యాసంగి సాగు ఎట్లా..? ధాన్యం దిగుబడిని కొనేదెవరు..?

by Anukaran |
యాసంగి సాగు ఎట్లా..? ధాన్యం దిగుబడిని కొనేదెవరు..?
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఆరుగాలం కష్టించి పండించిన పంటలను అమ్ముకునేందుకు రైతులు రోడ్డెక్కాల్సి వస్తోంది. మొన్నటి వరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలతో రైతన్నకు కాస్త ఉపశమనం ఉండేది. కొన్నిచోట్ల పలు సందర్భాల్లో వ్యాపారులు కూడా ఎమ్మెస్పీ కంటే ఎక్కువ ధర పెట్టేవారు. కారణం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఉండటమే. కానీ ఇప్పుడు రాష్ట్రంలో పంట ఉత్పత్తులకు సంబంధించి కొనుగోలు కేంద్రాలను ఎత్తివేయాలన్న ప్రభుత్వ నిర్ణయం రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. వచ్చే సీజన్​ నుంచి కొనుగోలు చేయమంటూ సీఎం కేసీఆర్​ ప్రకటించడంతో మద్దతు ధర ఎలా అనేది సందేహంగా మారింది. కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) వస్తుందా లేదా అనేదీ అనుమానమే.

కొత్త చట్టం ఉందా… ?

కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను సర్వోన్నత న్యాయస్థానం రిజర్వులో పెట్టింది. ఈ చట్టాలను అమలు చేసే అంశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నట్లు వెల్లడించింది. దీంతో ఇప్పుడు ఆ చట్టాలు అమల్లో ఉన్నాయా లేవా అనేది తేలని ప్రశ్న. కేంద్రం మాత్రం కొత్త చట్టాలను అమలు చేస్తామంటూ భీష్మించుకుని ఉంది. ఈ నేపథ్యంలో ముందుగా సాగు చట్టాలను వ్యతిరేకించిన తెలంగాణ రాష్ట్రం ఒక్కసారిగా వ్యూహం మార్చింది. కేంద్ర చట్టాలపై రోడ్డెక్కిన గులాబీ దళం యూటర్న్​ తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో సీఎం కేసీఆర్​ ప్రవేశపెట్టిన నియంత్రిత సాగును రద్దు చేసుకుంటున్నామని ప్రకటిస్తూనే వచ్చే సీజన్​ నుంచి కొనుగోలు కేంద్రాలను సైతం ఎత్తివేస్తున్నట్లు స్పష్టం చేసింది. కేంద్ర చట్టానికి మద్దతు తెలుపుతున్నట్లు పరోక్షంగా ప్రకటించారు. దీంతో ఇప్పుడు రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

రైస్​ బౌల్​ ఆఫ్​ తెలంగాణ..

మరోవైపు తెలంగాణలో వరి ధాన్యం సాగు గణనీయంగా పెరిగింది. దేశంలో రాష్ట్రం రెండో స్థానంలో నిలిచింది. ప్రస్తుత యాసంగి సీజన్​లో కోటి టన్నుల ధాన్యం వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. సాగునీటి ప్రాజెక్టులను చూపిస్తూ తెలంగాణ ధాన్యాగారంగా ప్రభుత్వం ప్రకటించుకుంటూనే ఉంది. కానీ కొనుగోలు కష్టాల ఊసు మాత్రం ఎత్తడం లేదు. వానాకాలం సీజన్లోనే కొనుగోళ్లకు రైతులు చాలా కష్టాలు ఎదుర్కొన్నారు. నియంత్రిత సాగు విధానంలో భాగంగా సన్నాలను ఎక్కువగా పండించినా అమ్ముకోవడం ఇబ్బందులు తెచ్చింది. మద్దతు ధర పెంచుతామని సీఎం ప్రకటించినా కార్యరూపం దాల్చలేదు.

కింకర్తవ్యం…?

ఇప్పుడు రాష్ట్రంలో పండించే ధాన్యం పరిస్థితి ఏమిటనేది రైతుల్లో మొదలైన ప్రశ్న. ఓ వైపు నియంత్రిత సాగు విధానం, రైతుబంధు సమన్వయ సమితుల ఏర్పాటుతో అన్నదాతకు కష్టం రానివ్వమని చెప్పుకొచ్చిన ప్రభుత్వం ఒక్కసారిగా కాడెత్తేసింది. ఎలాగోలా వానాకాలం ముగిసింది. ఇప్పుడు యాసంగి పరిస్థితి ఏంటనేది ప్రశ్న. ఐకేపీ కొనుగోలు కేంద్రాలు ఉండవని తేలింది. సొసైటీల్లో బస్తా కూడా కొనరు. రైతుబంధు సమన్వయ సమితులు ఉన్నా లేనట్టే. ఇప్పుడు చేతికి వచ్చే పంటలను ఎక్కడ, ఎలా అమ్ముకోవాలనేదే ముందున్న కింకర్తవ్యం.

గ్యారంటీ ఉండని మద్దతు ధర..

రైతులు తమ ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా అమ్ముకునే వీలును కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాలు కల్పిస్తున్నా కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) పరిస్థితేంటన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు ఎఫ్‌సీఐ, నాఫెడ్‌, మార్క్‌ఫెడ్‌, రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ, స్వయం సహాయక సంఘాలు, పీఏసీఎస్​లు పంట ఉత్పత్తులను కొనుగోలు చేసినా రైతులకు కనీస మద్దతు ధర గ్యారంటీ ఉండేది. అంతకు ముందు నుంచే కేంద్రం ప్రైవేటు మార్కెట్‌ వ్యవస్థను ప్రోత్సహిస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రైతులు వ్యవసాయ మార్కెట్‌ కమిటీల్లో విక్రయించుకోవచ్చని, ధర ఎక్కువ ఉంటే బయట కూడా విక్రయించుకోవచ్చని అవకాశం కల్పించింది. బయట అమ్ముకునే విషయం పక్కనబెడితే మార్కెట్‌ కమిటీల్లో కొనుగోళ్లకు సంబంధించి, ఎమ్మెస్పీపై ఇటు రైతులకు, అటు మార్కెటింగ్‌ శాఖ అధికారులకు స్పష్టత లేదు.

ఇప్పుడు కమీషన్‌ ఏజెంట్లు, లైసెన్స్‌ హోల్డర్లు, ప్రైవేటు ట్రేడర్లు రైతులకు మద్దతు ధర కల్పించకపోతే ఎవరు బాధ్యత వహిస్తారనే ప్రశ్న తలెత్తుతోంది. గతంలో ఎమ్మెస్పీ అమలు చేయకపోతే చట్టరీత్యా చర్యలు తీసుకునే అవకాశం ఉండేది. లైసెన్సులు కూడా రద్దు చేసేవారు. కానీ, కేంద్ర ప్రభుత్వ కొత్త చట్టాల్లోగానీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రకటనలో అయినా ధరల నియంత్రణ, ఎమ్మెస్పీ గ్యారంటీ లేదు. రైతులకు, ట్రేడర్లకు మధ్య తగాదాలు వస్తే సబ్‌ డివిజనల్‌ మెజిస్ట్రేట్‌ దగ్గర రిపోర్టు చేయాలని మాత్రమే కొత్త చట్టంలో పేర్కొన్నారు. కానీ, మెజిస్ట్రేట్‌ను ఎప్పుడు, ఎలా ఆశ్రయించాలో స్పష్టం చేయలేదు. తొలుత డివిజన్‌ స్థాయి మెజిస్ట్రేట్‌ వద్దకు, అక్కడ తేలకపోతే అప్పీలేట్‌ అథారిటీకి వెళ్లవచ్చని చట్టంలో పేర్కొన్నప్పటికీ ఇదంతా రైతులకు సాధ్యమవుతుందా? అనేది స్పష్టత లేని అంశమే.

పెట్టుబడి వస్తుందా మరి..?

ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా చేతెలెత్తేశాయి. ఒక్కమాటలో చెప్పాలంటే రైతులను గాలికి వదిలేశాయి. పంటలు వేసుకోవడమూ, అమ్ముకోవడమూ మీ ఇష్టమే అన్నట్టుగా తేల్చాయి. కనీస మధ్దతు ధర అమలు అంశాన్ని చట్టంలో పొందుపర్చలేదు. అంటే ఎమ్మెస్పీని కచ్చితంగా అమలు చేయాలనే బాధ్యత నుంచి కేంద్రం వైదొలిగింది. రాష్ట్రంలో అయితే ఆ చట్టాలపైనే ఆధారపడి ఇష్టమొచ్చినచోట పంట ఉత్పత్తులు అమ్ముకోవాలని సీఎం కేసీఆర్​ తేల్చేశారు. కొనుగోలు కేంద్రాలు ఎత్తివేస్తే రైతులకు ఉత్పత్తి ఖర్చులు వస్తాయనే గ్యారంటీ కూడా లేదు.

సీఎందే తుది నిర్ణయం

– మంత్రి గంగుల కమలాకర్

​పంట ఉత్పత్తుల కొనుగోళ్లలో సీఎం కేసీఆర్​ తీసుకునే నిర్ణయమే ఫైనల్​. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం కేంద్రం నుంచి విధానాలు రావాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. కొనుగోళ్లకు మాత్రం మా శాఖ తరఫున మేం సిద్ధంగానే ఉన్నాం. కానీ దీనిపై సీఎం కేసీఆర్​ తీసుకునే నిర్ణయమే ఫైనల్​

రాష్ట్రం కొనలేని పరిస్థితులను వివరించాలి

– మంత్రి సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి

కేంద్ర చట్టాల్లో కనీస మద్దతు ధర ఎంతో తేల్చలేదు. మద్దతు ధర లేనప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోళ్లు చేసే అవకాశం లేదు. ఇలాంటి పరిస్థితులను రైతులకు వివరించాలి. ఈ యాసంగికి కోటి 13 లక్షల టన్నుల ధాన్యం వస్తుంది. ఈ కొనుగోళ్ల అంశంపై సీఎం కేసీఆర్​ ఆదేశాల ప్రకారమే ముందుకు వెళ్తాం.

రైతుబంధు సమితుల పాత్ర కొనసాగుతుంది

– రైతుబంధు సమితి చైర్మన్​ ​ పల్లా రాజేశ్వర్​రెడ్డి

పంటలు వేయడం నుంచి మొదలుకుని అమ్మడం వరకు రైతుబంధు సమితి సభ్యుల భాగస్వామ్యం ఉంటుంది. రైతువేదికల్లో రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి, వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులతో చర్చిస్తాం. భూములను బట్టి ఏ ఏ పంటలు వేయాలో రైతులకు అవగాహన కల్పిస్తాం. కొనుగోళ్ల ప్రక్రియలో కూడా మార్కెట్​ యార్డు పరిధిలోని గ్రామాల నుంచి కేటాయించిన వంతు వారీగా రైతులను అమ్ముకునేందుకు పంపిస్తాం. రైతుబంధు సమితి సభ్యులు కీలకంగా వ్యవహరిస్తారు.

ప్రతి గింజా రాష్ట్ర ప్రభుత్వమే కొనాలి..

– సీఎల్పీ భట్టి విక్రమార్క

రాష్ట్రంలో పండిన ప్రతి గింజను కొనాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే. రైతులకు కొనుగోలు కష్టాలు రావద్దనే కాంగ్రెస్​ హయాంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాం. అవి విజయవంతంగా నడిచాయి. కేంద్ర చట్టాలకు మద్దతు ఉండదని చెప్పి ఆందోళనల్లో భాగస్వాములైన సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత మాట మార్చారు. ఇది రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. పంట దిగుబడులను కొనుగోలు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం.

Advertisement

Next Story