కొవిడ్ వేళ.. పసి మనసులు పైలం!

by Shyam |
కొవిడ్ వేళ.. పసి మనసులు పైలం!
X

దిశ, ఫీచర్స్ : దేశంలో COVID-19 కేసులు ఊహించని రీతిలో పెరుగుతున్నాయి. ఈ క్లిష్ట దశను అధిగమించేందుకు మార్గాలున్నా.. ప్రతీచోట అయోమయం, గందరగోళ పరిస్థితులే నెలకొన్నాయి. ఇలాంటి సమయంలో శారీరక ఆరోగ్యమే కాదు, మానసిక ఆరోగ్యమూ ముఖ్యమే. హాస్పిటల్‌లో పడకలు, ఆక్సిజన్ సిలిండర్లు, అవసరమైన మందులతో పాటు ప్లాస్మా దాతల కొరత కూడా ఉన్నందున మన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ పూర్తిగా చేయి దాటిపోతోంది. ఈ ఆపత్కాలాన్ని ఆత్మస్థైర్యంతో ఎదుర్కోవాల్సిన అవసరం ఉండగా.. గతేడాది కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందినప్పుడు కూడా పెద్దగా ప్రభావితం కాని పిల్లలు, రెండో దశలో మాత్రం ప్రభావితమవుతున్నారు. అందువల్ల ఈ కఠిన సమయంలో పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యం పట్ల సరైన జాగ్రత్తలు తీసుకోవడం మన బాధ్యత. ఈ క్రమంలో మానసిక నిపుణులు అందిస్తున్న చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే వారిని కొవిడ్ భయాందోళన నుంచి కాపాడుకోవచ్చు.

వైద్యుల అభిప్రాయం ప్రకారం.. కొవిడ్-ప్రేరిత లాక్‌డౌన్ అనేక మంది పిల్లల్లో మానసిక, శారీరక ఆరోగ్య సమస్యలను కలిగించింది. ఈ మేరకు ఆస్పత్రుల్లో మానసిక సంబంధిత రోగాలతో బాధపడుతున్న పిల్లల సంఖ్య పెరిగింది. ప్రతీ వారం కనీసం రెండు కేసులు నమోదవుతున్నట్లు డాక్టర్లు పేర్కొంటున్నారు. కాగా ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలకు భరోసానివ్వడం చాలా ముఖ్యం. వాళ్లు ఏం చెప్పాలనుకుంటున్నారో ముందుగా వినాలి, వారిలో ఎలాంటి ఆలోచనలున్నాయో శాంతంగా తెలుసుకోవాలి. కరోనావైరస్ వ్యాప్తికి సంబంధించిన ఏమైనా సందేహాలుంటే, విసుక్కోకుండా సమాధానమివ్వాలి. ఒకవేళ వారితో కఠినంగా మాట్లాడితే తమ భయం, ఆందోళన మరింత పెరుగుతాయి. .

అలా కాకుండా సరైన జాగ్రత్తలు తీసుకుంటే త్వరలోనే మళ్లీ పాతరోజులు వస్తాయని వారికి వివరంగా చెప్పాలి. టీవీలో చూసిన వార్తలు, దృశ్యాలు, ఇరుగుపొరుగు మాట్లాడుకునే ముచ్చట్లు, సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్ చిన్నపిల్లల్లో భయాన్ని కలిగిస్తాయి. దాంతో వాళ్లు నిద్రపోవడానికి భయపడొచ్చు. ఆ భయాన్ని తొలగించేలా వారికి కథలు చెపితే.. ఆ ఊహాల్లో హ్యాపీగా నిద్రపోతారు. రోజుకు 8 నుంచి 9 గంటలు సాధారణ నిద్ర పోయేలా చూసుకోవాలి. స్నేహితుల నుంచి శారీరకంగా దూరం కావడం కూడా పిల్లలకు బాధ కలిగిస్తుంది. వారి స్నేహితులు, కజిన్స్, ప్రియమైన వారితో వీడియో లేదా వాయిస్ కాల్స్ ద్వారా మాట్లాడించాలి. పిల్లలకు స్నేహితులు లేని లోటు తెలియకుండా వారితో గేమ్స్ ఆడాలి.

రైట్ ఇన్ఫర్మేషన్ :

కరోనా మహమ్మారికి సంబంధించిన వార్తలు, సంబంధిత విషయాలను వారికి చేరవేయడం కరెక్ట్ కాదని గ్రహించాలి. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుందో వారికి అవగాహన కల్పించాలి. దీంతో వాళ్లలో ఆందోళన కొంత మేర తగ్గి, రియాలిటీని తెలుసుకుంటారు. ఈ సమయంలో పిల్లలు చాలా ఇన్ యాక్టివ్‌గా ఉంటారు. అందువల్ల వారిలో ఉత్సాహం నింపేందుకు ఇండోర్ గేమ్స్, బోర్డ్ గేమ్స్ ఆడించాలి. ఆరోగ్య స్పృహ పెంచేందుకు వ్యాయామాలు, యోగా లేదా డ్యాన్స్ చేసేలా ప్రోత్సహించడంతో పాటు ఇంటి పనుల్లో వారిని భాగం చేయాలి. ఇంటి బాధ్యతలు, డబ్బు ఆదా, పర్యావరణం, వాతావరణ కాలుష్యం వంటి విషయాలు గురించి వివరిస్తూ సృజనాత్మక కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రోత్సహించాలి. ఇక స్కూళ్లు, కాలేజీలు లేనందున వారి పాఠాలకు సంబంధించిన చిన్న చిన్న అసైన్‌మెంట్స్ ఇస్తూ రెగ్యులర్ స్టడీ నుంచి వారిని డీవియేట్ కాకుండా చూసుకోవాలి.

కేస్ స్టడీ :

లాక్‌డౌన్ కారణంగా.. పేరెంట్స్ తమ పిల్లలకు మొబైల్ అలవాటు చేయడంతో వారి స్క్రీన్ టైమ్ పెరిగింది. ఈ నేపథ్యంలో ముంబైకి చెందిన ఓ 22 నెలల చిన్నారికి స్పీచ్ రిగ్రెషన్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. తనను అక్కడి డాక్టర్ ఎల్‌హెచ్ హిరానందని ఆస్పత్రికి తీసుకెళ్లగా.. ‘ఆ పిల్లాడు ఎవరితోనూ మాట్లాడేందుకు ఆసక్తి చూపించడం లేదు. గతంలో 15-20 పదాలు మాట్లాడేవాడు, ఇప్పుడు 1-2 పదాలే మాట్లాడుతున్నాడు. నోరు విప్పకుండా తనకు కావాల్సిన వాటిని పాయింట్ అవుట్ చేసి చూపిస్తున్నాడు. ప్రతి రోజు సుమారు నాలుగు గంటల పాటు మొబైల్ ఫోన్, టీవీ చూడటం వల్లే ప్రస్తుతం అతడు వర్చువల్ ఆటిజంతో బాధపడుతున్నాడు. కాగా ‘2 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలకు సిఫార్సు చేసిన స్క్రీన్ సమయం సున్నా’ అని హిరానందాని ఆస్పత్రి శిశువైద్యుడు డాక్టర్ బీజల్ శ్రీవాస్తవ అన్నారు. అతని స్క్రీన్ సమయాన్ని తగ్గించి.. హియరింగ్ టెస్ట్, స్పీచ్ థెరపీని ప్రారంభించాలని, ఎక్కువమంది పిల్లలతో ఆడించినా ఫలితం ఉంటుందని వైద్యులు అతని తల్లిదండ్రులకు సూచించారు.

మరొక కేసులో.. 12 ఏళ్ల బాలుడికి ‘యాంగ్జయిటీ డిజార్డర్’ ఉన్నట్లు నిర్ధారణ అయింది. లాక్‌డౌన్‌తో పెరిగిన స్క్రీన్ సమయం అతన్ని తీవ్రంగా చికాకు, ఆందోళనకు గురి చేశాయని వైద్యులు తెలిపారు. ‘అతను 8 నుంచి 10 గంటల పాటు స్క్రీన్ చూశాడు. ఇది అతడిలో ఆందోళన, తలనొప్పి కారణం అవడంతో పాటు నిద్రలేమికి దారితీసింది. గాడ్జెట్‌లపై సమయాన్ని తగ్గించి పిల్లలను సంగీతం, క్రాఫ్ట్ వంటి కార్యకలాపాల్లో పాల్గొనేలా చూడాలని.. శారీరక శ్రమ పెంచే స్కిప్పింగ్, జాగింగ్ వంటి యాక్టివిటీస్ చేయాలని సూచించాం. యోగా చేయడం వల్ల మానసిక ప్రశాంతత పెరుగుతుందని అతని తల్లిదండ్రులకు సలహా ఇచ్చాం’ అని పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ డాక్టర్ ఓంకార్ హజీర్నిస్ తెలిపారు.

పిల్లలను ఆరోగ్యంగా చూసుకోవడం అన్నింటికంటే ముఖ్యం. వారికి చేతులను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసుకోవడం నేర్పించడంతో పాటు దగ్గులు, తుమ్ములు లేదా ఇతరత్రా ఆరోగ్యపరమైన ఇబ్బందులుంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వైద్య సహాయం తీసుకోవాలి.

గమనిక : ఏదైనా సహాయం అవసరమైతే, దయచేసి COVID -19 సైకో సోషల్ టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్‌ను 080-46110007 సంప్రదించండి లేదా మరిన్ని వివరాల కోసం మీ డాక్టర్ లేదా మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.

Advertisement

Next Story

Most Viewed