గిఫ్ట్-ఏ-లైవ్లీహుడ్.. పేదలకు అండగా నిలుస్తున్న ‘ఫ్రీ మాసన్స్’

by Shyam |   ( Updated:2021-06-24 07:25:56.0  )
గిఫ్ట్-ఏ-లైవ్లీహుడ్.. పేదలకు అండగా నిలుస్తున్న ‘ఫ్రీ మాసన్స్’
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్ : కొవిడ్ కారణంగా ఆదాయ వనరులను కోల్పోయిన పేదలు, చిరు వ్యాపారులు, స్వయం ఉపాధి పొందుతున్న వారితో పాటు కార్మికులకు ఆర్థిక సహాయాన్ని అందించడానికి తెలంగాణ ఫ్రీ మాసన్స్ ముందుకు వచ్చింది. ‘యూనివర్సల్ బ్రదర్ హుడ్ డే’ను పురస్కరించుకుని గురువారం గోషామహల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో 21 మంది లబ్ధిదారులను గుర్తించి వారు స్థిరంగా వ్యాపారం చేసుకుని జీవనోపాధి పొందేందుకు కుట్టు మిషన్లు, వంట పాత్రలు, ఫ్లాస్క్, తోపుడు బండ్లు తదితర రూ. 1.70 లక్షల విలువైన సాధనాలను ‘గిఫ్ట్-ఎ-లైవ్లీహుడ్’ కింద అందజేశారు.

ఈ సందర్భంగా అసిస్టెంట్ రీజినల్ గ్రాండ్ మాస్టర్స్ మదన్ మోహన్ లాల్, జి. మడ్డులెట్, డి.రామచంద్రమ్‌లు మాట్లాడుతూ.. 1806వ సంవత్సరంలో హైదరాబాద్‌లో మొదటి సారిగా ఫ్రీ మాసన్స్ ప్రారంభమైందని, దీనికి 215 సంవత్సరాల చరిత్ర ఉందని తెలిపారు. గిఫ్ట్-ఎ-లైవ్లీహుడ్.. కొవిడ్ కారణంగా ప్రభావితమైన చిన్న వ్యాపారులు.. తమ వ్యాపారాలను తిరిగి ప్రారంభించడానికి ఇది దోహదపడుతుందన్నారు. గతేడాదిలో కొవిడ్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు ఆరు పంపిణీ శిబిరాలను నిర్వహించడం జరిగిందన్నారు.

Freemasons1

వీటిల్లో 150 మందికి సుమారు రూ.7.5 లక్షల విలువైన ఉపకరణాలు విరాళంగా ఇవ్వడం జరిగిందన్నారు. ఈ సేవా కార్యక్రమాలు భవిష్యత్‌లో కూడా కొనసాగిస్తామని తెలిపారు. లబ్ధిదారుల ఎంపిక సందర్భంగా సుమారు వెయ్యికి పైగా ఫోన్ కాల్స్ రాగా వారిలో చిన్న వ్యాపారులు, కార్పెంటర్లు, ఎలక్ట్రీషియన్లు, టిఫిన్ సెంటర్లు, టీ-స్టాల్ యజమానులు 21 మందిని గుర్తించి వారికి ఉపకరణాలు అందజేశామని వివరించారు. అంతేకాకుండా సుమారు రూ.60 వేల విలువ గల 3 సిరంజీ ఇన్ఫ్యూషన్ పంపులను దుర్గాబాయి దేశ్ ముఖ్ ఆసుపత్రికి విరాళంగా అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫ్రీమాసన్స్ సీనియర్ సభ్యుడు విశ్వనాథన్ గణేషన్, పి. వీరభద్రుడు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story