భారత్‌లో భారీగా పెరిగిన బంగారం దిగుమతులు

by Harish |
భారత్‌లో భారీగా పెరిగిన బంగారం దిగుమతులు
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ మహమ్మారి నేపథ్యంలో తక్కు బేస్ ఎఫెక్ట్ కారణంగా ప్రస్తుత ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో దేశీయ బంగారం దిగుమతులు 7.9 బిలియన్ డాలర్ల(రూ. 58,572.99 కోట్ల)తో భారీగా పెరిగాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడించాయి. గతేడాది ఇదే కాలంలో పసిడి లోహం దిగుమతు 688 మిలియన్ డాలర్లు(రూ. 5,208.41 కోట్ల)కు పడిపోయినట్టు గణాంకాలు నమోదయ్యాయి. అయితే, వెండి దిగుమతులు 93.7 శాతం తగ్గి 39.4 మిలియన్ డాలర్ల(రూ. 293 కోట్ల)కు చేరుకున్నాయి.

బంగారం దిగుమతుల్లో గణనీయమైన పెరుగుదల వల్ల దేశ వాణిజ్య లోటు ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-జూన్ కాలంలో సుమారు 31 బిలియన్ డాలర్ల(రూ. 2.3 లక్షల కోట్ల)కు పెరిగింది. కాగా, భారత్ ప్రపంచంలోనే అత్యధికంగా బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది. ప్రధానంగా ఆభరణాల పరిశ్రమ డిమాండ్‌ను తీర్చేందుకు దీన్ని వినియోగిస్తారు. వాల్యూమ్ పరంగా దేశం ఏటా 800-900 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల్లో రత్నాలు, ఆభారణాల ఎగుమతులు 9.1 బిలియన్ డాలర్ల(రూ. 67.7 వేల కోట్ల)కు పెరిగాయి.

Advertisement

Next Story