Rahul: ట్రంప్ సుంకాలను ఎలా ఎదుర్కొంటారు.. కేంద్రంపై రాహుల్ గాంధీ పైర్

by vinod kumar |
Rahul: ట్రంప్ సుంకాలను ఎలా ఎదుర్కొంటారు.. కేంద్రంపై రాహుల్ గాంధీ పైర్
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత ఎగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పరస్పర సుంకాలు విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ(Rahul Gandhi) తీవ్ర విమర్శలు గుప్పించారు. అమెరికా విధించిన టారిఫ్స్ భారత ఆర్థిక వ్యవస్థను పూర్తిగా నాశనం చేస్తాయని ఆరోపించారు. దీని వల్ల ముఖ్యంగా ఆటో ఇండస్ట్రీ, ఫార్మాస్యూటికల్స్, వ్యవసాయం వంటి రంగాలపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నమ్మిన స్నేహితుడే టారిఫ్స్ విధించారని దీనిని ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుందో సమాధానం చెప్పాలన్నారు. గురువారం లోక్ సభలో జీరో అవర్ సందర్భంగా ప్రసంగించారు. భారత్, చైనా మధ్య దౌత్య సంబంధాల 75వ వార్షికోత్సవాన్ని జరుపుకోవడంపై రాహుల్ స్పందిస్తూ.. చైనా మన ప్రాంతంలో సుమారు 4వేల చదరపు కిలోమీటర్ల భూమిని ఆక్రమించింది, కానీ భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ చైనా రాయబారితో కలిసి కేక్ కట్ చేయడం చూసి ఆశ్చర్యపోయానన్నారు.

గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో 20 మంది సైనికులు చనిపోతే వారి బలిదానాన్ని పక్కన బెట్టి సంబురాలు జరుపుకోవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఇరు దేశాల మధ్య సాధారణ స్థితిత నెలకొనడానికి తాము వ్యతిరేకం కాదని, కానీ దాని కన్నా ముందు మన భూమి మనం తిరిగి పొందాలన్నారు. దీని కోసం మునుపటి పరిస్థితిని పునరుద్దరించడం అవసరమని నొక్కి చెప్పారు. భూమిని తిరిగి పొండానికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో సమాధానం చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

Next Story

Most Viewed