నమ్మించి ముంచుదామనుకుంటే.. వెంటాడిన నిఘా నేత్రాలు.. నలుగురు అరెస్టు

by Sridhar Babu |
నమ్మించి ముంచుదామనుకుంటే.. వెంటాడిన నిఘా నేత్రాలు.. నలుగురు అరెస్టు
X

దిశ, వెల్గటూర్ : పాత పరిచయాన్ని ఆసరాగా చేసుకుని నలుగురు యువకులు ఘరానా మోసానికి పాల్పడ్డారు. మహారాష్ట్ర వచ్చిన వ్యాన్ డ్రైవర్‌ను బెదిరించి రూ.3.52 లక్షల విలువగల పైపులను సినీ ఫక్కీలో దొంగిలించారు. సీసీ కెమెరాల ఆధారంగా వెల్గటూర్ పోలీసులు రంగంలోకి దిగి నిందితులను మండలంలోని రాజారాంపల్లి వద్ద పట్టుకున్నారు. జగిత్యాల డీఎస్పీ ప్రకాష్ సోమవారం ఈ ఘటనకు సంబంధించి వివరాలను వెల్లడించారు.

మంచిర్యాల జిల్లా ఎన్టీఆర్ నగర్‌కు చెందిన వారణాసి ఉమామహేష్ (23), సుందరయ్య కాలనీకి చెందిన పర్వతం విజయ్ కుమార్ (25), ఆదిలాబాద్ జిల్లా వేంపల్లికి చెందిన కుంచెం నవీన్ (23), నల్గొండ జిల్లా మోత్కూరుకు చెందిన ఆలకుంట అజయ్ కుమార్ అలియాస్ అజిత్ (23)లు కమీషన్ తీసుకుంటూ అవసరమైన వారికి బోర్‌వెల్ పైపులు సరఫరా చేస్తుండేవారు. ఈ క్రమంలో వారికి అక్రమంగా సంపాదించాలనే దుర్బుద్ధి పుట్టింది. పాత పరిచయాన్ని ఆసరాగా చేసుకుని వీరు మహారాష్ట్రలో గల ‘గుడ్ విల్ పాలీ ఫాస్ట్’ కంపెనీకి ఒక నకిలీ చిరునామాతో ( జగిత్యాల జిల్లా , ధర్మపురి మండల కేంద్రంలో గల ఒక పేరు మీద) బోర్వెల్‌కు ఉపయోగించే ‘పీవీసీ’ పైపులు ఆర్డర్ చేశారు.

కాగా, వారు ఆర్డర్ చేసిన పైపులను మహారాష్ట్రకు చెందిన రామ్ భోజ్నే (23) అనే డ్రైవర్ ఐచర్ వ్యాన్‌లో తీసుకురాగా, ధర్మపురి మండలంలోని రాయపట్నం వద్ద నలుగురు అతన్ని కలిసి వెల్గటూర్ మండలంలోని అంబారీపేట గ్రామం వద్దకు తీసుకువచ్చారు. అక్కడ ఇద్దరు వ్యక్తులు డ్రైవర్‌కు రూ.3.52 లక్షలు ఇచ్చి ఓనర్‌కు ఫోన్ చేసి డబ్బులు ముట్టినట్లు డ్రైవర్‌తో మాట్లాడించారు. అనంతరం వారు పక్కకువెళ్లి ఓనర్‌తో డిస్కౌంట్ ఇవ్వాలని కోరారు.

అదే సమయంలో మరొక ఇద్దరు వ్యక్తులు వ్యాన్ డ్రైవర్రామ్ భోజ్నే చేతులు కట్టేసి, నోట్లో గుడ్డ పెట్టి, వారి వెంట తీసుకువచ్చిన కారులో ఎక్కించారు. అనంతరం నలుగురు కలిసి డ్రైవర్‌కు ఇచ్చిన రూ.3.52,000 నగదు, సెల్‌ఫోన్ లాక్కొని, వ్యాన్‌కు గల జీపీఎస్ తీసివేశారు. ఇక్కడ జరిగిన విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి పంపించేశారు. దీనితో వ్యాన్ డ్రైవర్ రామ్ భోజ్నే కంపెనీ ఓనర్‌తో మాట్లాడి వెల్గటూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు స్పందించిన వెల్గటూర్ పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించారు. సోమవారం మండలంలోని రాజారాంపల్లి వద్ద అనుమానాస్పదంగా కారులో సంచరిస్తున్న నలుగురిని పట్టుకుని విచారించగా నేరం ఒప్పుకున్నట్లు డీఎస్పీ ప్రకాష్ తెలిపారు.

వారి వద్ద నుంచి పైపులతో పాటుగా, కారు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీన పరుచుకున్నట్లు వివరించారు. నిందితులను కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. సమావేశంలో ధర్మపురి సీఐ కోటేశ్వర్, ఎస్సై శంకర్ నాయక్, పోలీసులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed