మానవ హక్కుల కమిషన్‌లో కేసుల విచారణ బంద్.. కారణం అదే!

by Anukaran |
Human Rights Commissin
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న కరోనా పరిస్థితుల్లో పెండింగ్ కేసుల విచారణను భౌతికంగా చేపట్టలేమని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పష్టం చేసింది. ఈ నెల 30వ తేదీ వరకు అన్ని పెండింగ్ కేసుల విచారణను వాయిదా వేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఆయా కేసులను వాదిస్తున్న న్యాయవాదులు కూడా వారి క్లయింట్లకు ఇదే విషయాన్ని తెలియజేయాలని కమిషన్ కార్యదర్శి (సీఈఓ కూడా) సర్క్యులర్ (నెం. 122/హెచ్ఆర్‌సీఅడ్మిన్/2021)లో గురువారం స్పష్టం చేశారు.

కొత్తగా ఫిర్యాదులు దాఖలు చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదని, భౌతికంగా కమిషన్ కార్యాలయానికి వచ్చి ఇవ్వవచ్చని, కరోనా నిబంధనలను మాత్రం పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. పోస్టు ద్వారా కూడా అందజేయవచ్చునని వివరించారు.రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సిబ్బంది, పోలీసులు, క్లాస్-4 ఉద్యోగులు, న్యాయవాదులు, ఫిర్యాదుదారులు.. ఇలా అందరికీ ఏప్రిల్ 12వ తేదీ నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు ఎలాంటి ఫిజికల్ విచారణలు ఉండవని స్పష్టం చేశారు.

కరోనా నిబంధనలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరించారు. ఏప్రిల్ 30వ తేదీ వరకు పెండింగ్ కేసుల విచారణకు తేదీలను ఖరారు చేసి రూపొందించిన షెడ్యూలు ఈ సర్క్యులర్ కారణంగా అమలులోకి రాదని, ఏప్రిల్ 30వ తేదీ తర్వాత పరిస్థితిని సమీక్షించి మళ్ళీ విచారణకు కొత్త తేదీలను ఖరారు చేయడంపై నిర్ణయం వెలువడుతుందని స్పష్టం చేశారు.

Advertisement

Next Story