసు జారీ చేసింది. ఈ నెల 20వ తేదీన ఉదయం పదకొండు గంటలకు ఈ కార్యాలయానికి ఒరిజినల్ సర్టిఫికేట్లతో పాటు హాజరుకావాల్సిందిగా ఆదేశించారు.
ఆధార్ అధికారుల పొంతనలేని వాదనలు
ఆధార్ చట్టం ప్రకారం భారతదేశంలో 182 రోజులుగా నివసిస్తున్న ప్రజలెవరైనా ఆధార్ కార్డు పొందడానికి అర్హులు. అయితే నివాస ధృవీకరణకు సంబంధించిన ధృవీకరణ పత్రాలను విధిగా సమర్పించాల్సి ఉంటుంది. వాటి ఒరిజినల్ పత్రాలనూ అధికారులు నిశితంగా పరిశీలించి సక్రమంగా ఉన్నవని భావించిన తర్వాతనే కార్డును మంజూరు చేస్తారు. ఆధార్ కార్డు వచ్చేసిందని సంతోషపడతాం. అన్నింటికీ దాన్ని అనుసంధానం చేస్తాం. కానీ పైన పేర్కొన్న వ్యక్తిపై మరో వ్యక్తి లిఖితపూర్వక ఫిర్యాదు (ఆరోపణ) చేయడంతో ఆధార్ కార్డు జారీ చేసిన అధికారులు సదరు వ్యక్తికి నోటీసు జారీ చేశారు. కార్డు తీసుకునే సమయంలో సమర్పించిన డాక్యుమెంట్లనే మరోసారి ఒరిజినల్ రూపంలో తీసుకురావాల్సిందిగా సూచించారు. అందిన ఫిర్యాదు నిజమేనా అని దీని ద్వారా రూఢీ చేసుకుంటామని తెలిపారు.
నిజానికి ఆధార్ కార్డు జారీ చేయడానికి దరఖాస్తుదారులు భారత పౌరసత్వం కలిగి ఉండాల్సిన అవసరమేమీ లేదు. జాతీయత కూడా అక్కర్లేదు. ఆధార్ చట్టంలోనే సెక్షన్ -1 ‘వి’లో ‘రెసిడెంట్’ అనే పదానికి ఇచ్చిన నిర్వచనంలో పేర్కొన్నారు. భారతదేశంలో నివసిస్తున్నవారు ఆధార్ కార్డును పొందడానికి అర్హులని ఛాప్టర్-2లోని సెక్షన్ 3(1)లో స్పష్టంగా ఉంది.
అయితే అధికారులు జారీ చేసిన నోటీసులో మాత్రం సిటిజన్‌షిప్‌ను నిరూపించే ఒరిజినల్ పత్రాలను తీసుకురావాల్సిందిగా స్పష్టం చేశారు. ఒకవేళ భారత జాతీయుడివి కాకపోతే ఈ దేశ సరిహద్దుల్లోకి వచ్చి చట్టబద్ధంగానే నివసిస్తున్నట్లు రుజువు చేసుకోవాలని సూచించారు. నిజానికి ఆధార్ కార్డు పొందడానికి దరఖాస్తు చేసుకునే సమయానికి 182 రోజులుగా ఈ దేశంలో నివసిస్తున్నట్లు ధృవీకరించే పత్రాలు ఉంటే సరిపోతుందని ఆ చట్టమే చెప్తోంది. భారత జాతీయత లేదా పౌరసత్వం ఉండాలనే నిబంధనేదీ లేదు. పైగా ఆధార్ కార్డు ఉన్నంత మాత్రాన భారత పౌరసత్వం ఉన్నట్లు భావించరాదని ఆ కార్డుమీదనే యూఐడీఏఐ స్పష్టంగా పేర్కొనింది. కానీ ఆధార్ కార్డు అర్హతను రూఢీ చేసుకోడానికి మాత్రం భారత పౌరసత్వం ఉన్నట్లు ధృవీకరించే పత్రాలను తీసుకురావాల్సిందిగా ఆ నోటీసులో రంగారెడ్డి జిల్లా వ్యక్తికి సూచించింది.