అందరూ ఉండి కూడా అనాథలా ఆ తల్లి…

by Sridhar Babu |   ( Updated:2020-08-21 11:52:30.0  )
అందరూ ఉండి కూడా అనాథలా ఆ తల్లి…
X

దిశ, మధిర: కన్నా పేగు బంధాన్ని మరిచారు.. సృష్టిలో తల్లిదండ్రులను మించిన దైవం లేదంటారు. కానీ ఆమెకి చివరి రోజుల్లో కన్న బిడ్డల ప్రేమ కరువైంది. ఎక్కడో పొరుగు దేశాల్లో ఉన్నారనుకుంటే రాలేని పరిస్థితి అనుకోవచ్చు.! కానీ సొంత ఊరిలోనే ఉంటూ… అందరూ ఉండి కూడా అనాథలా ఆ తల్లి అంత్యక్రియలు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది.

వివరాల్లోకి వెళితే. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం మీనవోలు గ్రామానికి చెందిన తాళ్లూరి తిరుపతమ్మ(75) అనే మహిళకు గత కొద్దిరోజుల క్రితం భర్త చనిపోయాడు. ఈమెకు ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారు. గత20 రోజుల క్రితం ప్రమాదవశాత్తు కాలు విరిగింది. కుటుంబ సభ్యులంతా పట్టించుకోకుండా వదిలేసి వెళ్లారు. ఇరుగుపొరుగువారు చూసి మధిర అన్నం సేవ ఫౌండేషన్ రెస్క్యూ టీంకు సమాచారం చేరవేశారు.

విషయం తెలిసిన వారు వచ్చి ఆమె దీనావస్థను చూసి ఇద్దరు కూతుళ్లకు, కొడుకులకు పరిస్థితి వివరించారు. కానీ వారు మాకు సంబంధం లేదని, ఎవరు కూడా రాలేదు. పరిస్థితి గమనించిన ఫౌండేషన్ సభ్యులు దోర్నాల రామకృష్ణ లోకల్‌గా ఉండే నిస్సి హరిని హాస్పిటల్‌కు తరలించే లోపే ఆ వృద్దురాలు మృతిచెందింది. సదరు మహిళ దీనావస్థ చూసి మీనవోలు గ్రామస్తులు, గ్రామ సర్పంచ్ శ్రీనివాస రెడ్డి మరి కొందరు కలిసి దహన సంస్కారాలు నిర్వహించారు. ఇటువంటి బిడ్డలు ఉన్నా లేకున్నా ప్రయోజనమెంటని గ్రామస్తులు దుమ్మెత్తిపోశారు.

Advertisement

Next Story