అన్నార్థులకు మానవతావాదుల అండ !

by Shyam |
అన్నార్థులకు మానవతావాదుల అండ !
X

దిశ, వరంగల్: కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో ఎంతోమందికి తినడానికి తిండి దొరకడం లేదంటే ఆశ్చర్యం కలగకమానదు. వైరస్ కట్టడికి కేంద్ర, రాష్ట్రాలు లాక్‌డౌన్ విధించడంతో వలస జీవులు, కూలీలు పట్టెడు అన్నం కోసం అల్లాడుతున్నారు. బిచ్చగాళ్లు సైతం మెతుకుల కోసం అలమటిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మానవతావాదులు వారిని ఆదుకునేందుకు ముందుకు వస్తూ తమకు తోచిన విధంగా భోజనాన్ని అందజేస్తూ ప్రాణాలు నిలుపుతున్నారు.

ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బియ్యం, రూ.500 కొన్నివర్గాల వారికే ఊరట నిస్తుండటంతో కొందరు దయార్థ హృదయులు తోచిన విధంగా బియ్యం, పప్పు, కూరగాయలు అందిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పటికే ఎంతో మందికి సాయం చేశారు. రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, దేవాలయాల పరిసరాల్లో సేద తీరుతున్న వారికి స్వచ్ఛంద సంస్థలు, పలు యూత్ అసోసియేషన్లు ఆహార ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నాయి. అదేవిధంగా పక్కరాష్ట్రాలకు చెందిన కూలీలు శిబిరాలు ఏర్పాటు చేసుకున్న దగ్గరకు వెళ్లి, నిత్యావసర వస్తువులు పంపిణీ చేసి ధైర్యం చెబుతున్నారు. హన్మకొండ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు.. బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేసి మానవత్వం చాటుకున్నారు.

కరోనా కట్టడికి 24గంటలు సేవలందిస్తున్న ఉద్యోగులకు సైతం పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకొస్తున్నాయి. ప్రధానంగా పోలీస్, వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు, జర్నలిస్ట్‌లకు సాయం చేస్తున్నారు. 24గంటల విధులతో సకాలంలో భోజనం చేయకపోవడం, ఇంటికి కావాల్సిన నిత్యవసర వస్తువులు సమకూర్చడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాలను గుర్తించి సాయం చేస్తున్నారు. వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలోని పోచమ్మ మైదాన్ సెంటర్‌లో పారిశుద్ధ్య కార్మికుల కోసం మధ్యాహ్న భోజన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. జర్నలిస్ట్ లకు సైతం నిత్యవసర వస్తువులు, కూరగాయలు పంపిణీ చేస్తున్నారు.

Tags ;corona virus, rice, vegetables distribution, warangal district, railway stations, bus stands, charities

Advertisement

Next Story

Most Viewed