కొవిడ్ బాధితులకు అండగా నేనున్నా … ‘దిశ’తో హరీశ్‌రావు ముఖాముఖి

by Anukaran |   ( Updated:2021-05-23 08:11:07.0  )
కొవిడ్ బాధితులకు అండగా నేనున్నా … ‘దిశ’తో హరీశ్‌రావు ముఖాముఖి
X

దిశ ప్రతినిధి, మెదక్ : కరోనా వ్యాధి నివారణకు సరైన వైద్యం లేదు. మాస్కులు ధరించడం, చేతులను శానిటైజ్ చేసుకోవడం, వ్యక్తిగత శుభ్రత, పరిసరాల శుభ్రత పాటించడం, గుంపుగుంపులుగా కాకుండా భౌతిక దూరం పాటించడం లాంటి చర్యలు ద్వారా కరోనాని నియంత్రించవచ్చు. ఒకవేళ కొవిడ్ బారినపడితే వెంటనే హోం ఐసోలేషన్ అయ్యి, ధైర్యంగా ఉండాలి. మనోధైర్యమే రోగికి సగం బలం చేకూర్చుతుంది. కరోనా కట్టడికి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుంది. కొవిడ్ బాధితులకు కొండంత అండగా వుంటూ కరోనా కట్టడికి కృషి చేస్తున్నారు ఆర్థిక మంత్రి హరీశ్ రావు. జిల్లాలో లాక్‌డౌన్, ఫీవర్ సర్వే లతో సత్ఫలితాలు వస్తున్నాయి. మొన్నటి వరకు పెరిగిన కరోనా కేసులు నేడు తగ్గుముఖం పట్టాయి. త్వరలోనే కరోనా రహిత జిల్లాగా సిద్దిపేట నిల్వనుంది. సిద్దిపేట జిల్లాలో కొవిడ్ నియంత్రణకు నిరంతరం కృషి చేస్తున్న ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్ రావుతో ‘దిశ’ ప్రతినిధి ముఖాముఖి…

దిశ : నమస్కారం సార్, బాగున్నారా ?
మంత్రి : నమస్కారం శ్రీరామ్, బాగున్నాను.

దిశ : కరోనా కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
మంత్రి : కరోనా నియంత్రణకు సరైన వైద్యం లేదు. కొవిడ్ బారినపడిన వారికి మనోధైర్యం కల్పిస్తున్నాం. ఆ గ్రామాల్లో, పట్టణాల్లో సంబంధిత ఆశావర్కర్లు రోజుకు రెండు సార్లు పేషెంట్ వద్దకు వెళ్లి ఆరోగ్య స్థితిని తెలుసుకుంటున్నారు. ప్రతి వారం, పది రోజులకొకసారి గ్రామాలను, పట్టణాలను శానిటైజ్ చేస్తున్నాం. పోలీసులు, అధికారులు ఎప్పటికప్పుటు కొవిడ్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

దిశ : కొవిడ్ రోగులకు జిల్లా ఆస్పత్రిలో ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తున్నారు ?
మంత్రి : సిద్దిపేట జిల్లా ఆస్పత్రిలో కొవిడ్ రోగులకు కార్పొరేట్ తరహా వైద్యం అందిస్తున్నాం. కరోనా సోకి శ్వాస ఇబ్బందులతో బాధపడుతున్న రోగులందరూ సిద్దిపేట జిల్లా ఆస్పత్రి వైపు చూస్తున్నారు. వారి కోసం ఆక్సిజన్ బెడ్స్, వెంటిలేటర్లు ఏర్పాటు చేశాం. ప్రతి రోగి పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరిచేలా చర్యలు చేపట్టాం. చాలా మంది జిల్లా ఆస్పత్రిలో ట్రీట్మెంట్ పొంది డిశ్చార్జ్ అవుతున్నారు.

దిశ : జిల్లా ఆస్పత్రిలో ఎన్ని ఆక్సిజన్, వెంటిలేటర్ బెడ్స్ ఉన్నాయి ?
మంత్రి : జిల్లా ఆస్పత్రిలో 30 ఐసీయూ బెడ్స్, 200 కు పైగా ఆక్సిజన్ బెడ్స్, 100 వెంటిలేషన్ బెడ్స్ ఉండగా.. వాటికి అదనంగా మరో రెండు కొవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేశాం. ఆస్పత్రి పక్కనే ఉన్న నిరాశ్రయుల వసతి గృహం, బాబు జగ్జీవన్‌రామ్ భవన్లో మరో 70 ఐసోలేషన్ బెడ్స్ ఏర్పాటు చేశాం. అవసరమైతే మరిన్ని బెడ్స్ ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం.

దిశ : కొవిడ్ రోగులకు ఎలాంటి భోజనం అందిస్తున్నారు ?
మంత్రి : కొవిడ్ బారిన పడిన వారికి నాణ్యమైన భోజనం అందిస్తేనే వారు చికిత్సకు అనుకూలిస్తారు. కొవిడ్ బారినపడి జిల్లా ఆస్పత్రికి వచ్చేది చాలా మంది నిరుపేదలే కాబట్టి వారికి ఈ సమయంలో భోజనం అందించాలని నిర్ణయించాం. ప్రతి రోజు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, గుడ్డు, సాయంత్రం డ్రై ఫ్రూట్స్, పండ్లు, రాత్రి భోజనం, గుడ్డు అందిస్తున్నాం. ప్రతి రోజు దాదాపు 200 మందికి పైగా పేషంటు నాణ్యమైన ఆహారం అందిస్తూ ప్రభుత్వ ఆస్పత్రి అంటే ఒక నమ్మకం, మనోధైర్యం కల్పిస్తున్నాం.

దిశ : జిల్లా ఆస్పత్రి సమాచారం ఎలా తెలుసుకుంటున్నారు ?
మంత్రి : సిద్దిపేట కొవిడ్ వార్డు ఆస్పత్రిలో సిబ్బంది పనితీరు, కరోనా బాధితులకు అందిస్తున్న వైద్య సేవలను తెలుసుకునేందుకు ఆస్పత్రి సిబ్బందితో ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశాను. అందులో ఆస్పత్రి సిబ్బంది తనకు ఎప్పటికప్పుడు వారు అందిస్తున్న వైద్యం తీరు, ఆస్పత్రి శుభ్రత, తదితర అంశాలపై ఫోటోలు తీసి తనకు పంపిస్తారు. ఎక్కడైనా ఇబ్బంది కలిగిందని సమాచారం అందిన వెంటనే ఆ సమస్య పరిష్కరానికి కృషి చేస్తున్నా.

దిశ : ప్రైవేటు ఆసుపత్రిలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారనే ఆరోపణ ఉంది, వారితో ఏమైనా మాట్లాడారా ?
మంత్రి : సిద్దిపేట జిల్లానే కాదు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యాలతో మాట్లాడాను. కరోనా సోకిన పేషంట్ల వద్ద అధిక ఫీజులు వసూలు చేయడం సరికాదని చెప్పాను. సిటీ స్కాన్ డబ్బులు రూ.5,500 ఉండగా రూ .2,500లకు ఒప్పించాను. ప్రస్తుతం అన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో రూ .2,500 మాత్రమే తీసుకుంటున్నారు. దీనికి ప్రజల నుండి మంచి స్పందన వచ్చింది. ఇది చాలా సంతోషంగా అన్పించింది.

దిశ : హోం ఐసోలేషన్లో ఉన్న వారికి ఎలాంటి వైద్యం అందుతుంది ?
మంత్రి : కొవిడ్ బారిన పడిన వంద మందిలో 95 మంది ఇంటి వద్దనే హోం ఐసోలేషన్లో ఉంటూ క్యూర్ అవుతున్నారు. ఇది శుభ పరిణామం. హోం ఐసోలేషన్ లో ఉన్న వారిని సంబంధిత గ్రామాల ఆశా వర్కర్లు వారి ఇంటికి వెళ్తూ వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు ఎలా ఉండాలనే అంశాలపై సూచనలు, సలహాలు ఇస్తున్నారు. నా వంతుగా హోం ఐసోలేషన్లో ఉన్న వారికి రూ. 3 వేల విలువ చేసే మెడికల్ కిట్ అందిస్తున్న. ఇందులో పల్స్ ఆక్సీమీటర్, డిజిటల్ థర్మామీటర్, ఎన్ 95, సర్జికల్ మాస్కులతో పాటు పలు రకాల మందులు ఉంటున్నాయి. సిద్దిపేట నియోజక వర్గంలోని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నాయకుల ద్వారా ఈ కిట్లను బాధితులకు అందిస్తున్నాం. కిట్ల పంపిణీ దుర్వినియోగం కాకుండా ఉండేందుకు పాజిటీవ్ వచ్చిన వ్యక్తి రిపోర్టు, ఆధార్ కార్డు జిరాక్సులను తీసుకుంటున్నారు.

దిశ : ఈ మధ్య గర్భిణీ స్త్రీలు కూడా కరోనా బారిన పడుతున్నారు, వారి కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ?
మంత్రి : అవును, నిజమే. ఈ మధ్య గర్భిణీ స్త్రీలు కొవిడ్ బారినపడుతున్న విషయం వాస్తవమే. రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ కిట్ అందించడంతో పాటు ఆడ బిడ్డ పుడితే రూ.13 వేలు, మగ బిడ్డ జన్మిస్తే రూ.12 వేలు అందిస్తుండటంతో చాలా మంది సర్కారు దవాఖానాలోనే డెలివరీ అవుతున్నారు. అయితే ప్రస్తుతం కరోనా కారణంగా సిద్దిపేట జిల్లా ఆస్పత్రిలో సాధారణ గర్భిణీ స్త్రీలకు చికిత్స అందించడం లేదు. గజ్వేల్ ఆస్పత్రిలో డెలివరీలు చేస్తున్నాం. కొవిడ్ బారినపడిన గర్బిణీ స్త్రీల కోసం మాత్రం సిద్దిపేట జిల్లా ఆస్పత్రిలో ప్రత్యేక కొవిడ్ వార్డు ఏర్పాటు చేసి అందులోనే చికిత్స అందిస్తున్నాం. ప్రస్తుతం వారంత క్షేమంగా ఉన్నారు.

దిశ : ఆక్సిజన్ కొరత ఏమైనా ఉందా ?
మంత్రి : సిద్దిపేట జిల్లాలో కొవిడ్ రోగులకు కావాల్సినంత ఆక్సిజన్, రెమిడెసివర్ ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయి. జిల్లా ప్రజలు చాలా చైతన్య వంతులు, వ్యాక్సినేషన్లోనూ సిద్దిపేట జిల్లా ముందంజలో ఉంది.

దిశ : ఫీవర్ సర్వే సత్ఫలితాలనిస్తుందా ?
మంత్రి : ఖచ్చితంగా కేసీఆర్ ముందు చూపుతో ప్రవేశపెట్టిన ఇంటింటా ఫీవర్ సర్వే మంచి ఫలితాలనిస్తుంది. ఫీవర్ సర్వే కారణంగా కరోనా లక్షణాలు ఉన్న వారికి గుర్తించి వెంటనే వారికి కరోనా కిట్ అందిస్తున్నాం. ఫలితంగా జిల్లాలో చాలా కేసులు తగ్గుముఖం పట్టాయి.

దిశ : ప్రతిపక్షాల విమర్శలకు ఏం సమాధానం చెబుతారు ?
మంత్రి : ప్రతిపక్షాలు విమర్శలు చేయాలి కాబట్టి చేస్తున్నారు తప్పా, వారి విమర్శలలో నిజం లేదు. అయినా ప్రతిపక్షాల విమర్శలకు సమాధానమిచ్చే సమయం నా దగ్గర లేదు. వారికి నా పనితనం ద్వారానే సమాధానం చెబుతున్నాను. ఒకట్రెండు చోట్ల జరిగిన తప్పులను భూతద్దంలో చూపుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఇది చాలా పెద్ద తప్పు. వారికి మనం మనోధైర్యాన్ని కల్పించాల్సిన సమయం.

దిశ : కరోనా రహిత జిల్లాగా మారేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ?
మంత్రి : అతి త్వరలోనే కరోనా రహిత జిల్లాగా సిద్దిపేట మారనుంది. ఇందుకోసం ప్రతి జిల్లా అధికారి, మండల అధికారి, గ్రామ స్థాయి ప్రజాప్రతినిధుల మొదలు ఎంపీ, ఎమ్మెల్యే, జిల్లా మంత్రిగా తాను, ఇతరులు, వైద్య సిబ్బంది చాలా కృషి చేస్తున్నారు. పోలీసులు లాక్‌డౌన్ అమలును పకడ్బందీగా చేపడుతున్నారు. జిల్లా ప్రజల్లోనూ చైతన్యం వచ్చింది. బయటకు వెళ్లే సమయంలో మాస్కు ధరిస్తున్నారు. భౌతిక దూరం పాటిస్తున్నారు. వారి భాగస్వామ్యంతో త్వరలోనే కరోనా రహిత జిల్లాగా మారుస్తాం .

Advertisement

Next Story

Most Viewed