అతడు స్టూడెంట్స్‌కు ‘వెన్ను’దన్ను!

by Shyam |
అతడు స్టూడెంట్స్‌కు ‘వెన్ను’దన్ను!
X

దిశ, వెబ్‌డెస్క్: స్కూల్ డేస్ అంటే ప్రతి ఒక్కరికీ ఇష్టమే. మరీ ముఖ్యంగా మిత్రులతో కలిసి చేసిన అల్లరి ఎప్పటికీ మరిచిపోలేం. స్కూల్ గురించి డిస్కషన్ వస్తే చాలు.. అందరం ఆనాటి అ‘పూర్వ’ జ్ఞాపకాల్లోకి తప్పక వెళ్తాం. అదే నోస్టాల్జియా. అయితే బాల్యం తిరిగిరానిది. నాటికి నేటికి పోల్చి చూస్తే చాలా మార్పులొచ్చాయి. నేడు విద్యార్థులకు బుక్స్ మోత(బ్యాగ్‌లు) మామూలుగా ఉండటం లేదు. కొన్నిటినీ మినహాయిస్తే చాలా పాఠశాలల్లో మౌలిక వసతులు అరకొరే. దీంతో లాస్ట్‌లో కూర్చున్న విద్యార్థి టీచర్లు చెప్పే పాఠాలపై సరిగా దృష్టి పెట్టలేడు. స్కూ్ల్ బ్యాగ్స్ పెట్టుకునేందుకు బెంచ్ (డెస్క్) ఉండదు. దాంతో బ్యాగ్, బుక్స్‌ను ఒడిలో లేదా కింద పెట్టుకుని వెన్నుముకను బెండ్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో వారికి బ్యాక్ పెయిన్‌తో పాటు ఇతరత్రా అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఈ విషయాలన్నిటినీ తన స్వగ్రామంలోని స్కూల్‌లో గమనించిన హిమాన్షు అనే స్టూడెంట్.. విద్యార్థులకు ఏదో ఒకటి చేయాలని అనుకున్నాడు. దాని కోసం ఆయన ఎక్కడి దాకా వెళ్లాడు? ఏం చేశాడు? విద్యార్థులకు ‘వెన్ను’దన్నుగా నిలిచేందుకు ఏ పరిష్కారం కనుగొన్నాడో? ఇక్కడ తెలుసుకుందాం..

నాగ్‌పూర్‌కి చెందిన హిమాన్షు మునేశ్వర్ ప్రొడక్ట్ డిజైన్ స్టూడెంట్. బెంగళూరులోని ఎన్ఐసీసీ ఇంటర్నేషనల్ కాలేజ్ ఆఫ్ డిజైన్‌ నుంచి గ్రాడ్యుయేట్. అందరిలా తాను మార్కెట్‌లో కొత్త డిజైన్ లాంచ్ చేసి వెంటనే పాపులరైపోయి డబ్బులు సంపాదించాలని అనుకోలేదు. తాను చిన్నపుడు స్కూల్‌లో గమనించిన విద్యార్థుల సమస్యను పరిష్కరించడం కోసం ఓ డిజైన్ చేయాలని భావించాడు. అదే తన ఫైనలియర్ ప్రాజెక్టుగా చేపట్టాడు. తను అనుకున్న డిజైన్.. విద్యార్థులకు బ్యాక్‌పెయిన్ (వెన్నుముక నొప్పి) కలగకుండా ఉండటంతో పాటు వారి బుక్స్ క్యారీ చేసే బ్యాగ్‌లా ఉండాలనుకున్నాడు. అది ఎకో ఫ్రెండ్లీ కావాలనుకున్నాడు. కాలేజీలో తనకు వచ్చిన జాబ్ ఆఫర్స్‌ కూడా వదులుకుని ఇదే ప్రాజెక్టు మీద వర్క్ ప్రారంభించాడు.

ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌, బల్లియా జిల్లాలోని నైన గ్రామానికి వెళ్లిన హిమాన్షు.. అక్కడ మూంజ్ అనే గడ్డితో బాస్కెట్‌లు(వెదురు ఉత్పత్తుల మాదిరి), ఇతర పర్యావరణహిత ఉత్పత్తులు తయారు చేసే స్థానిక కళాకారులను కలిశాడు. వారితో కలిసి పని చేసి ఉత్పత్తుల తయారీకి వారు వాడుతున్న టెక్నిక్స్ గురించి తెలుసుకున్నాడు. తన డిజైన్ వారికి వివరించిన హిమాన్షు.. బ్యాగు మూడు కిలోల వెయిట్ మోసేలా ఉండటంతో పాటు దాన్ని మోస్తున్నప్పుడు స్టూడెంట్స్ భుజాలు, వెన్నుముక మీద భారం పడకుండా ఉండేలా తయారు చేయాలని చెప్పాడు. బ్యాగ్ కింద భాగంలో రెండు పట్టీలు, పైభాగంలో వస్త్రం, వెదురు అల్లికల కింద రెండు లోహపు స్టాండ్‌లు ఉండాలన్నాడు. తద్వారా ఈ మెటల్ స్టాండ్ విద్యార్థులకు కావాల్సినప్పుడు డెస్క్‌గా మారుతుంది. వీటిని ఉపయోగించి(సపోర్ట్‌గా) విద్యార్థులు నోట్ బుక్స్ వాటిమీద పెట్టి రాసుకోవచ్చు. ఈ డిజైన్‌ ప్రకారం కళాకారులు స్టూడెంట్స్‌ను ఆకర్షించేలా రంగురంగుల నమూనాలతో కూడిన డిజైన్లు తయారు చేస్తున్నారు.

హిమాన్షు ఈ ప్రాజెక్టు ద్వారా రోజురోజుకూ ప్రాభవం కోల్పోతున్న స్థానిక కళాకారులకు జీవన ఉపాధి కల్పిస్తున్నాడు. ప్రస్తుతం ఐదో తరగతి విద్యార్థులను స్టడీ చేస్తున్న హిమాన్షు.. వారికి ఏ బ్యాగ్ ఏ సైజ్ పొడవు, వెడల్పు ఉంటే బాగుంటుందో? రాసుకున్నేప్పుడు సపోర్ట్‌ సాఫ్ట్‌గా ఉండాలా? అందుకు వెదురుతో పాటు వస్త్రాన్ని కూడా వాడాలా? వంటి విషయాలు తెలుసుకుంటున్నాడు. ఇందుకు సంబంధించిన ఫైనల్ ప్రొటోటైప్ తయారు చేస్తున్నాడు. ఇది కాగానే, పిల్లలకు ఈ బ్యాగులు అందించేందుకు హిమాన్షు సిద్ధమవుతున్నాడు. తాను చూసిన సమస్యకు పరిష్కారం కోసం ప్రయాణిస్తూ దాన్నే బిజినెస్ ఐడియాగా మలుచుకున్న హిమాన్షు యువతకు స్ఫూర్తిప్రదాత..

Advertisement

Next Story

Most Viewed