‘వ్యాక్సిన్‌ ఉచితంగా ఇవ్వండి’

by Anukaran |   ( Updated:2021-01-18 11:15:05.0  )
‘వ్యాక్సిన్‌ ఉచితంగా ఇవ్వండి’
X

దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా వ్యాక్సిన్‌ను అర్హులైన వారందరికీ ఉచితంగా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కరోనా వ్యాక్సిన్ ‘అందరికీ ఉచితం’ అని ప్రకటించినట్లుగానే తెలంగాణకు కూడా ఉచితంగానే అందజేయాలని కోరారు. పదిహేనవ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రాష్ట్రాలకు విడుదల కావాల్సిన పన్నుల వాటా సకాలంలో అందడం లేదని, కరోనా కాలంలో తెలంగాణకు సుమారు రూ.723 కోట్ల మేర నష్టం ఏర్పడిందని, వెంటనే దీన్ని విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం సర్‌ఛార్జి, సెస్‌ల రూపంలో పన్నులు వసూలు చేస్తోందని, ఇదంతా కేంద్రానికి పోతుండడం వల్ల రాష్ట్రాలకు నష్టం వాటిల్లుతోందని, వాటిని రద్దు చేసి రాష్ట్రాలకు పన్ను వాటాను పెంచి విడుదల చేయాలని కోరారు. ఢిల్లీ నుంచి కేంద్ర ఆర్థిక మంత్రి సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో హరీశ్‌రావు పలు ప్రతిపాదనలు చేశారు.

ఆర్థిక‌ సంఘం సిఫార్సు చేసిన గ్రాంట్లను కేంద్ర బడ్జెట్‌లోనే పొందుపరిచి సంపూర్ణంగా అమలు‌ చేయడం సంప్రదాయమని, కానీ ఇందులో కొన్నింటిని కేంద్రం ఇప్పటికీ అంగీకరించలేదని హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఆర్థిక సంఘం గ్రాంట్లపై చేసిన సిఫారసులను కేంద్ర ప్రభుత్వం యథాతథంగా ప్రతీ ఏడాది అమలు చేయాలని కోరారు. రానున్న బడ్జెట్ నుంచే దీన్ని కొనసాగించాలని కోరారు. కరోనా కారణంగా అన్ని రాష్ట్రాలకు జీఎస్డీపీలో 2 ‌శాతం మేర అదనంగా రుణాలు తీసుకునే వెసులుబాటును కేంద్ర ప్రభుత్వం కల్పించిందని, రాష్ట్రాల్లో పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్‌ను ప్రోత్సహించాల్సి ఉన్నందున ఈ వెసులుబాటును 2021-22 సంవత్సరానికి కూడా ఎలాంటి షరతులు ‌లేకుండా కొనసాగించాలని కోరారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న విధంగా రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం ఆర్థిక సాయం అందించాల్సి ఉందని, గతేడాది విడుదల చేయలేదని, ఈ సంవత్సరానికి కూడా కలిపి మొత్తం రూ.900 కోట్ల బకాయిలను తక్షణం విడుదల చేయాలని కోరారు.

మహిళా సంఘాలకు ఇస్తోన్న వడ్డీ రాయితీ పథకం యాభై శాతం జిల్లాలకు మాత్రమే కేంద్రం వర్తింపజేస్తోందని, గత బడ్జెట్ ప్రసంగంలో అన్ని జిల్లాలకూ ఈ రాయితీని విస్తరించనున్నట్లు హామీ ఇచ్చినా ఇప్పటికీ అమలు కాలేదన్నారు. అన్ని జిల్లాల్లో అమలు చేయాలని, బకాయిల మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలని కోరారు. దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులకు కేంద్రం ఎన్నో ఏళ్లుగా ఎన్ఎస్ఏపీ (నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్) పథకం కింద కేవలం రూ.200 సాయాన్ని మాత్రమే అందిస్తోందని, దీన్ని కనీసం రూ.వెయ్యికి పెంచాలని కోరారు. రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ పరిహారాన్ని సత్వరమే విడుదల‌ చేయాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed