ప్రభుత్వ ఉద్యోగుల ‘బీమా’పై సర్కార్ కీలక నిర్ణయం..

by Anukaran |
insurance
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల బీమా వయసు, స్లాబులను సవరిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయసు పెంచిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. గరిష్ట బీమా వయసును 53 ఏండ్ల నుంచి 56 ఏండ్లకు పెంచింది. కనిష్ట బీమా వయసు 21 నుంచి 19 ఏండ్లకు తగ్గించింది. కనిష్ట ప్రీమియం స్లాబును రూ. 500 నుంచి 750కి.. గరిష్ట ప్రీమియం స్లాబును రూ. 2 వేల నుంచి రూ. 3 వేలకు పెంచింది. కొత్త పాలసీకి అంగీకారం తెలుపుతూ ప్రభుత్వ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

దీనికి కొత్త పేస్కేల్ ప్రకారం మినిమమ్ ప్రీమియాన్ని కూడా ఖరారు చేసింది. ఈ మినిమమ్​ప్రీమియం మాత్రమే కాకుండా అదనంగా చెల్లించే వెసులుబాటు కూడా కల్పించింది. ఇది పీఆర్సీ పెంపు వర్తిస్తున్న ఉద్యోగులందరికీ వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణకు వయోపరిమితి పెంచడంతో టీఎస్‌జీఎల్‌ఐ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్​లైఫ్ ఇన్సూరెన్స్​పాలసీ తీసుకోవడానికి మూడేండ్ల వయో పరిమితి పెంచుతూ జీవో జారీ చేశారు. గతంలో 58 ఏండ్ల రిటైర్మెంట్ వయస్సు ఉన్నప్పుడు 53 ఏండ్ల వరకే పాలసీ ప్రీమియం చెల్లించే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఆ వయస్సును 56 ఏండ్లకు పెంచారు. 56 ఏండ్ల వయస్సు వరకు కొత్త పాలసీ తీసుకునేందుకు అర్హులు. దీంతో ఇప్పటి వరకు ఉద్యోగుల్లో ఉన్న సందిగ్థత తొలగింది.

ప్రీమియం ఇలా..

పీఆర్సీ 2015 పేస్కేల్​ ప్రకారం రూ. 13 వేల నుంచి రూ. 16,400 వరకు కనీస వేతనం ఉన్న ఉద్యోగి రూ. 500 ప్రీమియం చెల్లిస్తుండగా.. పీఆర్సీ 2020 పే స్కేల్​ ప్రకారం రూ. 19 వేలు నుంచి రూ. 24,280 వేతనం ఉన్న ఉద్యోగి ఇప్పుడు రూ. 750 ప్రీమియం చెల్లించే విధంగా మినిమమ్​ ప్రీమియం ఖరారు చేశారు. అదే విధంగా కనీస వేతనం రూ. 24,281 నుంచి రూ. 31,040 ఉన్న ఉద్యోగులు కనీస ప్రీమియం రూ. 1000 వరకు చెల్లించవచ్చు.

రూ. 31,040 నుంచి రూ. 42,300 వేతనం ఉన్న ఉద్యోగి కనీస ప్రీమియం రూ. 1250 చొప్పున ఖరారు చేశారు. కనీస వేతనం రూ. 42,301 నుంచి రూ. 51,320 ఉన్న ఉద్యోగి కనీస ప్రీమియం రూ. 1700 చెల్లించవచ్చు. రూ. 51,321 నుంచి రూ. 71,00‌‌0 పేస్కేల్​ఉన్న ఉద్యోగి రూ. 200లుగా నిర్ధారించారు. ఇక కనీస వేతనం రూ. 71,001 నుంచి రూ. 1,62,070 ఉన్న ఉద్యోగులు రూ. 3,000 కనీస ప్రీమియాన్ని చెల్లించేలా జీవోలో స్పష్టం చేశారు.

ఉద్యోగి ఆప్షన్ ​ప్రకారం కనీస ప్రీమియాన్ని అదనంగా కూడా వేతనం నుంచి చెల్లించుకునే అవకాశాన్ని కూడా కల్పించారు. దీని కోసం ఉద్యోగులు ప్రపోజల్ పత్రాలను సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు అందించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed