ప్రజల జీవితాలను, జీవనోపాధిని కాపాడేందుకే పనిచేస్తున్నాం : నిర్మలా సీతారామన్

by Harish |
ప్రజల జీవితాలను, జీవనోపాధిని కాపాడేందుకే పనిచేస్తున్నాం : నిర్మలా సీతారామన్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా కొవిడ్ వ్యాప్తి భారీగా పెరుగుతోంది. సెకెండ్ వేవ్ కారణంగా పారిశ్రామిక వర్గాలు తీవ్రమైన ఆందోళన పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ దేశీయ వాణిజ్య సంఘాలతో సమావేశమయ్యారు. కరోనా మహమ్మారి సెకెండ్ వేవ్ వల్ల దేశ ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపించే అంశాల గురించి చర్చించారు. ప్రముఖుల నుంచి అభిప్రాయాలను, సూచనలను తీసుకున్నారు. ఆర్థికవ్యవస్థపై కరోనా ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు సమర్థవంతంగా అన్ని స్థాయిలలో కృషి చేస్తున్నట్టు నిర్మలా సీతారామన్ తెలిపారు. దేశంలోని ప్రజల జీవితాలను, జీవనోపాధిని కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు.

వర్చువల్‌గా నిర్వహించిన ఈ సమావేశంలో పారిశ్రామిక రంగంలోని సంఘాల ప్రతినిధులతో మాట్లాడిన ఆర్థిక మంత్రి గతేడాది తరహాలో లాక్‌డౌన్ విధించే ఆలోచన లేదని స్పష్టం చేశారు. కరోనాను నియంత్రించేందుకు ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలను అన్వేషిస్తోందని, రాష్ట్ర ప్రభుత్వాలతో జీవనోపాధిని కాపాడటానికి కలిసి పనిచేస్తున్నట్టు భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో పరిశ్రమ సంఘాల నుంచి అసోచామ్ అధ్యక్షుడు వినీత్ అగర్వాల్‌, ఫిక్కీ అధ్యక్షుడు ఉదయ్ శంకర్‌తో పాటు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. అలాగే, టీసీఎస్ ఎండీ రాజేష్ గోపీనాథన్, ఎల్అండ్‌టీ ఛైర్మన్ ఏఎం నాయక్, హీరో మోటోకార్ప్ ఎండీ పవన్ ముంజల్, టీవీఎస్ గ్రూప్ ఛైర్మన్ వేణు శ్రీనివాసన్, టాటా స్టీల్ ఎండీ నరేంద్రన్‌లతో ఆర్థిక మంత్రి సమావేశమయ్యారు. ప్రస్తుత పరిస్థితుల్లో పూర్తిస్థాయిలో లాక్‌డౌన్ విధించే అవకాశం లేదని, స్థానిక ప్రాంతాల్లో నియంత్రణ చర్యలు మాత్రమే ఉంటాయని స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed