అక్రమాలకు నిలయంగా శిల్పా వెంచర్..

by Sumithra |
అక్రమాలకు నిలయంగా శిల్పా వెంచర్..
X

దిశ, సంగారెడ్డి : అక్రమాలకు నిలయంగా శిల్పా వెంచర్ నిలిచింది. శిల్పా వెంచర్ లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. గతంలో నల్లవాగును ఆక్రమించి అందమైన పార్కులు నిర్మించడం వర్షాలు పడడంతో నేషనల్ హైవే పైకి నీరు చేరి ఇబ్బందులు పడడంతో వెలుగులోకి వచ్చిన నాటి నుంచి అన్ని అక్రమాలే చోటు చేసుకున్నాయి. నల్లవాగు నిర్మాణాన్ని ఇరిగేషన్ అధికారులు చొరవ తీసుకుని కాలువను పూర్తి స్థాయికి మార్చారు. కానీ అదే శిల్పా వెంచర్ తాను ఏర్పాటు చేసిన వెంచర్ కు మాత్రం ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. డీటీసీపీ, రేరా, ఎల్పీ నంబర్ లేకుండానే వెంచర్ ఏర్పాటు చేశారు. 2019లో డీటీసీపీకి దరఖాస్తు చేసుకున్న శిల్పా వెంచర్ అందుకు సరియైనా పత్రాలు సమర్పించనందున అనుమతులు ఇవ్వలేదు. అదే విధంగా డీటీసీపీ అప్రూవల్ సందర్భంగా తప్పనిసరిగా వెంచర్ ఎంత విస్తీర్ణంలో చేస్తున్నారు. అందుకు సంబంధించిన లే అవుట్ ఇవ్వాల్సి ఉంటుంది. అదే విధంగా డీటీసీపీ నుంచి తాత్కాలిక అనుమతులు పొందారు. ఈ అనుమతుల ద్వారా కేవలం రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ సౌకర్యం వంటివి మాత్రమే చేయాల్సి ఉంటుంది.

లే అవుట్ ప్రకారం గ్రామ పంచాయతీకి వెంచర్ లో ఏర్పాటు చేసే పార్కులు, రోడ్లు, డ్రైనేజీలను మార్టిగేజ్ చేయాల్సి ఉంటుంది. ఇవి చేస్తేనే వెంచర్ నిర్మాణానికి డీటీసీపీ పూర్తి స్థాయి అనుమతులు మంజూరు చేస్తుంది. కానీ శిల్పా వెంచర్ 2019 నుంచి ఇప్పటి వరకు కూడా గ్రామ పంచాయతీకి సంబంధించిన ఎలాంటి మార్టగేజ్ చేయలేదు. డీటీసీపీ నుంచి పూర్తిస్థాయి అనుమతులు పొందలేదు. వెంచర్ కు అనుమతులు లేకుండా ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. కానీ శిల్పా వెంచర్ మాత్రం అవేమి పట్టించుకోకుండా అందమైన విల్లాలు, భవనాలు నిర్మాణాలు చేపట్టింది. అనుమతి లేకుండానే విల్లాలు నిర్మించడం పట్ల డీటీసీపీ అధికారులు పంచాయతీ కార్యదర్శికి వాటిని కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేశారు. కానీ గ్రామ పంచాయతీ కార్యదర్శి,వారి ఉన్నతాధికారులు అక్రమ నిర్మాణాలపై ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. దీంతో అనుమతులు లేకుండా మరిన్ని భవన నిర్మాణాలను శిల్పావెంచర్ చేపట్టింది. గ్రామ కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి శిల్పా వెంచర్ లో కావల్సిన మౌళిక సౌకర్యాలు కల్పించకపోయిన, డీటీసీపీ అధికారులు ఫైనల్ డీటీసీపీ ఇవ్వకపోయిన వెంచర్ కు మార్టగేజ్ జారీ చేసినట్లు గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నాగ్సాన్ పల్లి గ్రామ పరిధిలోని వెంచర్లకు మార్టగేజ్ చేశారని గ్రామ కార్యదర్శిపై ఫిర్యాదులు రావడంతో ఆయనను అధికారులు సస్పెండ్ చేశారు.

అనుమతులు లేకుండానే అందమైన నిర్మాణాలు..

శిల్పా వెంచర్ ఎలాంటి అనుమతులు లేకుండానే ప్లాట్లను విక్రయించడంతో పాటు విక్రయించిన ప్లాట్లలో ఎలాంటి అనుమతులు లేకుండానే అందమైన భవనాలు నిర్మించింది. పెద్ద ఎత్తున భవనాలు నిర్మిస్తున్న పంచాయతీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది. శిల్పా వెంచర్ యాజమాన్యానికి జిల్లా ఉన్నతాధికారులు సహకరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఫైనల్ డీటీసీపీ లేకుండా నిర్మాణాలు చేపట్టవద్దు. కానీ ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి ఇదేమి తెలియకుండానే భవన నిర్మాణాలు చేస్తే దీని పై కలెక్టర్ స్పందించి అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తే నష్టపోవడం ఖాయం. కానీ ప్లాట్ల యజమానులు నష్టపోకుండా ఉండేందుకు అనుమతులు తీసుకోవాలనే ఆలోచన శిల్పా వెంచర్ యాజమాన్యం చేయకపోగా మాకెందుకులే పోయేది ప్లాట్లు కొన్నవారే అనే దోరణి కనపడుతున్నది. శిల్పావెంచర్ లో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాల పై పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

శిల్పా వెంచర్‌కు ఫైనల్ డీటీసీపీ ఇవ్వలేదు.. డీటీసీపీ అధికారి అంభికా శ్రీ

శిల్పా వెంచర్ కు 2019లో శిల్పా వెంచర్ కు డీటీసీపీ తాత్కాలిక అనుమతులు మాత్రమే ఇచ్చామని, ఫైనల్ డీటీసీపీ అనుమతులు ఇవ్వలేదని సంగారెడ్డి డీటీసీపీ అధికారి అంభికా శ్రీ తెలిపారు. డీటీసీపీ పర్మిషన్ ఇచ్చిన తరువాత రోడ్లు, ఓపెన్ ప్లేస్ మార్టిగేజ్ గ్రామ పంచాయతీకి హ్యాండోవర్ చేయాలి. కానీ ఇప్పటి వరకు గ్రామ పంచాయతీకి హ్యాండోవర్ చేయలేదన్నారు. అనుమతులు లేకుండా భవనాలు నిర్మిస్తున్నారు. దానిని తొలగించాలని పంచాయతీ కార్యదర్శికి ఆదేశాలు ఇచ్చాం, కానీ పంచాయతీ కార్యదర్శి ఎందుకు చర్యలు తీసుకోలేదనే వివరాలు కోరుతాం. ఇంకా శిల్వా వెంచర్ కు ఫైనల్ డీటీసీపీ అనుమతులు ఇవ్వలేదు.. గ్రామ పంచాయతీకి నిబంధనల ప్రకారం మార్టగేజ్ చేస్తేనే ఫైనల్ పర్మిషన్ ఉంటుంది. వెంచర్ అనుమతి లేకుండా నిర్మిస్తున్న కట్టడాలు కూల్చివేయాలని పంచాయతీ కార్యదర్శికి సూచించాం. ఇక దీనిపై డీపీఓలు చర్యలు తీసుకోవాలి.

Next Story