Rajnath singh: ఏఐతో యుద్ధ స్వభావంలో మార్పు.. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్

by vinod kumar |
Rajnath singh: ఏఐతో యుద్ధ స్వభావంలో మార్పు.. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో యుద్ధ స్వభావం పూర్తిగా మారుతుందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ (Rajnath singh) నొక్కి చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ) రాకతో సాంకేతిక యుద్ధం జరుగుతుందని తెలిపారు. భవిష్యత్ ముప్పులను ఎదుర్కోవడానికి భారత సాయుధ దళాలు ఏఐ, డ్రోన్లు, సైబర్ యుద్ధతంత్రాల్లో నైపుణ్యం సాధించాలని సూచించారు. అంతేగాక టెక్నాలజీని ఆధునీకరించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సాంప్రదాయ పోరాట పద్ధతుల నిర్వచనం పూర్తిగా మారిపోయిందన్నారు. తమిళనాడులోని వెల్లింగ్టన్‌లో ఉన్న డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీ స్నాతకోత్సవంలో రాజ్ నాథ్ ప్రసంగించారు. ‘నేటి యుగంలో రాజకీయ, సైనిక లక్ష్యాలను నెరవేర్చడానికి సైబర్ అటాక్స్, నకిలీ సమాచారం, ఆర్థిక దాడులు సాధనాలుగా మారాయి. ఒక్క బుల్లెట్ కూడా పేల్చకుండానే తమ లక్ష్యాలను సాధించగలుగుతున్నారు’ అని వ్యాఖ్యానించారు.

యుద్ధం భూమి, సముద్రం, వాయు మార్గాల పరిధిని దాటిపోయిందని తెలిపారు. సైబర్, అంతరిక్షం, సమాచార రంగం వంటి వివిధ రంగాల్లో సాయుధ దళాలు కలిసి పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. భారత్ సరిహద్దుల వెంట తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటోందని చెప్పారు. ఉత్తర, పశ్చిమ సరిహద్దుల్లో బెదిరింపులను ఎదుర్కొంటున్నామని తెలిపారు. పరోక్ష యుద్ధం, ఉగ్రవాదం వల్ల ఈ సమస్య మరింత తీవ్రమైందని వెల్లడించారు.



Next Story

Most Viewed