ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేసిన హెచ్‌డీఎఫ్‌సీ బీమా సంస్థ

by Harish |
hdfc
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రముఖ బీమా కంపెనీ ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్‌ను మరో బీమా సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసింది. ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్‌కు చెందిన వంద శాతం వాటాను రూ. 6,687 కోట్లకు కొనుగోలు చేసినట్టు శుక్రవారం కంపెనీ వెల్లడించింది. ఈ ఒప్పందం జీవిత బీమా రంగంలో మొదటి, అతిపెద్దదని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. గతంలో హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ సంస్థ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్‌ను దక్కించుకోవాలని ప్రయత్నం చేసింది. అయితే, నియంత్రణ పరమైన అడ్డంకుల కారణంగా ఆ ఒప్పందం రద్దైంది. అయితే, ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్‌ను కొనేందుకు ఎలాంటి నియంత్రణా అడ్డంకులు ఉండే అవకాశాలు లేవని నిపుణులు అభిప్రాయపడ్డారు. మొత్తం 8.70 కోట్ల షేర్లను ఒక్కోటి రూ. 685కి కొనుగోలు చేసినట్టు తెలిపింది.

అలాగే, మిగిలిన రూ. 762 కోట్లను నగదు రూపంలో చెల్లించామని కంపెనీ వివరించింది. ఈ ఒప్పందానికి సంబంధించి సెబీ, ఎన్‌సీఎల్‌టీ లాంటి నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు ఇంకా రాలేదు. ఈ సందర్భంగా మాట్లాడిన హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్ ఛైర్మన్ దీపక్ పరేఖ్.. దేశీయ బీమా చరిత్రలో ఇదొక కీలక మైలురాయిగా భావిస్తున్నాం. భారత్‌లోని మరింత మందికి ఆర్థిక భద్రతను కల్పించడానికి ఈ కొనుగోలు ఒప్పందం తమకెంతో ఉపయోగపడుతుందన్నారు. కాగా, ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్ దక్షిణ భారతదేశంలో టైర్2,టైర్3 పట్టణాల్లో మెరుగైన మార్కెట్ కలిగి ఉంది. ఈ రంగంలోని ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ ప్రకారం..ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఈ ఏడాది జూన్ 30 నాటికి రూ. 2,711 కోట్ల విలువను కలిగి ఉంది.

Advertisement

Next Story

Most Viewed