ఆ స్కానింగ్ సెంటర్లకు వెళితే.. అందరూ దేవుళ్లే పుడుతారట..!

by Anukaran |   ( Updated:2021-07-13 01:40:26.0  )
scaning-centers 1
X

దిశ, నాగర్ కర్నూల్: స్కానింగ్ సెంటర్లకు వెళితే దేవుళ్లు పెట్టడమేంటని ఆశ్చర్యపోతున్నారా.. నాగర్ కర్నూల్ జిల్లాలో స్కానింగ్ సెంటర్లకు వెళితే ఈ దేవుళ్ల సంగతి బయట పడుతుంది. నాగర్ కర్నూల్ జిల్లా ఆడపిల్లలను పురిటీలోనే చిదిమేసేందుకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. మొదటి సారి ఆడపిల్ల పుట్టిన ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతుందని సంతోషపడినా మరో కాన్పులో మగబిడ్డ కోసమే తాపత్రయపడుతున్నారు. రెండో కాన్పు కోసం గర్భందాల్చిన గర్భవతిని కుటుంబ సభ్యులు నేరుగా నాగర్ కర్నూలు జిల్లాలోని అల్ట్రాసౌండ్ స్కానింగ్ సెంటర్లకు పరుగులు పెట్టిస్తున్నారు. ఎంత ఖర్చయినా వెనకడుగు వేయకుండా లింగ నిర్ధారణ పరీక్షలు గుట్టుగా జరిపిస్తున్నారు. ఆడపిల్ల అని తెలియగానే పురిట్లోనే చంపేస్తున్నారు. ఇదంతా జిల్లా వైద్య అధికారులు, ప్రజా ప్రతినిధులు, ఇతర స్వచ్ఛంద సేవా సంస్థలకు తెలిసే జరుగుతున్నాయని జిల్లా వాసులు విచారం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు కూడా గత 8ఏళ్లుగా జరగకపోవడంతో మహిళలు కొద్దిరోజులకే గర్భం దాల్చి అబార్షన్లు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్ని సందర్భాల్లో అబార్షన్లు వికటించి ప్రాణాలను కూడా కోల్పోతున్నారు.

ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు స్పందించకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రతి ఒక్కరు ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు ఇచ్చే నెలసరి ముడుపులకు అలవాటు పడ్డారని జిల్లా వాసులనుండి ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోపక్క జిల్లా వైద్యాధికారులు స్థానికులుగా ఉండడంతో ప్రైవేటు ఆస్పత్రులను చూసిచూడనట్లు వదిలేస్తున్నారు అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో అబార్షన్ కు దాదాపు 10 నుంచి ఇరవై వేలు వసూలు చేస్తున్నా ఎవరు పల్లెత్తు మాట అనకపోవడం చూస్తే ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యం అధికారులను ఏ రేంజ్ లో శాసిస్తున్నారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అబార్షన్ వికటించిన మహిళా కుటుంబానికి కేవలం ఒక్క రోజులోనే 11 లక్షలు ముట్టచెప్పారంటే వారి దినసరి ఆదాయం ఎంతుందో అర్థం చేసుకోవచ్చని స్థానికులే ఆశ్చర్యపోతున్నారు.

గుట్టుగా అబార్షన్లు.!

నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రధానంగా కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్ పట్టణాలతోపాటు నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం వైద్య రంగానికి పెట్టింది పేరు. గ్రామీణ ప్రాంతాల నుండి ఆర్ఎంపీలు రోగులను ప్రధాన ప్రైవేటు ఆసుపత్రులకు రెఫర్ చేస్తుంటారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన వారితో పాటు చేయమని చెప్పే వారికి కూడా శిక్ష తప్పదు. దీంతో నేరుగా ప్రైవేట్ హాస్పిటల్ వెళ్లి లింగ నిర్ధారణ పరీక్షలు చేయమని అడిగే ఆస్కారం లేదు. ఈ క్రమంలో గర్భిణీ కుటుంబీకులు ముందుగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఆర్‌ఎంపీలను ఆశ్రయించి వారి ద్వారా ప్రైవేటు ఆసుపత్రులకు చేరుతున్నారు. అప్పటికీ (మగ, ఆడ) లింగ నిర్ధారణ పరీక్ష ఫలితాలు అత్యంత రహస్యంగా చేరవేస్తున్నారు. కొన్ని ఆసుపత్రులలో నామాలు పెడితే బాబు అని, బొట్టు పెడితే పాప అని సీక్రెట్ కోడ్ వాడుతున్నారు. మరికొన్ని దవాఖానాల్లో వెంకటేశ్వర స్వామి, అలివేలు మంగ చిత్ర పాఠాలు చూపుతున్నారని సమాచారం.

మరికొంత మంది పాపా బాగా ఎదగాలి, లేదా బాబు బాగున్నాడు వంటి పదాలు వాడుతూ పరోక్షంగా చెబుతున్నారట. కాగా ఆడపిల్ల అని తెలిసినా వారు మూడోకంటికి కూడా తెలియకుండా పిండం అవయవాలు ఎడగలేదనే సాకుతో అబార్షన్లకు పూనుకుంటున్నారు. ఇందులో ప్రైవేటు ఆసుపత్రులు అవసరాన్ని బట్టి డబ్బులు దండుకుంటున్నారు. బిడ్డ అవయవాలు పెరగకుండా, తల్లి ప్రాణం ప్రమాదంలో ఉందనుకుంటే గర్భ నిరోధకమాత్రలు లేదా 12వారాలకు ముందు ఒక రకమైన ట్రీట్మెంట్, 20 వారాలు (5నెలలు) దాటితే మాత్రం ఇద్దరు స్త్రీల వైద్య నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే అబార్షన్ జరగాల్సి ఉంటుందని స్త్రీల వైద్య నిపుణులు చెబుతున్నారు. కానీ ఎలాంటి నిబంధనలు పాటించకుండా పెళ్లైనా, వివాహం జరగని వారికి కూడా ఇష్టారీతిగా అబార్షన్లు చేసి డబ్బు పెట్టెలను నింపుకుంటున్నారు.

ఈ పాపంలో అందరూ భాగస్వాములే.!

జిల్లాలో తెరవెనుక జరుగుతున్న భ్రూణహత్యలు(అబార్షన్లకు) జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సేవా సంస్థలు ఇలా అందరూ భాగస్వామ్యం కావడం వల్లే గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫలితంగా జిల్లాలో స్త్రీ, పురుషుల నిష్పత్తి 914గా ఉంది. మరికొన్ని మండలాల్లో 700నుండి 814 వరకు నమోదు అవుతోంది. గత రెండు వారాల క్రితం గర్భిణీ మహిళలకు అబార్షన్ నిర్వహించగా అది వికటించి మృత్యువాత పడింది. దాన్ని కప్పిపుచ్చుకునేందుకు సంబంధిత ఆస్పత్రి యాజమాన్యం 11 లక్షలు ప్రాణం ఖరీదు లెక్కగట్టింది.

ఈ ఘటనపై ‘దిశ’ ప్రత్యేక కథనం ప్రచురించగా జిల్లా కలెక్టర్ శర్మన్ పూర్తి నివేదిక ఇవ్వాలని కోరుతూ జిల్లా వైద్యాధికారి సుధాకర్ లాల్ కి ఆదేశాలు ఇచ్చారు. కానీ నేటికీ విచారణ ప్రారంభం కాకపోవడం అందరినీ ఆశ్చర్యానికి లోను చేస్తోంది. ఆస్పత్రి యాజమాన్యాయానికి నియోజకవర్గ ప్రజాప్రతినిధుల అండదండలు పుష్కలంగా అందాయని స్థానికులు చెవులు కొరుక్కుంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఒక కమిటీని వేసి భ్రూణహత్యలు, లింగ నిర్ధారణ పరీక్షలను అరికట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed