మాస్క్ లు వాడితే సురక్షితమేనా?

by Shyam |
మాస్క్ లు వాడితే సురక్షితమేనా?
X

దిశ వెబ్ డెస్క్ :
కరోనా వైరస్‌ నేపథ్యంలో.. డాక్టర్ల సూచనల మేరకు ప్రతి ఒక్కరూ ముఖానికి మాస్క్‌లు పెట్టుకుంటున్నారు. మార్కెట్‌లో ఏ రకమైనా మాస్క్ లు దొరికితే అవి కొనుక్కుంటున్నారు.
అవి కూడా దొరక్కపోతే ఇంట్లోనే వస్త్రంతో తయారుచేసినవి వాడుతున్నారు. అయితే మాస్క్ ల్లో ప్రధానంగా రెండు రకాల మాస్క్ లను చెప్పుకోవచ్చు. ఒకటి సర్జికల్ మాస్క్. మరొకటి ఎన్-95. వీటి కొరత ఉండటంతో పాటు, ఇంట్లో నుంచి బయటకు వెళ్లే వాళ్లు వస్త్రంతో తయారు చేసిన మాస్క్ పెట్టుకోవచ్చని వైద్యులే సూచించారు. అయితే ఏ రకం మాస్క్‌లు సురక్షితం, వైరస్‌, బ్యాక్టీరియా, దుమ్మును ఎంత వరకు అవి అడ్డుకోగలుగుతాయి? మాస్క్ లను ఎలా ధరించాలి? ఎలా వాష్ చేయాలి? డిస్పోజ్ చేయాలి? తదితర విషయాలు తెలుసుకుందాం.

కరోనా బాధితులు మాట్లాడినా, దగ్గినా, తుమ్మినా .. ఆయా తుంపర్ల ద్వారా కరోనా వైరస్ గాలిలో వ్యాపిస్తుంది. ఆ తుంపర్లు పడిన ప్రదేశాన్ని, వస్తువులను ఎవరైనా తాకినా వైరస్ వ్యాపిస్తుంది. మాస్క్ ధరించడం వల్ల ఆ తుంపర్లను అడ్డుకోవచ్చు. ఒకవేళ తుంపర్లు పడిన వస్తువులను ఎవరైనా చేతులతో తాకినా.. ఆ చేతులను ముఖంపై అనుకోకుండా పెట్టుకున్నా.. మాస్క్ ఆ వైరస్ ను లోపలికి వెళ్లకుండా నిరోధిస్తుంది. ఎన్ 95 మాస్క్ లు ఈ పనిని సమర్థంగా చేస్తాయి. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల మేరకు.. ఆసుపత్రులలో పనిచేస్తున్నవారు ఎన్-95 మాస్క్ ధరించడం ఉత్తమం. తద్వారా రోగుల నుంచి ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండేందుకు అవకాశముంటుంది. వ్యాధికి గురైన వారు, ఆ లక్షణాలు కనిపిస్తున్నవారు, కరోనా వైరస్ అనుమానుతులను సురక్షితంగా చూసుకునేవారు తప్పకుండా ఎన్ 95 మాస్క్ వాడాలి. ఎన్ 95 మాస్కులు గాలిలో ఉన్న 95 శాతం కణాలను వడపోస్తుంది. 0.3 మైక్రాన్ల ధూళి కణాలను అడ్డుకుంటుంది. అంతకన్నా సూక్ష్మ కణాలను ఇది అడ్డుకోలేదు. అంతేకాదు టైట్ ఫిటింగ్ ఉండటం వల్ల ఏ సైడ్ నుంచి కూడా గాలి చొరబడదు.

సర్జికల్ మాస్క్ :

ఎన్ 95 తో పోల్చుకుంటే.. ఇది ముఖానికి కట్టుకుంటే కాస్త వదులుగా ఉంటుంది. ఇది పెద్ద ధూళి కణాలను మాత్రమే ఆపగలుగుతుంది. 0.5 మైక్రాన్ల ధూళి కణాల వరకు ఇది అడ్డుకోగలుగుతుంది. ఇది ఫ్లూయిడ్ రెసిస్టెంట్. ఇది కట్టుకుంటే పెద్ద తుంపరలను అడ్డుకోవచ్చు. గాలిలో ఉన్న చిన్న అణువుల నుంచి ఇది రక్షించలేదు.

క్లాత్ మాస్క్ :

ఇంట్లో చేసుకునే మాస్క్ కనీసంగా రెండు పొరలు ఉండాలి. అంతకన్నా ఎక్కువ పొరలు ఉంటే ఇంకా మంచిది. టీ షర్ట్ , లేదా మందపాటి క్లాత్ అయితే బెటర్. ఇవి పది మైక్రాన్ల ధూళికణాలను అడ్డుకుంటాయి. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ.. వస్త్రంతో తయారు చేసిన మాస్క్ లను పెట్టుకుంటే సరిపోతుంది. నిత్యావసర వస్తువులకు, అత్యవసర పనులకు మాత్రమే బయటకు వెళుతాం కాబట్టి అలాంటి సందర్బాల్లో ఈ క్లాత్ మాస్క్ సరిపోతుంది. కానీ తప్పకుండా సోషల్ డిస్టెన్స్ మెయింటెన్ చేయాలి.

కోవిడ్ -19 : 0.12 మైక్రాన్లు (డయామీటర్) ఉంటుంది.
అదే మన హెయిర్ 15 మైక్రాన్లు(డయామీటర్) ఉంటుంది.

మాస్క్ లను ఎలా ధరించాలి :

ముక్కు, నోరు కవర్ చేసేలా మాస్క్ ధరించాలి. గాలి చొరబడకుండా ఉండేలా మాస్క్ ను టైట్ గా కట్టాలి. మాస్క్ ముందు బాగాన్ని చేతులతో టచ్ చేయకూడదు. మాస్క్ ధరించినప్పుడు, విప్పిన తర్వాత తప్పనిసరిగా చేతులను సబ్బుతో లేదా ఆల్కహాల్ తో కూడిన శానిటైజర్ తో కడుక్కోవాలి.
వేరొకరి మాస్క్ లను ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించకూడదు. వాష్ చేయకుండా మరోసారి అస్సలు ఉపయోగించరాదు.

మాస్క్ లను ఎలా డిస్పోజ్ చేయాలి?

డిస్పోజల్ మాస్క్ అయితే.. దాన్ని ముందు భాగాన్ని ముట్టకుండా.. రెండు మడతలు ఫోల్డ్ చేయాలి. ఆ తర్వాత దాన్ని మళ్లి మరో రెండు మడతలు ఫోల్డ్ చేయాలి. ఇప్పడు ఈయర్ లూప్స్ తో దాన్ని బంధించేసి.. డస్ట్ బిన్లో వేయాలి. ఆ తర్వాత సబ్బుతో చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. వస్ర్తంతో తయారు చేసిన మాస్క్ అయితే.. దాన్ని వేడి చేసిన ఉప్పు నీళ్లలో లేదా సర్ఫ్ నీళ్లలో నానపెట్టాలి.

మాస్క్ ఉత్తమమా? :

2010 లో ఏ ఫ్యాబ్రిక్ ఎంతవరకు ధూళి కణాలను అడ్డుకుంటాయన్న అంశంపై ఓ అధ్యయనం జరిగింది. అందులో
టవెల్స్ 40 శాతం వరకు ధూళికణాలను అడ్డుకుంటాయని తెలిసింది. అదే విధంగా…
స్వెట్ షర్ట్ – 20-40 శాతం
స్కార్ఫ్ – 10-20 శాతం
టీ షర్ట్ – 10శాతం

హ్యండ్ వాష్.. గ్లోవ్స్… మాస్క్ ?

సార్స్ కూడా మనుషులపై చాలా ప్రభావం చూపింది. అప్పుడు కూడా చేతులను శుభ్రం చేసుకోవడం, మాస్క్ ధరించడం విధిగా చేశారు. అయితే ఇలా చేయడం వల్ల ఎంత వరకు ఉపయోగం ఉందని 2007 లో ఓ సర్వే జరిగింది. దాని ప్రకారం
హ్యండ్ వాషింగ్ (రోజులో 10 సార్లు ) – 55 శాతం (వైరస్ వ్యాప్తి చేయకుండా అరికట్టగలం )
గ్లోవ్స్ పెట్టుకోవడం వల్ల – 57శాతం
మాస్క్ ధరించడం వల్ల -68 శాతం

ఇవి తప్పనిసరి :

మాస్క్ పెట్టుకున్నా.. మనిషికి మనిషికీ కనీసంగా మూడు అడుగుల దూరం ఉండాలి. వైరస్ ను అడ్డుకోవడానికి ఇదే అత్యుత్తమ మార్గం.
తరచూ, బయట నుంచి ఇంట్లోకి వచ్చినపుడు కనీసం 20 సెకన్లపాటు మీ చేతులను సబ్బు, నీళ్లతో కడుగుతూ ఉండండి.
సబ్బు, నీళ్లు అందుబాటులో లేనపుడు చేతులు కడగడానికి ఆల్కహాల్ తో కూడిన శానిటైజర్ ఉపయోగించండి.
దగ్గు, తుమ్ము వచ్చినపుడు అర చేతుల్తో ముక్కు, నోరు కప్పుకోకుండా టిష్యూ లేదా మీ మోచేతిని ఉపయోగించండి.
వాడిన టిష్యూలను వెంటనే బిన్‌లో పడేసి, తర్వాత చేతులు కడుక్కోండి.
మీ చేతులు శుభ్రంగా లేకపోతే నోరు, ముక్కు, కళ్లు తాకకండి

Tags: corono virus, covid-19, mask, hand washing, n-95, sanitizer, precautions

Advertisement

Next Story

Most Viewed