HIV - AIDS ని జ‌యించిన మొట్ట‌మొద‌టి మ‌హిళ ఈమెనే!

by Sumithra |   ( Updated:2022-03-30 12:25:35.0  )
HIV - AIDS ని జ‌యించిన మొట్ట‌మొద‌టి మ‌హిళ ఈమెనే!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః హ్యూమన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్ (HIV), 1980లల్లో ఉద్భ‌వించి, ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 36 మిలియన్ల మంది ప్రాణాలు బలిగొన్న మ‌హ‌మ్మారి. నివార‌ణ ఒక్క‌టే మార్గ‌మైన ఈ వ్యాధిని న‌యం చేసే క్ర‌మంలో ఇప్పుడు స‌రికొత్త విజ‌యాలు ఎదుర‌వుతున్నాయి. హెచ్‌ఐవితో జీవిస్తున్న 64 ఏళ్ల అమెరికన్ మహిళ చివరకు వైరస్ నుండి విముక్తి పొంద‌డం వైద్య ప్ర‌పంచంలో కొత్త ఆశ‌ల‌ను చిగురింపుజేశాయి. తాజాగా ఈ వ్యాధి నుంచి బ‌య‌ట‌డిన ఈ మ‌హిళ ప్ర‌పంచంలో హెచ్‌ఐవి న‌య‌మైన‌ మూడవ వ్యక్తిగా, అలాగే, వ్యాధి నుంచి పూర్తిగా బ‌య‌ట‌ప‌డిన‌ మొదటి మహిళగా రికార్డుల‌కెక్కింది. 2017లో హెచ్‌ఐవి చికిత్స పొందిన ఆమె ఇప్పటి వరకు వ్యాధి కార‌క వైర‌స్‌ తిరిగి వ‌చ్చిన సంకేతాలను చూడ‌లేదు. ఎయిడ్స్‌కు కారణమయ్యే వైరస్‌కు సహజ వ్యాధినిరోధక శక్తి ఉన్న దాత నుండి స్టెమ్ సెల్స్‌ను తీసుకొని ఈమెకు మార్పిడి చేయ‌డం వ‌ల్ల ఇది సాధ్య‌మ‌య్యింది.

డెన్వర్‌లో జరిగిన 'రెట్రోవైరస్‌లు, ఆప‌ర్చునిస్టిక్‌ ఇన్‌ఫెక్షన్‌'లపై జరిగిన కాన్ఫరెన్స్‌లో ఈ మహిళ కేసును వెల్ల‌డించారు. అలాగే, బొడ్డు తాడు రక్తంతో కూడిన చికిత్సను మొదటిసారిగా ఈ కేసులో ఉపయోగించినట్లు పేర్కొన్నారు. ఇది సరికొత్త విధానం అని, దీని విజయం సానుకూల సంకేతమ‌ని వారు అన్నారు. భ‌విష్య‌త్తులో ఈ చికిత్సను విస్తృత జనాభాకు అందుబాటులో ఉంచవచ్చని చెప్పారు. అయితే, ఇది ఇప్పుడ‌ప్పుడే సాధ్యం కాక‌పోవ‌చ్చ‌ని అంతర్జాతీయ ఎయిడ్స్ సొసైటీ అధ్యక్షుడిగా ఎన్నికైన ప్రొఫెసర్ షారన్ లెవిన్ అన్నారు. ది టెలిగ్రాఫ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, అధిక ఆదాయ దేశాలలో విస్తృత స్థాయి నివారణకు ప్రపంచం ఇంకా చాలా సంవత్సరాల దూరంలో ఉందని లెవిన్ చెప్పారు. అందువల్ల, అభివృద్ధి చెందుతున్న దేశాలలో వైద్యం అందుబాటులోకి రావడానికి మ‌రింత‌ ఎక్కువ సమయం పట్టవచ్చ‌ని, నిర్దిష్ట కాలపరిమితి లేనప్పటికీ, హెచ్‌ఐవి నివారణకు కనీసం 10 నుండి 20 సంవత్సరాల కాలం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed