గవర్నర్ చెప్పిన నాలుగు ‘ఈ’ల మంత్రం

by Shyam |

దిశ, న్యూస్‌బ్యూరో: విశ్వవిద్యాలయం విద్యను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు నాలుగు ‘ఈ’ల మంత్రాన్ని పాటించాలని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సూచించారు. ఉన్నత విద్యలో రాష్ట్రాన్ని ముందు వరుసలో నిలపడమే తన లక్ష్యమని, అందుకోసం అందరూ తమ పరిధిలో శ్రమించాలని కోరారు. బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ అధికారులతో గురువారం గవర్నర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయాల్లో పూర్వ విద్యార్ధుల అసోసియేషన్లను ఏర్పాటు చేసి బలోపేతం చేయాలని సూచించారు. పూర్వ విద్యార్ధులు తమ విశ్వవిద్యాలయాలను ఆదరించి అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చారు. తాను చదివిన మద్రాసు మెడికల్ కాలేజీలోని బ్రిటీష్ కాలం నాటి అనాటమీ ల్యాబ్ శిథిలావస్థలో ఉన్నప్పడు తాము ఆ కళాశాల పూర్వ విద్యార్ధుల సాయం కోరామని, వారిచ్చిన విరాళాలతో అనాటమీ ల్యాబ్‌ను పునరుద్ధరించుకోగలిగామని గుర్తు చేసుకున్నారు. కొవిడ్ సంక్షోభ సమయంలో విశ్వవిద్యాలయాలు పరీక్షలు నిర్వహించేందుకు ఎలా సన్నద్ధమవుతున్నాయో తెలపాలని ఆదేశించారు. ఆన్‌లైన్ పరీక్షలు లేదా ఇతర పద్ధతుల ద్వారా విద్యార్ధులకు ఇబ్బందులకు కలగుకుండా ఉన్న అవకాశాలను వివరించాలని కోరారు. విశ్వవిద్యాలయ విద్యను ఉన్నతంగా తీర్చిదిద్ధడానికి ఎంజాయ్, ఎడ్యుకేట్, ఎంప్లాయ్, ఎంపవర్ అనే నాలుగు ‘ఈ’ ల మంత్రాన్ని గవర్నర్ సూచించారు. ప్రతి విశ్వవిద్యాలయం తమ విస్తృత విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేసుకోవాలని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed