టీకా కేంద్రంలో హరీష్ రావు ఆకస్మిక తనిఖీ.. సీరియస్ వార్నింగ్

by Shyam |
టీకా కేంద్రంలో హరీష్ రావు ఆకస్మిక తనిఖీ.. సీరియస్ వార్నింగ్
X

దిశ, సిద్దిపేట : తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో నంగునూరు మండలం రాజగోపాల్ పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన కరోనా టీకా కేంద్రాన్ని ఈరోజు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఆకస్మిక తనిఖీ చేశారు. టీకా కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు రావడంతో వారిని పలకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉదయమే టీకా కేంద్రానికి వచ్చినా ఇప్పటి వరకు తమకు టీకా వేయలేదని వారు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీంతో అధికారులు, సిబ్బందిపై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, వ్యాక్సినేషన్ నమోదు ప్రక్రియను పరిశీలించి పేర్ల నమోదుకు చాలా సమయం పడుతుందని వైద్య సిబ్బంది మంత్రికి తెలిపారు.

పంచాయతీ సిబ్బంది ఎక్కడ‌‌..

కోవిడ్ టీకా కేంద్రాలకు ఇంత మంది వచ్చినా పంచాయతీ సిబ్బంది ఎక్కడున్నారని మంత్రి మండిపడ్డారు. పంచాయతీ సిబ్బంది, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో టీకా కేంద్రాల్లో సమస్యలు ఏర్పడుతున్నాయని హరీష్ ఫైర్ అయ్యారు.

ఎక్కువ సిబ్బందిని నియమించాలి.. జిల్లా కలెక్టర్‌కు ఆదేశం

కరోనా టీకా కేంద్రాల్లో ఎక్కువ మంది సిబ్బందిని నియమించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ వెంకట్ రామ్ రెడ్డిని ఫోన్ ద్వారా మంత్రి ఆదేశించారు. ఇక్కడి కరోనా టీకా కేంద్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ బాగుందని తక్కువ స్థాయిలో సిబ్బంది ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. జిల్లావ్యాప్తంగా ఎంపీడీవోలు, ఎంపీఈఓలు, పంచాయతీ కార్యదర్శులు, ఆశా కార్యకర్తలకు టీకా కేంద్రాల వద్ద డ్యూటీలు వేయాలని కలెక్టర్‌కు సూచించారు. అలాగే ప్రతీ కేంద్రం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు.

కరోనా టీకా కేంద్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకోవడానికే తాము ఆకస్మిక తనిఖీలు చేస్తున్నామని మంత్రి చెప్పారు. కేంద్రాల్లో లోటుపాట్లను గుర్తించి సమస్యలను పరిష్కరించాలని సంబంధిత శాఖ అధికారులకు ఆదేశించడం జరిగింది అని పేర్కొన్నారు. కరోనా వ్యాధి తీవ్రత రోజురోజుకు పెరుగుతున్నందున ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు.

Advertisement

Next Story