- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అష్టకష్టాల్లో గ్రేటర్ ఆర్టీసీ
దిశ, తెలంగాణ బ్యూరో: ‘జీడిమెట్ల డిపోకు చెందిన బస్ ఎనిమిది గంటలలో దాదాపు మూడు ట్రిప్పులు వేస్తుంది. రోజుకు కనీసం 56 కిలోమీటర్లు తిరుగుతుంది. లాక్ డౌన్ కు ముందు ట్రిప్పుకు రూ. 1100 నుంచి రూ. 1400 వచ్చేవి. లాక్డౌన్ తర్వాత మూడు ట్రిప్పులు నడిపితే రూ. 1200 కూడా రావడం లేదు. అంటే కనీసం డీజిల్ ఖర్చు కూడా రావడం లేదు. వాస్తవంగా డీజిల్ ఖర్చు, నిర్వహణకు రూ. 2500 వరకు ఉండాల్సిందే. కనీసం రూ. మూడు వేల ఆదాయం వస్తే బెటర్. సగం కూడా రావడం లేదు’ ఇది ఆర్టీసీ అధికారుల నివేదిక. ఇది ఒక్క డిపోకే చెందిన అంశం కాదు. గ్రేటర్ పరిధిలోని 29 డిపోలలో ఇదే పరిస్థితి. ప్రస్తుతం గ్రేటర్ లో ఆర్టీసీ అష్టకష్టాలు పడుతోంది. ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది. ప్రస్తుతానికి 75 శాతం బస్సులు అంటే 2 వేలకు పైగా బస్సులను గ్రేటర్‌లో తిప్పుతున్నారు. లాక్డౌన్కు ముందు ప్రతిరోజూ గ్రేటర్‌లో రూ. మూడు కోట్ల ఆదాయం దాటేది. ఇప్పుడు రూ. రెండు కోట్లకూ చేరడం లేదు.
పాత బస్సులతో ఇక్కట్లు
ప్రైవేట్ వాహనాల పోటీతో గ్రేటర్ ఆర్టీసీ కుదేలవుతోంది. ప్రభుత్వం సహకారం అందిస్తే తప్ప నగరంలో కొత్త బస్సులు అందుబాటులోకి తెచ్చే అవకాశాలు కనిపించడం లేదు. బస్సుల సంఖ్య పెరిగితే ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశాలున్నా ఆర్టీసీ ఆ వైపుగా దృష్టిసారించడం లేదనే విమర్శలున్నాయి. ప్రయాణికులతో నిత్యం రద్దీగా ఉండే ఎంజీబీఎస్, జేబీఎస్లో దుకాణాలు ఖాళీగా ఉంటున్నా వాటిని పట్టించుకోవడం లేదు. 2015-16లో రూ. 238 కోట్లు, 2016-17లో రూ.423 కోట్లు, 2017-18లో రూ.426 కోట్లు, 2019–20లో రూ. 400 కోట్ల నష్టాలు మూటగట్టుకోవడంతో గ్రేటర్ ఆర్టీసీ పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. నాలుగేండ్లు గ్రేటర్‌లో నష్టాలు పెరుగుతున్నా వాటిని తగ్గించడంలో ఉన్నతాధికారులు విఫలమవుతున్నారు.
పెరగని బస్సులు
శివారు ప్రాంతాలలో వందల సంఖ్యలో కొత్తకాలనీలు, బస్తీలు ఏర్పాటయ్యాయి. ఎక్కువ ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులు అందుబాటులోకి తీసుకురాకపోవడంతో ప్రైవేట్ వాహనాలనే ఆశ్రయిస్తున్నారు. గ్రేటర్‌లో జనాభా కోటి దాటిపోయినా.. ఆర్టీసీ బస్సుల సంఖ్య మాత్రం చాలా తక్కువగా ఉంది. కరోనా లాక్డౌన్కు ముందు గ్రేటర్‌లో 3,819 బస్సులు తిప్పేవారు. లాక్డౌన్తో బస్సులను ఖాళీగా ఉంచడంతో దాదాపు 900 బస్సులు నడువడం లేదు. అవి కాలం చెల్లినవిగా భావిస్తున్నారు. అయితే జనాభాకు అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచితే ప్రజారవాణా మెరుగుపడే అవకాశాలుంటాయని రవాణారంగ నిపుణులు సూచిస్తున్నారు. గ్రేటర్ ఆర్టీసీ నడుపుతున్న బస్సుల్లో 40 శాతం పాతబస్సులే. నగరంలోని గుంతల రోడ్ల కారణంగా పాతబస్సులపై వ్యయం భారీగా పెరుగు తోంది. 10.5 లక్షల కిలో మీటర్లు తిరిగిన తరువాత బస్సులను పక్కన పెట్టాల్సి ఉన్నా బస్సుల కొరత కారణంగా పాతబస్సులకే మరమ్మతులు చేస్తూ రోడ్లపైకి తీసుకువస్తుండటంతో తరుచూ సమస్యలు తలెత్తుతున్నాయి. పాత
రోజువారీ నష్టం కోటిపైనే..
గ్రేటర్ పరిధిలో మొత్తం 29 డిపోలు 3,819 బస్సులుంటే వాటిలో 2200 బస్సులను రోడ్లపైకి తీసుకువస్తున్నారు. రోజుకు సగటున 28 లక్షల ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతున్నా గ్రేటర్ జోన్ పరిధిలో రోజుకు రూ. 1.44 కోట్ల నష్టాల్లో నడుస్తోంది. ప్రస్తుతం ఆర్టీసీ చార్జీలు పెంచేందుకే సిద్ధమైంది. ప్రాథమికంగా నివేదికను తయారు చేసింది. 2019 డిసెంబర్లో కిలోమీటరుకు 20 పైసల చొప్పున పెంచింది. సీఎం కేసీఆర్కు నివేదికను సైతం అందించారు. కిలోమీటరుకు 10 పైసల చొప్పున పెంపునకు ప్రాథమికంగా ప్రతిపాదిస్తున్నారు. ఇప్పటి లెక్కల ప్రకారం ఆర్టీసీ జీతభత్యాల కోసమే 52 శాతం వినియోగిస్తోంది. ఇంకా వేతనాలు పెంచితే భారం ఎక్కువవుతుందని భావిస్తున్నారు. కిలోమీటరుకు 10 పైసల చొప్పున పెంచితే.. కొంతమేరకు ఉపశమనం లభిస్తుందని అంచనా వేస్తున్నారు.