- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పీకల్లోతు అప్పుల్లో జెన్ కో.. చెల్లింపులకన్నా బాకీలే ఎక్కువ
దిశ, తెలంగాణ బ్యూరో : వ్యవసాయ రంగానికి 24 గంటలూ ఉచితంగా విద్యుత్ అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటే అని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ఒకింత గర్వంగానే ప్రకటించారు. కానీ మరో కోణాన్ని పరిశీలిస్తే వివిధ ఉత్పత్తి సంస్థల నుంచి జెన్‌కో కొనుగోలు చేసిన విద్యుత్‌కు చెల్లించే బకాయిలు మాత్రం ఏటేటా పెరిగిపోతున్నాయి. 2019 ఫిబ్రవరి నాటికి విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలు రూ. 4,196 కోట్లు ఉంటే, ఆ తర్వాతి సంవత్సరానికి రూ. 6,323 కోట్లకు పెరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి అది రూ. 7,217 కోట్లకు పెరిగింది. విద్యుత్ కొనుగోలు చేసిన తర్వాత 45 రోజుల గడువు లోపు చెల్లింపు చేయాలన్నది నిబంధన. ఒకవేళ చెల్లించకపోతే దాన్ని ‘ఓవర్ డ్యూ’గా పేర్కొనాల్సి ఉంటుంది.
ఎన్‌టీపీసీ, ఎన్ఎల్‌సీ ఇండియా, సెంబ్ కార్ప్ లాంటి సంస్థల నుంచి తెలంగాణ జెన్‌కో విద్యుత్ కొనుగోలు చేసిన తర్వాత సకాలంలో చెల్లింపులు చేయకపోవడంతో ‘ఓవర్ డ్యూ’ పేరుతో బకాయిలు పేరుకుపోతున్నాయి. ఎన్‌టీపీసీకి ఈ ఏడాది ఫిబ్రవరి చివరి నాటికి రూ. 1,275.28 కోట్లు, సెంబ్ కార్పొరేషన్‌కు రూ. 2,805.14 కోట్లు, వివిధ సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తి సంస్థలకు రూ. 1,594.13 కోట్ల చొప్పున ‘ఓవర్ డ్యూ’ పేరుతో తెలంగాణ జెన్‌కో సంస్థ బాకీ ఉంది. ఇక దానికి ముందు నెలలో కొనుగోలు చేసిన విద్యుత్‌కు సంబంధించి ఎన్‌టీపీసీకి రూ. 397.14 కోట్లు, సెంబ్ కార్పొరేషన్‌కు రూ. 267.35 కోట్ల చొప్పున చెల్లించాల్సి ఉంది.
గతేడాది మార్చి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి చివరి వరకు మొత్తం విద్యుత్ కొనుగోలుకు సంబంధించి అన్ని సంస్థల బిల్లింగ్ విలువ రూ. 10,632.29 కోట్లు అయితే జెన్‌కో చెల్లించింది రూ. 9,837.13 కోట్లు. దానికి ముందు సంవత్సరం నుంచి పేరుకుపోయిన ‘ఓవర్ డ్యూ’ కూడా కలుపుకుంటే ప్రస్తుతం రూ. 7,217 కోట్ల మేర విద్యుత్ సంస్థలకు బకాయి ఉంది. ఫిబ్రవరి నెలకు సంబంధించిన ‘ఔట్ స్టాండింగ్’ రూపంలో కట్టాల్సిన రూ. 874 కోట్లు దీనికి అదనం. ఒకసారి విద్యుత్ కొనుగోలు చేసిన తర్వాత 45 రోజుల వ్యవధిలోపు చెల్లింపులు చేయాల్సిన బిల్లుల మొత్తం ‘ఔట్ స్టాండింగ్’గా పరిగణిస్తారు. ఆ గడువులోగా కట్టకపోతే ఆ బకాయి ‘ఓవర్ డ్యూ’గా మారిపోయింది. ఒకసారి ‘ఓవర్ డ్యూ’గా మారిన తర్వాత దానికి పెనాల్టీ లాంటివి కూడా జెన్‌కో చెల్లించాల్సి ఉంటుంది.
ఒకవైపు కేంద్ర ఇంధన మంత్రిత్వశాఖ డిస్కంలు నష్టాల్లో కూరుకుపోతున్నాయంటూ మొత్తుకుంటోంది. గతంలో ‘ఉదయ్’ పథకం ద్వారా కొంత వెసులుబాటు ఇచ్చి అప్పులు లేకుండా చొరవ తీసుకుంది. కానీ ఆ తర్వాత మళ్ళీ బకాయిలు పేరుకుపోయాయి. దీంతో ఫ్రాంచైజీలకు ఇవ్వడమే ఉత్తమమని భావించింది. దీనికి విద్యుత్ సంస్కరణలు అనే పేరు తగిలించింది. తెలంగాణ విషయాన్నే చూసుకుంటే అటు డిస్కంలు నష్టాల్లో ఉన్నాయంటూ ‘కాగ్’ సైతం వ్యాఖ్యానించింది. ప్రభుత్వం కూడా బడ్జెట్‌లో అదే విషయాన్ని పేర్కొంది. మరోవైపు జెన్‌కో సైతం వివిధ ప్రభుత్వ, ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తి సంస్థల నుంచి కొనుగోలు చేసిన తర్వాత సకాలంలో చెల్లించలేక బకాయి పడింది. కొన్ని సంస్థలకు దాదాపు మూడేళ్ళ నుంచి చెల్లించకుండా పెండింగ్‌లో పెట్టింది. ఉదాహరణకు ఎన్‌టీపీసీకి దాదాపు 305 రోజులుగా రూ. 110 కోట్లు పెండింగ్‌లో పెట్టింది. వివాదాస్పదంగా మారిన బిల్లుల విలువ దీనికి అదనం.
ఇలాంటి పరిస్థితుల్లో విద్యుత్ ఛార్జీలు పెంచితే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే భయం, కట్టడానికి డబ్బుల్లేక ‘ఓవర్ డ్యూ’ పేరుతో బకాయి పడి పేరుకుపోతున్న అప్పులు ప్రభుత్వానికి ఇబ్బందికరంగా పరిణమించింది.
2019 ఫిబ్రవరి నాటికి
‘ఓవర్ డ్యూ’ : రూ. 4,196 కోట్లు
‘ఔట్ స్టాండింగ్’ : రూ. 1,265 కోట్లు
2020 ఫిబ్రవరి నాటికి
‘ఓవర్ డ్యూ’ : రూ. 6,323 కోట్లు
‘ఔట్ స్టాండింగ్’ : రూ. 1,075 కోట్లు
2021 ఫిబ్రవరి నాటికి
‘ఓవర్ డ్యూ’ : రూ. 7,217 కోట్లు
‘ఔట్ స్టాండింగ్’ : రూ. 874 కోట్లు