మున్సిపల్ మినిస్టర్ చెప్పారని నిధులు మళ్లించారు..!

by Anukaran |   ( Updated:2021-03-26 12:04:41.0  )
Warangal
X

దిశ‌, వ‌రంగ‌ల్ తూర్పు: బాస్ చెప్పాడ‌ని ముందూ వెనుకా ఆలోచించ‌లేదు.. నిబంద‌న‌లు పాటిస్తున్నామా? లేదా? అన్న మా‌ట మ‌రిచారు. ప్రతిప‌క్షాలు వ్యతిరేకించినా డోంట్ కేర్ ఆన్నారు. కౌన్సిల్‌లో సంఖ్యా‌ బ‌లం ఉంది క‌దా అని.. త‌మ‌కు అనుకూలంగా తీర్మాణం పాస్ చేయించుకున్నారు. సుమారు ఎనిమిది లక్షల ప‌ట్టణ జ‌నాభా నుంచి ప‌‌న్నుల రూపంలో వ‌సూలు చేసిన రూ.9.50 కోట్లను దారి మ‌ళ్లించారు. అభివృద్ధికి కేటాయించాల్సిన ఈ నిధుల‌ను కొంత‌మందికి అప్పనంగా అందించి వ‌రంగ‌ల్ మ‌హా న‌గ‌ర‌పాల‌క సంస్థ విమర్శలను తెచ్చిపెట్టుకుంది.

నిబంధ‌న‌ల‌కు పాత‌ర‌..

మున్సిప‌ల్ చ‌ట్టం ప్రకారం స్థానికంగా ప‌న్నుల రూపంలో వ‌చ్చే నిధుల‌(జ‌న‌ర‌ల్ ఫండ్‌)ను అక్కడి అభివృద్దికే వినియోగించుకోవాలి. కానీ, వ‌రంగ‌ల్ మ‌హా న‌గ‌ర‌పాల‌క సంస్థ అందుకు భిన్నంగా వ్యవ‌హ‌రించింది. రూ.9.50కోట్ల జ‌న‌ర‌ల్ ఫండ్ నిధుల‌ను దారిమ‌ళ్లించారు. అభివృద్ధిని మ‌రిచి కొంత‌మందికి ప్రయోజనం చేకూర్చేలా ప‌రిహారం చెల్లించేందుకు వినియోగించారు. బట్టల బ‌జార్‌లో నూత‌నంగా ఏర్పాటు చేసిన ఆర్వోబీని ఆనుకుని ఉన్న 83మంది దుకాణదారుల‌కు ప‌రిహారంగా ఈ మొత్తాన్ని చెల్లించడం గమనార్హం.

కౌన్సిల్‌లోనే వ్యతిరేకించిన ప్రతిపక్షాలు

ప్రజల నుంచి ప‌న్నుల రూపంలో వ‌సూలు చేసిన జ‌న‌ర‌ల్ ఫండ్‌ను దారి మళ్లించడాన్ని కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు ఎంబాడి ర‌వీంద‌ర్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది నిబంద‌న‌ల‌కు వ్యతిరేకమని గట్టిగా వాదించారు. నష్ట పరిహారం చెల్లించాల్సి వ‌స్తే ప్రభుత్వం ప్ర్యత్యేకంగా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఆయనకు మరికొంత మంది ప్రతిపక్ష నేతలు అండగా నిలిచిన ప్రయోజనం లేకుండా పోయింది. సంఖ్యాబ‌లం ఉన్న అధికార ప‌క్షం వీటి‌ని ప‌ట్టించుకోలేదు. త‌మ‌కు అనుకూలంగా తీర్మాణం పాస్ చేయించుకున్నారు. ఎలాంటి ఆల‌స్యం చేయ‌కుండా స‌మావేశం ఏర్పాటు చేసి చెక్కుల రూపంలో ప‌రిహారం అందించారు.

బాస్ చెప్పాడ‌ని..

కాగా, మున్సిపల్ మినిస్టర్ ఆదేశాల‌తోనే జ‌న‌ర‌ల్ ఫండ్ నిధుల‌ను దారి మ‌ళ్లించిన‌ట్లు బల్దియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మంత్రి‌తో స్నేహపూర్వకంగా తిరిగే కొంత‌మంది ప్రజా ప్రతినిధులు బట్టల వ‌ర్తకులకు అండ‌గా నిలిచి ఈ త‌తంగం అంతా న‌డిపించిన‌ట్లు గుస‌గుస‌లాడుకుంటున్నారు. ప‌రిహారం చెల్లించేందుకు ప్రత్యేకంగా నిధులు లేనందున జ‌న‌ర‌ల్ ఫండ్ నిధుల‌నే ప్రస్తుతం వినియోగించుకోండంటూ మంత్రి మౌఖికంగా ఆదేశం జారీ చేసిన‌ట్లు తెలుస్తోంది. దీంతో బాస్ చెప్పగానే ముందూ.. వెనుకా ఆలోచించ‌కుండా ప‌రిహారం చెల్లించిన‌ట్లు ఆరోప‌ణలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed