- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏజెన్సీలో గుప్పుమన్న గుట్కా దందా.. ‘నిఘా’ నేత్రాలు కళ్లుగప్పి..!
దిశ, వాజేడు : ఏజెన్సీ ప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా గుట్కా వ్యాపారం సాగిస్తూ రూ.కోట్లు గడిస్తున్నారు కొందరు అక్రమార్కులు. చిల్లర దుకాణాలతో మొదలుకొని పెద్ద పెద్ద కిరాణా షాపుల్లోనూ గుట్కాలను విక్రయిస్తూ ప్రభుత్వ నిబంధనలు బేఖాతరు చేస్తున్నారు. బడాబాబులు, అధికారుల అండతో యథేచ్ఛగా గుట్కా దందా కొనసాగుతోంది. కొందరు అధికారులు కాసులకు కక్కుర్తి పడి గుట్కా వ్యాపారులతో చీకటి ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. దీంతో అక్రమార్కుల చీకటి దందాకు అడ్డు అదుపులేకుండా పోయింది.
మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన ములుగు జిల్లా ఏటూరు నాగారం వెంకటాపురం సర్కిల్ పరిధిలో గల వాజేడు, వెంకటాపురం, నాగారం, కన్నాయిగూడెం తదితర మండలాల్లోని గిరిజన పల్లెల్లో గుట్కా వ్యాపారం జోరుగా సాగుతోంది. వ్యాపారానికి అనువుగా ఉన్న గ్రామాలైన కన్నాయిగూడెం, ఏటూరునాగారం, వాజేడు, ధర్మవరం చెరుకూరు, చందుపట్ల, జలపల్లి, ఆలుబాకా అనువైన తదితర గ్రామాలకు కొందరు గుట్కాలను సరఫరా చేస్తున్నారు. దీంతో వారి వ్యాపారం మూడుపువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. వెంకటాపురం మండలానికి చెందిన ఓ బడా వ్యాపారి గుట్టుగా ఈ దందా సాగిస్తున్నట్లు సమాచారం.
నిషేధిత గుట్కా ప్యాకెట్లను అమ్మరాదనే నిబంధన ఉన్నప్పటికీ ప్రభుత్వ నిబంధనలకు పాతరేసి అడ్డదారిలో అక్రమ వ్యాపారం కొనసాగిస్తున్నారు. ఇంత జరుగుతున్నా నిఘా విభాగాలు చడిచప్పుడు లేకుండా ఉండిపోయాయి. అధికారులకు, రాజకీయనాయకులకు ముడుపులు ముట్టజెప్పి ఆ బడా వ్యాపారి చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తోంది. కాసులకు అధికారులు ఆశపడటంతో ఏజెన్సీ ప్రాంతాల్లో గుట్కా గుప్పుమంటోంది. సాధారణ ప్రజల ఆరోగ్యాలు చెడిపోతున్నా పట్టించుకోకుండా వ్యాపారులు మాత్రం కోట్లకు పడగలెత్తుతున్నారు.
గుట్కా వ్యాపారం జరిగేది ఇలా..
తెలంగాణ సరిహద్దు ప్రాంతం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని మద్దెడు భూపాలపట్నం ప్రాంతాల నుండి అర్ధరాత్రి వేళ ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలానికి లక్షల విలువచేసే గుట్కా ప్యాకెట్లు రవాణా అవుతున్నాయి. మరల అక్కడి నుండి వాజేడు ఏటూరు నాగారం, కన్నాయిగూడెం తదితర మండలాల్లోని గిరిజన గ్రామాలకు సరఫరా చేస్తున్నారు అక్రమార్కులు. చిరు దుకాణాలు మొదలుకొని పెద్ద పెద్ద కిరాణా షాపులకు నిషేధిత గుట్కా ప్యాకెట్లను విక్రయిస్తున్నారు. పది రూపాయల విలువచేసే గుట్కా ప్యాకెట్లను 30 నుండి 50 రూపాయల విలువ కట్టి విక్రయిస్తున్నారు. నిషేధిత గుట్కా విక్రయాలపై నిఘా పెట్టిన ఏటూరునాగారం ఏఎస్పి ఆలం గౌస్ అప్పట్లో లక్షల విలువచేసే గుట్కా ప్యాకెట్లను చెరుకూరు ప్రాంతంలో పట్టుకున్నారు. అప్పట్లో కొద్దిరోజులు సద్దుమణిగిన గుట్కా వ్యాపారం నేడు ఏజెన్సీ ప్రాంతంపై మళ్లీ పంజా విసురుతోంది. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికులు చెబుతున్నారు.
మత్తుకు బానిస అవుతున్న యువత..
నిషేధిత గుట్కా ప్యాకెట్లు ఏజెన్సీ మండలాల్లోని గిరిజన గ్రామాల్లో పుష్కలంగా లభించడంతో యువత మత్తుకు బానిస గా మారుతున్నారు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఆ గుట్కా ప్యాకెట్లను తింటూ ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటున్నారు క్యాన్సర్ వ్యాధులకు గురై కొందరు మృత్యువాత పడుతున్నారు ఒకవైపు ఆర్థికంగా చితికి పోవడం మరోవైపు ప్రాణాలను కోల్పోతున్నారు.