15 రోజులు తయారీ ప్లాంట్లను మూసేస్తున్నట్టు ప్రకటించిన హోండా!

by Harish |   ( Updated:2021-04-29 10:30:02.0  )
15 రోజులు తయారీ ప్లాంట్లను మూసేస్తున్నట్టు ప్రకటించిన హోండా!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలోని అనేక పారిశ్రామిక కార్యకలాపాలపై ప్రత్యక్షంగా పరిమితులు, లాక్‌డౌన్ ఆంక్షలు లేకపోయినప్పటికీ పరిశ్రమల్లో ఆక్సిజన్ వినియోగానికి ఇబ్బందులు తలెత్తాయి. కరోనా సెకెండ్ వేవ్ వల్ల ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ఉపయోగం అధికంగా అవసరమైన కారణంగా ఆటో కంపెనీలు తమ ఫ్యాక్టరీల్లో ఉత్పత్తిని తగ్గించే ప్రయత్నాలను ప్రారంభించాయి. ఇప్పటికే మారుతీ సుజుకి ఆక్సిజన్ వినియోగాన్ని తగ్గించి ప్రజలను కరోనా నుంచి రక్షించే నిర్ణయాన్ని ప్రకటించగా, తాజాగా హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ కంపెనీ తన నాలుగు ప్లాంట్‌లలో ఉత్పత్తిని నిలిపేస్తున్నట్టు ప్రకటించింది. మే 1 నుంచి 15వ తేదీ వరకు ఈ మూసివేత ఉంటుందని, కరోనా నేపథ్యంలో ఆక్సిజన్ వినియోగాన్ని తగ్గించడంతో పాటు మెయింటెనెన్స్‌లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.

ఇందులో భాగంగా హర్యానా, రాజస్థాన్, కర్ణాటక, గుజరాత్‌లోని ప్లాంట్‌లను మూసేయనున్నారు. ఇదే సమయంలో హోండా కస్టమర్లకు, వ్యాపార భాగస్వాములకు సాధ్యమైనంత వరకు అందుబాటుల్ ఉండేందుకు అవసరమైన సిబ్బంది వర్క్ ఫ్రమ్ హోమ్ కొనసాగిస్తారని వివరించింది. మరికొందరు అవసరమైన సిబ్బంది అన్ని ప్లాంట్లు, ఆఫీసుల్లో అందుబాటులో ఉంటారని కంపెనీ వెల్లడించింది. ఇదే బాటలో మరో ఆటో దిగ్గజం టయోటా కిర్లోస్కర్ మోటార్ లిమిటెడ్ ఏప్రిల్ 26 నుంచి మే 14 వరకు బెంగళూరులోని తన రెండు ప్లాంట్లను మూసేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎంజీ మోటార్ సైతం ఇదే కారణంతో గుజరాత్‌లోని తయారీ యూనిట్‌ను 7 రోజులు మూసేస్తున్నట్టు తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed