కరీంనగర్ ప్రజలకు శుభవార్త

by Sridhar Babu |
కరీంనగర్ ప్రజలకు శుభవార్త
X

దిశ, కరీంనగర్: ఇంటింటికి మంచి నీరు సరఫరా చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అర్బన్‌ మిషన్‌ భగీరథ పథకం కరీంనగర్ లో పూర్తయింది. రాష్ట్రంలోనే మొదటిసారిగా 24 గంటలు నీరందించేందుకు కరీంనగర్‌ను పైలెట్‌ ప్రాజెక్టుగా ప్రభుత్వం ఎంపిక చేసింది. కరీంనగర్ సమీపంలోని లోయర్‌ మానేరు డ్యాం నుంచి నీటిని తరలించి ప్రయోగాత్మకంగా నిరంతరంగా నీటిని సరఫరా చేయాలనేది పథకం ముఖ్య ఉద్దేశ్యం. ఈ మేరకు రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ ట్రయల్ రన్ ను మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. కరీంనగర్ నగర వాసులకు నిరంతరం తాగునీరందించాలన్న సంకల్పంతో రూ. 110 కోట్లతో ప్రభుత్వం అర్బన్‌ మిషన్‌ భగీరథ పథకాన్ని చేపట్టింది. నగరపాలక సంస్థ పరిధిలోని ఓవర్‌హెడ్‌ ట్యాంకులు 16 ఉండగా, మరో 3 ట్యాంకుల నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం నగరంలో ఉన్న 43 వేల నల్లా కనెక్షన్లకు రోజు విడిచి రోజు నీటి సరఫరా జరుగుతోన్నది. ఈ పథకం ద్వారా 24 గంటలూ నీటి సరఫరా చేయనున్నారు. అందులో భాగంగా కొత్తగా ఓవర్‌హెడ్‌ ట్యాంకులు, సంపులు, పైపులైన్‌ కనెక్షన్లు, బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ పనులన్నీ పూర్తయ్యాయి.

అందుబాటులోకి రానున్నాయి..

2033 సంవత్సరం నాటికి బల్దియా పరిధిలో జనాభా 4.03 లక్షలకు చేరనున్నదని అంచనా వేసిన అధికారులు 68.65 ఎంఎల్‌డీల సామర్థ్యంతో ఫిల్టర్‌బెడ్, 3 వేల కేఎల్‌ సామర్థ్యంతో శాతవాహన యూనివర్సిటీ పరిధిలో మాస్టర్‌ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ ను నిర్మించారు. 800 కిలో లీటర్ల సామర్థ్యం గల సంపు, పంపుహౌస్‌ను ఫిల్టర్‌బెడ్‌ వద్ద నిర్మించారు. రాంనగర్‌లో 1300 కిలో లీటర్ల ట్యాంకు, హౌసింగ్‌బోర్డు కాలనీలో 2200 కిలో లీటర్ల సామర్థ్యంతో ట్యాంకులను నిర్మించారు. సాధారణంగా నగర వాసులకు నిత్యం నీరందించాలంటే 37 మిలియన్ లీటర్ల నీరు అవసరం ఉంటుంది. రోజు విడిచి రోజు 48 ఎంఎల్ డీ నీటిని లోయర్ మానేరు నుంచి సేకరించి శుద్ది చేసిన 37 ఎంఎల్ డీ నీటిని నగర వాసులకు అందిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ట్రీట్ మెంట్ ప్లాంట్ తో రోజూ నీటిని సరఫరా చేయడం సాధ్యం కాని పరిస్థితుల్లో కొత్తగా 36 ఎం ఎల్ డీ ల సామర్థ్యంతో ట్రిట్ మెంట్ ప్లాంట్ ను నిర్మించారు. దీంతో 84 ఎం ఎల్ డీ సామర్థ్యం గల నీటి శుద్ది కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి. ప్రజలకు శుద్ధి జలాలను అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం అర్బన్ మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించింది. రాష్ట్రంలో మొదటి సారిగా కరీంనగర్ కార్పొరేషన్ లో మిషన్ భగీరథ నీటిని అందించే ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానుంది. నగరంలోని 3 లక్షల జనాబాకు ప్రతి రోజూ నీటిని అందించనున్నామని నగర పాలక సంస్థ మేయర్ సునీల్ రావు చెబుతున్నారు. ఇప్పటికే అవసరమైన విద్యుత్ కనెక్షన్ కోసం రూ. 26 లక్షలు చెల్లించారు. అర్బన్ మిషన్ భగీరథ ఫథకంతో మొత్తానికి కరీంనగర్ ప్రజల దాహర్తి తీరనుంది.

Tags: Karimnagar, Urban Mission Bhagiratha, Water, People, Minister Kamalakar

Advertisement

Next Story

Most Viewed