- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సొంతింటి కలలకు రాజకీయ గ్రహణం
దిశ, ఏపీ బ్యూరో: పేదలంటే రక్తమాంసాలతో ప్రాణమున్న మనుషులు కాదు. రాజకీయ పార్టీల ఓటు బ్యాంకులు. ఆయా పార్టీల ఆస్తులు. అధికారం కోసం నిరుపేదల జీవితాలతో చెలగాటమాడతారు. అధికారంలో ఉన్నోళ్ల నుంచి లాగేసుకోవాలని ప్రతిపక్షం ప్రయత్నిస్తుంది. ప్రతిపక్షం వైపు వెళ్లకుండా తమ దగ్గరే ఉంచుకోవాలని అధికార పక్షం చూస్తుంది. ఈ రాజకీయ బంతాటలో సమిధలు పేదలే. దశాబ్దాలపాటు రాష్ట్రంలో కొనసాగుతున్న చరిత్ర ఇదే. తాజాగా పేదల నివేశన స్థలాలు, గృహ నిర్మాణం రాజకీయ క్రీనీడ కింద దోబూచులాడుతోంది.
రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న నవరత్నాల్లో భాగంగా పేదలకు ఇంటి నివేశన స్థలాలు ఇచ్చి గృహ నిర్మాణం చేపట్టాలని ముందుకొచ్చింది. వైసీపీ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను త్వరితగతిన అమలు చేసేందుకు దూకుడుగా కదులుతోంది. ప్రభుత్వాన్ని నిలువరించేందుకు ప్రతిపక్షం దివాళాకోరు ఎత్తుగడలతో వాటికి అడ్డుకట్టలు వేస్తోంది. అందులో భాగంగానే పేదలకిచ్చే ఇంటి నివేశన స్థలాల విషయంలో న్యాయ స్థానాల్లో కేసులు పెట్టించింది. దీంతో ఈ పథకం వాయిదాల పర్వం కొనసాగుతోంది. అంబేద్కర్ జయంతి పోయింది. సంక్రాంతి వచ్చింది. వైఎస్సార్ జయంతీ పోయింది. ఇంకెన్నాళ్లు పడుతుందో తెలీదు. లబ్దిదారులు ప్రతిపక్షాన్ని దుమ్మెత్తి పోస్తున్నారు. అధికార పక్షానికి ఇంతకన్నా ఏం కావాలి!
వాస్తవానికి ప్రభుత్వ భూమి అయినా, సేకరించి ఇచ్చినా డీకే పట్టానే ఇవ్వాలి. కానీ ప్రభుత్వం టైటిల్ డీడ్తో మహిళల పేరున రిజిస్టర్ చేసివ్వాలని నిర్ణయించింది. ఐదేళ్ల తర్వాత క్రయ విక్రయాలకు వీలు కల్పించింది. రాష్ట్రంలోని 30 లక్షల మంది లబ్దిదారులకు రెండు దశల్లో ఇల్లు కూడా కట్టించి ఇవ్వాలని నిర్ణయించింది. అందుకోసం నమూనా ఇళ్లను రూపొందించింది. ప్రభుత్వం అసైన్డ్ భూమికి టైటిల్డీడ్తో ఎలా రిజిస్టర్ చేస్తారని ప్రతిపక్షం కేసులు వేయించింది. రెవెన్యూ చట్టాలను ఉల్లంఘిస్తున్నారని ఆరోపించింది. విద్యా సంస్థలు, ఇతర పేదల భూములను ఇంటి నివేశన స్థలాలుగా ఇవ్వడానికి లేదని వాదిస్తోంది.
నాసిరకం, ముంపునకు గురయ్యే భూములు, నివాస యోగ్యం కాని భూములను పేదలకివ్వడం అన్యాయమని న్యాయ స్థానాలను ఆశ్రయించింది. ఈ భూముల సేకరణలోనూ పెద్ద ఎత్తున అధికార పార్టీ నేతలు కక్కుర్తి పడినట్లు ప్రతిపక్షం ఘోషిస్తోంది. దీనిపై నారా చంద్రబాబు నాయుడు గురువారం సీఎస్ నీలం సాహ్నికి లేఖ రాశారు. కానీ సెంటూసెంటున్నర భూమిలో ఇచ్చే ఇంట్లో పేదలు నివాసం ఎలా ఉంటారని మాత్రం ప్రస్తావించలేదు. గత ప్రభుత్వ హయాంలో కేవలం ఎన్నికల ఏడాదిలో హడావుడిగా చేపట్టిన జీ ప్లస్ త్రీ ఇళ్ల నిర్మాణాలకు కేవలం పునాదులే పడ్డాయి. పూర్తి చేసి లబ్దిదారులకు ఇచ్చింది నామమాత్రమే.
ప్రభుత్వానికి పట్టని పేదల ఆక్రోశం
సొంతిల్లు లేని పేదలకు ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో సెంటు, గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్నర స్థలంలో రూ. 2.5 లక్షల వ్యయంతో ఇల్లు కట్టించి ఇవ్వాలని నిర్ణయించింది. కేవలం ఒక్క పడక గదితో ఇంటి పెరడు లేకుండా బతికేదెట్లాగని లబ్దిదారులు వాపోతున్నారు. పేద కుటుంబాలకు ఓ గేదె.. కోళ్లు, మేకలు, గొర్రెల పెంపకం ద్వారా వచ్చే ఆదాయం కీలకం. రోజువారీ కూలి పనులకు వెళ్లినా వీటి పెంపకం ద్వారా ఆదాయం వస్తేనే కుటుంబాలు నడుస్తాయి. కానీ ప్రభుత్వం ఇచ్చే స్థలం సరిపోదు.
ఇక ఇంటి నుంచి వెలువడే వ్యర్థ జలాలతో పచ్చని చెట్లు పెంచుకునే అవకాశమే లేదు. రెండు దశాబ్దాల క్రితం ప్రభుత్వాలు మూడు సెంట్లు ఇచ్చేది. వైఎస్ హయాంలో దాన్ని సెంటున్నరకు కుదించారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో అది సెంటు స్థలానికి పడిపోయింది. ప్రస్తుత కరోనా కాలంలో ఒకే పడక గది ఇంట్లో భౌతిక దూరం పాటించలేరు. ఐసోలేషన్కు అవకాశమే లేదు. ఇళ్ల మధ్య గాలి, వెలుతురు వచ్చే అవకాశం లేకపోతే అంటు వ్యాధులతోపాటు తీవ్రమైన ఆరోగ్యసమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల కనీసం రెండు సెంట్లయినా ఇవ్వాలని మొరపెట్టుకున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు.
రెండు పడకల ఇల్లు నిర్మించి ఇవ్వాలని ఎన్ని విజ్ఞాపనలు చేసినా లెక్కపెట్టలేదు. “ఎంత మందికి స్థలాలిచ్చాం.. ఎంతమందికి ఇళ్లు కట్టించి ఇచ్చామనే సంఖ్య చెప్పుకోవడానికే ప్రభుత్వం పాకులాడుతోంది. ఇటీవల అమూల్కంపెనీతో ప్రభుత్వం ఓ ఒప్పందం చేసుకుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు వైఎస్సార్చేయూత పథకం ద్వారా ఇచ్చే సొమ్ముతో రెండు గేదెలు పెట్టుకుంటే.. అమూల్ కంపెనీ పాలను సేకరిస్తుందని చెప్పారు. మరి ఇంత చిన్న జాగాలో ఇల్లుంటే గేదెలు పెట్టుకోవడం ఎలా !” అంటూ ప్రకాశం జిల్లా ఇంకొల్లు మండలం కొనికి గ్రామ నివాసి నలతోటి కోటేశ్వరరావు వాపోయాడు. కోర్టు కేసులు తెమిలి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి మరో రెండు నెలలు పట్టొచ్చు. ఇప్పటికైనా ప్రభుత్వం పేదల అవసరాలు గుర్తించి అందుకు తగ్గట్టుగా గృహ నిర్మాణం చేపట్టాలి.