ఎల్ఐసీ వాటా విక్రయంలో డిస్కౌంట్లు

by Harish |
ఎల్ఐసీ వాటా విక్రయంలో డిస్కౌంట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC)లో వాటా విక్రయం ఇటీవల కాలంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీవో ప్రక్రియ (IPO process). భారత్‌లోనే అతిపెద్ద ఐపీవో ఇదే. ప్రభుత్వ బీమా సంస్థలోని 25 శాతం వాటాను ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వ్యవధి కాలంలో విక్రయించే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా, ఇందులో రిటైల్ పెట్టుబడిదారుల (retail investors)కు ఐపీవో డిస్కౌంట్, బోనస్ లభిస్తాయనే భావిస్తున్నారు.

ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆర్థిక సేవల విభాగం.. ఎల్‌ఐసీ వాటా (LIC Share) విక్రయానికి సంబంధించి కేబినెట్ నోట్‌ను సెబీ, ఐఆర్‌డీఏఐ, ఎన్ఐటీఐలకు పంపినట్టు సమాచారం. ఎల్ఐసీలో ఉన్న 100 శాతం వాటాను 75 శాతానికి తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ విక్రయంలో రిటైల్ పెట్టుబడిదారులకు 10 శాతం వరకు డిస్కౌంట్ అందించే అవకాశాలున్నాయి.

ఎల్‌ఐసీ ఉద్యోగులకు కూడా ఇది వర్తించవచ్చు. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ సమయంలో ఆర్థిక నిర్మలా సీతారామన్ ఎల్ఐసీలో ప్రభుత్వ వాటాలో కొంత భాగాన్ని ఐపీవో ద్వారా విక్రయించే ప్రభుత్వ ప్రణాళికను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎల్ఐసీ ఐపీవో కోసం ప్రభుత్వం డెలాయిట్ టచ్ తోమత్సు ఇండియా, ఎస్‌బీఐ కేపిటల్ మార్కెట్లను నియమించుకుంది. ఈ రెండు సంస్థల సలహాదారులు ఎల్ఐసీ మూలధన నిర్మాణాన్ని అంచనా వేసేందుకు సహాయం చేస్తారు.

Advertisement

Next Story